రాజకీయాలకు అయ్యన్న గుడ్ బై

టీడీపీ సీనియర్ నేత, ఏపీ అసెంబ్లీ స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు సంచలన ప్రకటన చేశారు. రాబోయే ఎన్నికల్లో పోటీ చేయబోనని, ప్రత్యక్ష రాజకీయాలకు గుడ్ బై చెబుతున్నానని ఆయన ప్రకటించారు. తనకు వయసు పెరిగిపోయిందని, ఇక రెస్ట్ తీసుకుంటానని చెప్పారు. తనకు మిగిలి ఉన్న మూడేళ్ల పదవీ కాలంలో ప్రజలకు ఏదో ఒక మంచిపని చేయాలన్న ఉద్దేశ్యంతో ముందుకు వెళుతున్నానని తెలిపారు.

తన పుట్టిన రోజు సందర్భంగా రాజకీయాలకు రిటైర్మెంట్ ప్రకటించారు అయ్యన్న. ఈ ఏడాదితో తనకు 70 వచ్చేస్తున్నాయని, రాబోయే ఎన్నికల నాటికి 73 వస్తాయని అన్నారు. అందుకే, మూడేళ్ల తర్వాత రాజకీయాల నుంచి తప్పుకోవాలని, ఆ తర్వాత రెస్ట్ తీసుకోవాలని డిసైడ్ అయిపోయానని అన్నారు. తన పుట్టిన రోజు సందర్భంగా నర్సీపట్నం ఏరియా ఆస్పత్రిలో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాన్ని అయన్న ప్రారంభించారు. తన జన్మదినం సందర్భంగా 31 ఏళ్లుగా రక్తదాన శిబిరాలు నిర్వహిస్తున్నానని తెలిపారు. ఇప్పటి వరకు దాదాపు 36 వేల మంది తన పుట్టిన రోజు సందర్భంగా రక్తదానం చేశారని చెప్పారు.

అయ్యన్నపాత్రుడు రాజకీయాల నుంచి తప్పుకుంటానని ప్రకటించడం చర్చనీయాంశంగా మారింది. అయితే, అయ్యన్న చెప్పినట్లు రిటైర్ అవుతారా…లేక పార్టీ అవసరాల దృష్ట్యా అప్పుడు పోటీ చేయాలని చంద్రబాబు ఆదేశిస్తే ఎన్నికల్లో పోటీ చేస్తారా అన్న విషయం ఆసక్తికరంగా మారింది. మరోవైపు, తన తనయుడు చింతకాయల విజయ్ కు లైన్ క్లియర్ చేసేందుకే ఆయన తప్పుకోవాలని భావిస్తున్నారని తెలుస్తోంది. ప్రస్తుతం విజయ్ టీడీపీ తరఫున రాజ్యసభ సభ్యుడిగా 2026 నుంచి కొనసాగుతున్నారు. 2029 ఎన్నికల్లో విజయ్ ను అసెంబ్లీ ఎన్నికల బరిలో దించాలనే యోచనలో అయ్యన్న ఉన్నారని టాక్ వస్తోంది.