కన్నీటి పర్యంతమైన బొత్స

వైసీపీ ఎమ్మెల్సీ బొత్స మేనల్లుడు, ఉత్తరాంధ్రలో వైసీపీ కీలక నేత, విజయనగరం జిల్లా వైసీపీ అధ్యక్షుడు మజ్జి శ్రీనివాసరావు (చిన్న శ్రీను) వైసీపీకి గుడ్ బై చెప్పిన సంగతి తెలిసిందే. భీమిలి నియోజకవర్గ వైసీపీ ఇన్‌ఛార్జ్‌, విజయనగరం జడ్పీ ఛైర్మన్‌ పదవుల నుంచి నుంచి ఆయన వైదొలగడంతో స్థానిక సంస్థల ఎన్నికలకు ముందు వైసీపీకి గట్టి షాక్ తగిలింది.

బొత్స కుటుంబానికి, వైసీపీ ఎమ్మెల్సీ బొత్సకు అత్యంత సన్నిహితుడైన చిన్న శ్రీను పార్టీ వీడి టీడీపీలో చేరడాన్ని బొత్స జీర్ణించుకోలేకపోయారు. ఈ క్రమంలోనే ఈ రోజు జరిగిన నేతలు, కార్యకర్తల సమావేశంలో బొత్స భావోద్వేగానికి లోనై ఏడ్చేశారు.

చీపురుపల్లి నియోజకవర్గంలోని గరివిడిలో వైసీపీ నేతలు, కార్యకర్తలతో బొత్స, ఆయన తనయురాలు అనూష సమావేశమయ్యారు. చిన్న శ్రీను వ్యవహారంపై చర్చ జరిగింది. అయితే, అనూహ్యంగా చిన్న శ్రీనుతో తనకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్న బొత్స కన్నీటి పర్యంతమయ్యారు. ఇప్పటి వరకూ బొత్స తరఫున ఆయన నియోజకవర్గం చీపురుపల్లి బాధ్యతలను నిర్వహించిన మజ్జి శ్రీను హఠాత్తుగా పార్టీని వీడడం బొత్స జీర్ణించుకోలేకపోయారు.

మజ్జి శ్రీనుకు సన్నిహితంగా ఉన్న నేతలు, కార్యకర్తలు ఎక్కువగా ఉన్న నేపథ్యంలో వారంతా వైసీపీలో ఉంటారా? తనకు మద్దతుగా నిలుస్తారా? అన్న బెంగతో బొత్స భావోద్వేగానికి లోనయ్యారని తెలుస్తోంది.
ఏడుస్తున్న బొత్సను ఆయన రాజకీయ వారసురాలు అనూష సముదాయించారు. ఇటీవల ఓ సందర్భంలో ఇలాగే బొత్స భావోద్వేగానికి లోనై కన్నీటి పర్యంతమయ్యారు. దీంతో, ఒకప్పుడు ఉన్న ఫైర్ బొత్సలో ఇప్పుడు లేదని కార్యకర్తలు అనుకుంటున్నారు.