ఐబొమ్మ ర‌వికి ఒక గుడ్ న్యూస్… ఒక బ్యాడ్ న్యూస్

పైర‌సీ వెబ్ సైట్ తో తెలుగు.. త‌మిళం.. హిందీ.. ఇంగ్లిషు..ఆ భాష.. ఈ భాష అన్న తేడా లేకుండా సినిమాలు విడుద‌లైన గంట‌ల వ్య‌వ‌ధిలోనే త‌న వెబ్ సైట్ లో స్ట్రీమ్ అయ్యేలా చేసి.. తెలుగు ఇండ‌స్ట్రీకి నిద్ర లేకుండా చేసిన ఐబొమ్మ ర‌వి.. హైద‌రాబాద్ పోలీసుల్ని స‌వాలు చేయ‌టం.. ఆ త‌ర్వాత అత‌గాడు అరెస్టు కావ‌టం తెలిసిందే. ఒక్క‌సారి పోలీసుల చేతికి చిక్కితే ఎంత‌లా చుక్క‌లు క‌నిపిస్తాయ‌న్న విష‌యం ఐబొమ్మ ర‌వి ప‌రిస్థితి చూస్తే అర్థ‌మ‌వుతుంది.

బ్యాంక్ అకౌంట్లో రూ.3 కోట్ల క్యాష్ తో పాటు.. ఏ దేశ‌మ‌నుకుంటే ఆ దేశానికి వెళుతూ ద‌ర్జాగా ఎంజాయ్ చేసే అత‌గాడు.. గ‌డిచిన కొన్ని నెల‌లుగా హైద‌రాబాద్ లోనే ఉండిపోవ‌టం తెలిసిందే. అత‌గాడి బ్యాంక్ ఖాతాల్ని సీజ్ చేయ‌టంతో పాటు.. అత‌డి పాస్ పోర్టును స్వాధీనం చేసుకోవ‌టంతో హైద‌రాబాద్ ను విడిచి పెట్టి వెళ్ల‌లేని పరిస్థితి. అదే స‌మ‌యంలో బ్యాంక్ ఖాతాలో డ‌బ్బులు ఉన్నా.. దాన్ని వాడుకోలేని దుస్థితి. దీంతో తీవ్ర‌మైన ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న ర‌వి.. ఇటీవ‌ల కోర్టును ఆశ్ర‌యించ‌టం తెలిసిందే. తాను ఆర్థికంగా స‌మ‌స్య‌ల్లో ఉన్నాన‌ని.. ఫ్రీజ్ చేసిన త‌న బ్యాంక్ ఖాతాను అన్ ఫ్రీజ్ చేయాల‌ని కోరుతూ.. నాంప‌ల్లి న్యాయ‌స్థానాన్ని ఆశ్ర‌యించారు.

ఐబొమ్మ ర‌వి పిటిష‌న్ పై నాంప‌ల్లి కోర్టు తాజాగా విచార‌ణ చేప‌ట్టింది. ఈ సంద‌ర్బంగా ఇచ్చిన ఆదేశాల్ని చూస్తే.. అత‌డికి ఒకింత ఆనందం క‌లిగేలా ఉన్న‌ట్లు క‌నిపిస్తుంది. అదే స‌మ‌యంలో షాకిచ్చిన వైనం క‌నిపిస్తుంది. త్రిశంక స్వ‌ర్గంగా అత‌డి ప‌రిస్థితి. ఎందుకంటే.. నాంప‌ల్లి కోర్టు ఇచ్చిన ఆదేశం ప్ర‌కారం ఫ్రీజ్ చేసిన బ్యాంక్ అకౌంట్ అన్ ఫ్రీజ్ అవుతుంది. కానీ.. అకౌంట్లో ఉన్న డ‌బ్బుల మీద మాత్రం ఇంకా అన్ ప్రీజ్ చేసేలా కోర్టు ఉత్త‌ర్వులు ఇవ్వ‌లేదు.

దీంతో.. అకౌంట్ ను వాడుకోవ‌చ్చు. కానీ.. ఇప్ప‌టికే ఉన్న మూడు కోట్ల రూపాయిల్లో ఒక్క రూపాయిని కూడా వాడుకోవ‌టానికి ఐబొమ్మ ర‌వికి అవ‌కాశం ఉండ‌దు. ఫ్రీజ్ చేసిన బ్యాంక్ ఖాతాను వాడుకునే స‌దుపాయాన్ని మాత్ర‌మే కోర్టు క‌ల్పించింది. అంతే త‌ప్పించి ఖాతాల్లో ఉన్న డ‌బ్బుల్లో పైసాను కూడా తాక‌టానికి వీల్లేదు. ఈ ప‌రిణామం ఐబొమ్మ ర‌వికి కాసింత సంతోషాన్ని క‌ల్పించినా.. అంత‌కు వంద రెట్లు వేద‌న క‌లిగించేలా నాంప‌ల్లి కోర్టు ఆదేశాలు ఉన్న‌ట్లుగా చెబుతున్నారు. మొత్తంగా చూస్తే.. క‌నుచూపు దూరంలో ఐబొమ్మ ర‌వికి ఊర‌ట ల‌భించే అవ‌కాశాలు త‌క్కువ‌గా ఉన్నాయ‌ని చెబుతున్నారు. మ‌రేం జ‌రుగుతుందో కాల‌మే స‌రైన స‌మాధానం చెబుతుంద‌ని చెప్పాలి.