కోవాగ్జిన్‌తో తేడా వ‌స్తే.. భార‌త్ బ‌యోటెక్ కీల‌క ప్ర‌క‌ట‌న‌

క‌రోనా మ‌హ‌మ్మారిపై పోరులో భాగంగా శ‌నివారం భారత్ పెద్ద ముంద‌డుగు వేసింది. దేశ‌వ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో క‌రోనా వ్యాక్సినేష‌న్ మొద‌లైంది. కోవిడ్ పోరులో కీల‌క పాత్ర పోషిస్తూ వ‌స్తున్న ఫ్రంట్ లైన్ వ‌ర్క‌ర్ల‌కు వ్యాక్సిన్ వేశారు. సీర‌మ్ ఇన్‌స్టిట్యూట్ వారి కోవిషీల్డ్‌తో పాటు భార‌త్ బ‌యోటెక్ వారి కోవాగ్జిన్‌ను దేశ‌వ్యాప్తంగా వేలాది మంది ఫ‌స్ట్ డోస్‌గా తీసుకున్నారు.

ఐతే వీరిలో దాదాపు 50 మంది దాకా అస్వ‌స్థ‌త‌కు గురి కావ‌డం, అందులో ఒక‌రి పరిస్థితి విష‌మంగా ఉన్న‌ట్లు వార్త‌లు రావ‌డం ఆందోళ‌న రేకెత్తించింది. ఇప్ప‌టికే నార్వే దేశంలో ఫైజ‌ర్ టీకా తీసుకున్న 23 మంది సైడ్ ఎఫెక్ట్స్ వ‌ల్ల‌ మృత్యువాత ప‌డ్డ‌ట్లు వార్త‌లొస్తుండ‌గా.. దేశంలో వ్యాక్సినేష‌న్ తొలి రోజు కొంద‌రు అస్వ‌స్థ‌త‌కు గురి కావ‌డం ఆందోళ‌న పెంచేదే.

ఐతే ఏ వ్యాన్సిన్‌తోనైనా కొంద‌రికి సైడ్ ఎఫెక్ట్స్ రావ‌డం స‌హ‌జ‌మే అని, దీన్ని మ‌రీ సీరియ‌స్‌గా తీసుకోవాల్సిన ప‌ని లేద‌ని వైద్య నిపుణులు అంటున్నారు. కాగా తాము త‌యారు చేసిన కోవాగ్జిన్ వ‌ల్ల దుష్ప్ర‌భావాలు ఉంటే.. ఆ పేషెంట్ కోలుకునే వ‌ర‌కు వైద్యం అందించ‌డంతో పాటు ప‌రిహారం కూడా చెల్లిస్తామంటూ భార‌త్ బ‌యోటెక్ కీల‌క ప్ర‌క‌ట‌న చేసింది. త‌ద్వారా వ్యాక్సిన్ తీసుకునేవారికి భ‌రోసా ఇచ్చే ప్ర‌య‌త్నం చేసింది. “టీకా వేసుకున్న తర్వాత అత్యంత తీవ్రమైన పరిస్థితులు తలెత్తితే అత్యున్నత ప్రమాణాలతో, ప్రభుత్వ ఆమోదం ఉన్న అధికారిక ఆస్పత్రుల్లో చికిత్స అందిస్తాం. వ్యాక్సిన్‌ కారణంగా దుష్ప్రభావాలు ఎదురయ్యాయని నిరూపితమైతే బీబీఐఎల్‌ నష్ట పరిహారం చెల్లిస్తుంది” అని భార‌త్ బ‌యోటెక్ ఓ ప్ర‌క‌ట‌న‌లో పేర్కొంది.

శ‌నివారం దేశ‌వ్యాప్తంగా మొత్తం 1,65,714 మంది కరోనా నిరోధక వ్యాక్సిన్‌ వేయించుకున్నట్లు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ ప్ర‌క‌టించింది.