లక్ష కోట్లతో ‘రాయలసీమ రైజింగ్‘

ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రాష్ట్రాభివృద్ధి జెట్ స్పీడ్ లో జరుగుతున్న సంగతి తెలిసిందే. ఓ వైపు అమరావతి నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతుండగా…మరోవైపు, రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో పలు అభివృద్ధి పనులపై కూడా ప్రభుత్వం ఫోకస్ పెట్టింది. ఈ నేపథ్యంలోనే ఈ రోజు అన్నమయ్య జిల్లా మదనపల్లెలో “రాయలసీమ రైజింగ్” మెగా ప్రాజెక్ట్ ప్రారంభోత్సవ కార్యక్రమం జరగనుంది.

రాయలసీమను ప్రపంచ స్థాయి ఉద్యానవన కేంద్రంగా తీర్చిదిద్దేందుకు ఈ ప్రాజెక్టును చంద్రబాబు సర్కార్ ప్రతిష్టాత్మకంగా చేపట్టింది. ఈ రోజు ఉదయం 11 గంటలకు ప్రారంభం కాబోతున్న ఈ కార్యక్రమానికి ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ తదితరులు హాజరవుతున్నారు. కరువు సీమగా ముద్ర పడ్డ రాయలసీమను ప్రపంచ ఉద్యాన పంటల కేంద్రంగా మార్చడమే లక్ష్యంగా లక్ష కోట్ల రూపాయల పెట్టుబడితో ఈ ప్రాజెక్ట్ ను ప్రారంభించబోతున్నారు.

పూర్వోదయ పథకం కింద ప్రభుత్వ వాటా రూ. 40,352 కోట్లు, ప్రైవేట్ రంగం నుండి మరో రూ. 60,000 కోట్ల పెట్టుబడులలు కలిపి ఈ ప్రాజెక్ట్ చేపట్టబోతున్నారు. రాయలసీమలోని ఉమ్మడి జిల్లాలతో పాటు ప్రకాశం, మార్కాపురం ప్రాంతాలతో సహా మొత్తం 10 జిల్లాల్లో 201 ఉద్యాన క్లస్టర్లను అభివృద్ధి చేయబోతున్నారు.

2026 అక్టోబర్ నుండి 2029 జూలై వరకు మూడు దశల్లో ఈ ప్రాజెక్టును పూర్తి చేయాలని సంకల్పించారు. ప్రస్తుతం 8.41 లక్షల హెక్టార్లుగా ఉన్న ఉద్యాన సాగు విస్తీర్ణాన్ని 14.41 లక్షల హెక్టార్లకు పెంచడమే లక్ష్యంగా ప్రణాళికలు రచించారు. ఈ పథకం వల్ల దాదాపు దాదాపు 10 లక్షల మంది రైతులకు లబ్ధి చేకూరనుంది.

సాగునీటి ప్రాజెక్టుల కోసం రూ. 20,884 కోట్లు, ఉద్యానవన రంగానికి రూ. 14,906 కోట్లు, గ్రామీణ రోడ్ల అభివృద్ధి (5,721 కి.మీ) కోసం రూ. 4,562 కోట్లు ఖర్చు చేయనున్నారు. సీమలో పండే మామిడి, అరటి, టమోటా, దానిమ్మ, డ్రాగన్ ఫ్రూట్, అవకాడో వంటి పంటలను నేరుగా అంతర్జాతీయ మార్కెట్లకు ఎగుమతి చేసేందుకు అధునాతన కోల్డ్ స్టోరేజ్, ప్యాకింగ్, మరియు ప్రాసెసింగ్ యూనిట్లను ఏర్పాటు చేయబోతున్నారు. ఇక, ఈ ప్రారంభోత్సవంలో భాగంగా రిలయన్స్ ఫౌండేషన్ సహకారంతో ఏర్పాటు చేయనున్న ఇండియన్ స్కూల్ ఆఫ్ అగ్రికల్చర్ భవన నిర్మాణానికి సీఎం చంద్రబాబు శంకు స్థాపన చేయబోతున్నారు.