శ్రీ సత్యసాయి జిల్లాలోని హిందూపురం నియోజకవర్గంలో స్థానిక సంస్థల రాజకీయం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ చుట్టూనే తిరుగుతోంది. ఆయన అనుకూల వర్గాలకే.. ఇక్కడ పీఠాలు దక్కనున్నాయని అంటున్నారు పరిశీలకులు. ప్రస్తుతం టీడీపీ జోరు ఎక్కువగా కనిపిస్తోంది. గత మూడు ఎన్నికల్లో బాలయ్య వరుస విజయాలు దక్కించుకుంటున్న నేపథ్యంలో ఆయన హవా స్పష్టంగా ఉందని అంటున్నారు. అదే సమయంలో గత ఎన్నికల్లో హిందూపురం పార్లమెంట్ స్థానాన్ని కూడా కూటమి అభ్యర్థి బి.కె. పార్థసారథి గెలుచుకున్నారు.
ఈ గెలుపు జోష్‌తో ఉన్న కూటమి పార్టీలు.. ముఖ్యంగా టీడీపీ నేతలు.. స్థానిక మున్సిపల్, గ్రామీణ రాజకీయాలపై దృష్టి పెట్టారు. 2025 ఫిబ్రవరిలో జరిగిన హిందూపురం మున్సిపల్ చైర్మన్ ఉప ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి రమేష్ కుమార్ చైర్మన్‌గా ఘనవిజయం సాధించారు. గతంలో వైసీపీకి ఇక్కడ బలం ఉన్నప్పటికీ.. సార్వత్రిక ఎన్నికల్లో ఓటమి పార్టీని బలహీనపరిచింది. దీంతో వైసీపీకి చెందిన 13 మంది కౌన్సిలర్లు టీడీపీలోకి ఫిరాయించి కూటమి అభ్యర్థికి మద్దతు ప్రకటించారు. మొత్తం 38 మంది కార్పొరేటర్లలో, రమేష్ కుమార్‌కు అనుకూలంగా 23 ఓట్లు రాగా, వైసీపీ అభ్యర్థి లక్ష్మికి కేవలం 14 ఓట్లు మాత్రమే దక్కాయి.
రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలకు కూటమి పార్టీలు.. ముఖ్యంగా టీడీపీ పక్కా రోడ్ మ్యాప్‌తో రెడీ అయింది. హిందూపురం నియోజకవర్గంలో క్లీన్ స్వీప్ చేయాలని నిర్ణయించింది. ఆ లక్ష్యంతోనే కూటమి శ్రేణులు అడుగులు వేస్తున్నారు. సాధారణ ఎన్నికల ఓటమి, మున్సిపల్ కౌన్సిలర్ల వలసల తర్వాత వైసీపీ ఇక్కడ దారుణమైన పరాభవాన్ని చవిచూస్తోంది. కేడర్ కూడా పార్టీకి అందిరావడం లేదు. దీనికితోడు.. నియోజకవర్గం ఇంచార్జ్ సహా.. ఇతర నేతలకు ఎక్కడా పొసగడం లేదు. మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్.. ఒంటెత్తు పోకడలు పార్టీని మరింతగా కుంగదీస్తున్నాయి.
కూటమి విషయానికి వస్తే.. సంక్షేమ పథకాలను అస్త్రంగా చేసుకుని ముందుకుసాగనుంది. అదేసమయంలో బాలయ్య ఇమేజ్.. ఆయన పనితీరు కూడా ఇక్కడ ప్రధానంగా ప్రభావం చూపనుందని అంటున్నారు. కొత్త పెన్షన్ల మంజూరు, హామీల అమలును ప్రభుత్వం వేగవంతం చేసింది. సో.. ఎమ్మెల్యే బాలయ్య నేతృత్వంలో హిందూపురం నియోజకవర్గంలో టీడీపీ తన కంచుకోటను మరింత పటిష్టం చేసుకునే దిశగా పరుగులు పెడుతోందని అంటున్నారు పరిశీలకులు.
Gulte Telugu Telugu Political and Movie News Updates