AI వల్ల ఉద్యోగాలు, బ్యాంకింగ్, విద్య రంగాల్లో మార్పులు వస్తున్నాయనే ఆందోళన ఇప్పటికే ఉంది. ఇప్పుడు ఎన్నికలపైనా దీని ప్రభావం ఉండొచ్చని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ హెచ్చరించారు. ముంబైలో జరిగిన గ్లోబల్ ఫిన్‌టెక్ ఫెస్ట్‌లో మాట్లాడుతూ, ఏఐని ఆమె ‘రెండు వైపుల కత్తి’ అన్నట్లు పోల్చారు.
ప్రజలకు తెలియకుండానే వారి అభిప్రాయాలను ప్రభావితం చేసే శక్తి ఏఐకి ఉందని నిర్మలా చెప్పారు. ఒక వ్యక్తి ఏం చూస్తున్నాడు, ఏ విషయాలపై స్పందిస్తున్నాడు, ఏ అంశాలకు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నాడనే సమాచారం ఆధారంగా అతనికి ప్రత్యేకంగా కంటెంట్ చూపించే అవకాశం ఉందన్నారు.
ఇలాంటి టెక్నాలజీని రాజకీయ ప్రచారంలో ఉపయోగిస్తే ఓటర్ల నిర్ణయాలపైనా ప్రభావం పడొచ్చని ఆమె అభిప్రాయపడ్డారు. చివరకు ఎన్నికల ఫలితాలనే ప్రభావితం చేసే స్థాయికి వెళ్లే ప్రమాదం ఉందని హెచ్చరించారు. ఏఐ వల్ల వచ్చే ప్రయోజనాలతో పాటు ఇలాంటి రిస్కులను కూడా ముందుగానే గుర్తించాల్సిన అవసరం ఉందన్నారు.
ఫైనాన్స్ రంగంలో కూడా ఇదే సమస్య ఉందని నిర్మలా చెప్పారు. బ్యాంకులు, ఫిన్‌టెక్ కంపెనీలు మోసాలను గుర్తించడానికి ఏఐని ఉపయోగిస్తున్నాయి. అదే సమయంలో మోసగాళ్లు కూడా ఏఐ సహాయంతో కొత్త పద్ధతులు ఉపయోగించే అవకాశం ఉందన్నారు. అందుకే ఏఐని ఉపయోగించే సంస్థలు భద్రతపై మరింత జాగ్రత్తగా ఉండాలని సూచించారు.
కొత్త టెక్నాలజీ వేగంగా ముందుకు వెళ్తున్న సమయంలో రూల్స్ కూడా అదే వేగంతో మారాల్సిన అవసరం ఉందని నిర్మలా చెప్పారు. ప్రజల డేటా, డబ్బు, ఎన్నికలు వంటి సున్నితమైన విషయాల్లో AI ఎలా వాడాలి అనే విషయంలో స్పష్టమైన నియంత్రణ అవసరమని ఆమె పేర్కొన్నారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates