అమెరికా వీసా వచ్చేసింది కదా.. ఇక దాని గడువు ముగిసే వరకు ఎలాంటి ఇబ్బంది ఉండదని అనుకుంటే పొరపాటే. వీసా ఇచ్చిన తర్వాత కూడా దాన్ని రద్దు చేసే అధికారం అమెరికాకు ఉంటుంది. ఇప్పుడు అదే పెద్ద సంఖ్యలో జరుగుతోంది. 2025 జనవరి నుంచి ఇప్పటివరకు 2.5 లక్షలకు పైగా వీసాలను రద్దు చేసినట్లు అమెరికా విదేశాంగ శాఖ వెల్లడించింది. గత ఏడాదితో పోలిస్తే ఈ సంఖ్య దాదాపు రెండున్నర రెట్లు పెరిగింది.
ఇందులో విద్యార్థుల వీసాలు కూడా ఉన్నాయి. దాదాపు 8 వేల విద్యార్థి వీసాలను రద్దు చేసినట్లు అధికారులు తెలిపారు. మద్యం సేవించి వాహనం నడపడం, దాడులు, దొంగతనాలు వంటి కేసులతో పాటు ఇతర చట్టపరమైన సమస్యలు ఎదుర్కొన్న వారిపైనా చర్యలు తీసుకున్నట్లు అమెరికా చెబుతోంది. దేశ భద్రతకు ముప్పుగా భావించిన సందర్భాల్లో కూడా వీసాను రద్దు చేసే అవకాశం ఉంటుంది.
అలాగే వీసా ఇచ్చే సమయంలోనే అన్ని తనిఖీలు పూర్తయ్యాయని అనుకోవడానికి లేదు. వీసా వచ్చిన తర్వాత కూడా సంబంధిత వ్యక్తి వివరాలను అమెరికా అధికారులు పరిశీలిస్తున్నారు. అమెరికా వీసాలు ఉన్న దాదాపు 5.5 కోట్ల మంది విదేశీయుల వివరాలను అవసరమైనప్పుడు మళ్ళీ పరిశీలిస్తామని ఆ దేశ విదేశాంగ శాఖ గతంలోనే తెలిపింది. కొత్తగా పోలీసు కేసు నమోదైందా, వీసా నిబంధనలు ఉల్లంఘించారా, భద్రతాపరమైన సమస్య ఏమైనా ఉందా అనే విషయాలను చూస్తారు.
అమెరికాలో బిడ్డకు జన్మనివ్వడం కోసమే కొందరు పర్యాటక వీసాపై వెళ్తుంటారు. ఇలాంటి వారిపైనా అధికారులు ప్రత్యేకంగా ఫోకస్ పెడుతున్నారు. వీసా తీసుకునే సమయంలో చెప్పిన వివరాలు తప్పని తర్వాత తేలినా, కొత్తగా అనర్హతకు సంబంధించిన సమాచారం బయటపడినా వీసా రద్దయ్యే అవకాశం ఉంటుంది. అయితే ఈ 2.5 లక్షల మందిలో భారతీయులు ఎంతమంది అనే వివరాలను అమెరికా విడిగా వెల్లడించలేదు. ప్రస్తుతం బయటకు వచ్చిన లెక్క వివిధ దేశాలకు చెందిన వీసాదారులది.
Gulte Telugu Telugu Political and Movie News Updates
