మల్టీస్టారర్ మూవీకి మర్చిపోలేని అవమానం

కాంబినేషన్ మత్తులో ఇప్పటికీ చాలా మంది ప్రొడ్యూసర్లు, దర్శకులున్నారు. ప్రాక్టికల్ గా క్షేత్ర స్థాయిలో ప్రేక్షకులు ఎలా అప్డేట్ అయ్యారో చెక్ చేసుకోకుండా ఇప్పటికీ పాత చింతకాయ పచ్చడితో కోట్ల రూపాయల బడ్జెట్ లను కర్పూరం చేస్తున్న డైరెక్టర్లు ఎందరో. గత నెల విడుదలైన హైవాన్ దానికి ఉదాహరణగా నిలుస్తోంది. ఫైనల్ థియేటర్ రన్ మొదటివారంలోనే పూర్తి చేసుకున్న ఈ అల్ట్రా డిజాస్టర్ నెట్ వసూలు 9 కోట్ల దగ్గరే ఆగిపోయాయని బాలీవుడ్ ట్రేడ్ రిపోర్ట్.

ఇది స్వయంకృతాపరాధమని చెప్పాలి. ఎందుకంటే ఎప్పుడో పదేళ్ల క్రితం వచ్చిన మలయాళం హిట్ మూవీ ఒప్పంని రీమేక్ చేయడమే పెద్ద రిస్క్. దానికి తోడు అక్షయ్ కుమార్ ని నెగటివ్ షేడ్ లో పెట్టి, సైఫ్ అలీ ఖాన్ ని గుడ్డివాడిని చేయడం జనాలు అసలు జీర్ణించుకోలేకపోయారు. ఒరిజినల్ వెర్షన్ మోహన్ లాల్ చేయడంలో న్యాయముంది. ఆయన ఇమేజ్ మాస్ చట్రంలో ఉండదు కాబట్టి ఎలాంటి ప్రయోగాలు అయినా చేయొచ్చు. కానీ అక్షయ్ ఆ క్యాటగిరీలోకి రాడు.

ప్రియదర్శన్ లాంటి లెజెండరీ దర్శకుడు ఇలాంటి నాసిరకమైన సినిమా ఇవ్వడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది. ట్రాజెడీ ఏంటంటే వరసగా భారీ సినిమాలతో దెబ్బ తింటున్న కెవిఎన్ ప్రొడక్షన్స్ బ్యానర్ లోనే ఇది రూపొందటం. వేగం కన్నా ఎక్కువగా క్వాలిటీకి ప్రాధాన్యం ఇవ్వాలని అక్షయ్ కుమార్ ని అభిమానులు డిమాండ్ చేస్తున్నా వాటిని ఆయన పట్టించుకోవడం లేదు. నా దారి నాదే మీ ఇష్టం అంటూ పదే పదే రీమేకుల వైపే మొగ్గు చూపుతున్నాడు.

హైవాన్ నేర్పిస్తున్న పాఠం ఒకటి ఫాలో కావాలి. ఆర్టిస్టులు డేట్లు ఇచ్చారనో లేదా వేరే కథలు దొరక్క పాత రీమేకులు చేస్తే డబ్బులు వస్తాయనో తొందరపాటు నిర్ణయాలు తీసుకుంటే ఇలాంటివి రిపీటవుతూనే ఉంటాయి. ఒకపక్క హనుమాన్ అంశ్ నాలుగు వందల కోట్ల వైపు పరుగులు పెడుతున్న టైంలో హైవాన్ లాంటివి ఇంత ఘోరంగా అవమానాల పాలు కావడం ఒక కేస్ స్టడీ లాంటివి. లక్కీగా టాలీవుడ్ లో పాత రీమేకులకు స్వస్తి చెప్పేసి వీలైనంత వరకు ఒరిజినల్ కథలకు కట్టుబడటం మంచి పరిణామం.