వైసీపీ అధినేత జగన్ చిన్నాన్న వైఎస్ వివేకానందరెడ్డి దారుణ హత్యకు సంబంధించి సంచలన ఆరోపణలు చేస్తున్న సునీల్ యాదవ్ వ్యవహారం ఆసక్తిగా మారింది. ఈయన ఎవరు? ఎక్కడివారు? అంటూ.. నెటిజన్లు జోరుగా సెర్చ్ చేస్తున్నారు. నిన్న మొన్నటి వరకు సునీల్ యాదవ్ గురించి పెద్దగా తెలియకపోవడం.. తాజాగా ఆయన మాజీ సీఎం జగన్, ఆయన సతీమణి భారతిలపై తీవ్ర ఆరోపణలు చేయడంతో ఒక్కసారిగా లైమ్ లైట్‌లోకి వచ్చేశారు. దీంతో ఇప్పుడు సునీల్ యాదవ్ వ్యవహారం ఆసక్తికర చర్చగా మారింది.
ఎవరీ సునీల్ ?
సునీల్ యాదవ్.. కడప జిల్లాకు చెందిన వ్యక్తి. ఒక అకౌంటెంట్. వివేకానందరెడ్డి దగ్గర పీఏగా పనిచేశారు. అయితే.. వివేకా హత్యకు సంబంధించిన కుట్ర, రూ.40 కోట్ల సుపారీ వ్యవహారాల్లో సునీల్ యాదవ్ కీలకంగా వ్యవహరించారని సీబీఐ, ఈడీ అధికారులు పేర్కొంటున్నారు. వివేకానందరెడ్డిని హత్య చేసిన ఘటనలో ఆయన స్నేహితుడు ఎర్ర గంగిరెడ్డి ఏ1 ముద్దాయి అయితే.. సునీల్ యాదవ్ ఏ2గా ఉండడం గమనార్హం. దీనికితోడు.. 4 సంవత్సరాలు ఆయన జైల్లోఉండి.. అతికష్టమ్మీద బెయిల్‌పై బయటకు వచ్చారు.
తాజాగా..
తాజాగా.. ఈ హత్య వెనుక జగన్, ఆయన భార్య భారతి, కడప ఎంపి అవినాష్ రెడ్డిలు ఉన్నారని.. వారికే లబ్ధి చేకూరిందని చెప్పడం ద్వారా సునీల్ యాదవ్ రాత్రికి రాత్రి మీడియాలో చర్చకు వచ్చారు. ఈ కేసులో ఏ-1 నిందితుడు ఎర్ర గంగిరెడ్డి, ఉమాశంకర్ రెడ్డి, డ్రైవర్ దస్తగిరి తదితరులతో సునీల్ యాదవ్‌కు నేరుగా సంబంధాలు ఉన్నాయని, వీరంతా కలిసి ఈ హత్య పథకాన్ని అమలు చేశారని దర్యాప్తులో తేలింది. అంతేకాదు.. ఈ హత్య కేసులో ఆర్థిక లావాదేవీలు, హవాలా కోణాలపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) జరిపిన విచారణలో సునీల్ యాదవ్ నిందితుడిగా ఉన్నారు.
ఏం చేశారు?
వివేకా హత్య జరిగిన తర్వాత కోటి రూపాయల క్యాష్ తీసుకుని, అప్రూవర్‌గా మారిన డ్రైవర్ దస్తగిరికి అందజేసినట్లు సునీల్ యాదవ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ విచారణలో వెల్లడించారు. ఈ కేసుకు సంబంధించి సుమారు రూ. 40 కోట్ల సుపారీ ఫండింగ్, మనీలాండరింగ్ జరిగిందన్నారు. అయితే.. ఈ కేసులో సునీల్ ఏ2గా ఉన్న నేపథ్యం.. దీనికితోడు.. ఆయన చెప్పిన వివరాలతో జగన్ ఆయన సతీమణిని కూడా కేసులో నిందితులుగా చేర్చాలన్న డిమాండ్లు వినిపిస్తున్నాయి. మొత్తంగా సునీల్ యాదవ్ వ్యవహారం.. ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది.
Gulte Telugu Telugu Political and Movie News Updates
