డబ్బులే కావాలనుకుంటే రియల్ ఎస్టేట్ చేసేవాడ్ని

నాకు డబ్బులే కావాలనుకుంటే రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకునే వాడ్ని, రియల్ ఎస్టేట్ వ్యాపారంలో ఇప్పుడు గొప్పలు చెప్పుకుంటున్న వాళ్లకు తాతను నేనంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విమర్శలు గుప్పించారు. శాసనసభలో సుదీర్ఘంగా మాట్లాడిన ఆయన తనదైన స్టైల్ లో విరుచుకొని పడ్డారు. దేవుడు నాకు అన్నీ ఇచ్చాడు. 17 ఏళ్ళలోనే జడ్పీటీసీ, ఎమ్మెల్సీ, ఎమ్మెల్యే, ఎంపీ, పీసీసీ చీఫ్, ముఖ్యమంత్రి పదవులు ఇచ్చాడు. ఇంకెందుకు కక్కుర్తి పడాలి అని ప్రశ్నించారు. నాకేం పైశాచిక కోరికలు లేవు కనుకనే రెండు నిముషాల్లోనే నిద్రలోకి జారుకుంటానని చెప్పారు.

నేను నిరుపేద కుటుంబంలో పుట్టాను. ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకున్నాను. గుంటూరులో చదువుకున్న ఆయన ఇంగ్లీష్ చూసి అసూయపడుతున్నానని నా గురించి ప్రచారం చేస్తున్నారు. ఆయనను చూసి అసహ్యించుకునే వాళ్ళున్నారు కానీ అసూయపడేవాళ్ళు ఎవరూ ఉండరని కేటీఆర్ గురించి పరోక్షంగా విమర్శలు గుప్పించారు. ఆయన బంట్రోత్తు ఉద్యోగానికి కూడా పనికిరాడని ఎద్దేవా చేశారు.

అందరూ జెన్ జీ గురించి ఆలోచిస్తున్నారని, నేను జెన్ ఆల్ఫా, జెన్ బీటా గురించి ఆలోచన చేస్తున్నానంటూ సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. తరగతి గదిలోనే దేశ భవిష్యత్ నిర్మాణం జరుగుతుందని బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పిన మాటలు గుర్తు చేసిన సీఎం పేద విద్యార్థులకు ఉపయోగపడాలనే విద్యా శాఖను తన వద్దే ఉంచుకున్నట్లు తెలిపారు. విద్యాహక్కు చట్టం ప్రకారం ప్రతి 30 మంది విద్యార్థులకు ఒక టీచర్ వుండాలని, తెలంగాణాలో ప్రతి 17 మందికి ఒక టీచర్ వున్నాడని తెలిపారు.

తెలంగాణాలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్క ఆరోపణ లేకుండా డీఎస్సీ పరీక్షలు నిర్వహించినట్లు రేవంత్ రెడ్డి చెప్పడం చర్చనీయాంశంగా మారింది. ప్రస్తుతం ఆంధ్ర ప్రదేశ్ లో డీఎస్సీ మీద ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో రేవంత్ రెడ్డి చెప్పిన మాటలకు ప్రాధాన్యత లభించింది. త్వరలో తెలంగాణాకు ప్రపంచ ప్రసిద్ధి చెందిన హార్వర్డ్ వర్శిటి, లండన్ వర్శిటి, వర్జినియా వర్శిటీలు వస్తున్నాయని, విద్యారంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకొని వస్తామని చెప్పారు.