చైనా అధ్యక్షుడి కోసం ప్రోటోకాల్ బ్రేక్ చేసిన ట్రంప్

దగ్గరదగ్గర పది.. పన్నెండు రోజుల క్రితం ఢిల్లీ వేదికగా జరిగిన బ్రిక్స్ సదస్సులో చైనా అధినేత షీ జిన్ పింగ్ ప్రముఖంగా కనిపించారు. కట్ చేస్తే.. స్వల్ప వ్యవధిలో అమెరికాలో మూడు రోజుల పర్యటన కోసం వెళ్లారు. ముందుగా షెడ్యూల్ చేసిన పర్యటనగా చెబుతున్నప్పటికి.. చైనా అధ్యక్షుడి అమెరికా పర్యటన కేవలం రెండు రోజుల ముందే అధికారికంగా ప్రకటించటం గమనార్హం. మూడు రోజుల పాటు సాగే చైనా అధ్యక్షుడి అమెరికా పర్యటన సందర్భంగా రోటీన్ కు భిన్నంగా.. అసాధారణంగా కొన్ని పరిణామాలు చోటు చేసుకున్నాయి.

సాధారణంగా అమెరికా అధ్యక్షులు తమ దేశానికి వచ్చే విదేశీ నేతలకు వైట్ హౌస్ లోనే స్వాగతం పలుకుతారు. విమానాశ్రయాలకు వెళ్లరు. అందుకు భిన్నంగా డొనాల్డ్ ట్రంప్ 60 ఏళ్ల ప్రోటోకాల్ ను బ్రేక్ చేసి వాషింగ్టన్ వెలుపల ఉన్న జాయింట్బేస్ ఆండ్రూస్ మిలిటరీ ఎయిర్ ఫీల్డ్ కు స్వయంగా వెళ్లి.. చైనా అధ్యక్షుడు జిన్ పింగ్ కు విమానం వద్దే అసాధారణ రీతిలో స్వాగతం పలకటం ఆసక్తికరంగా మారింది. ఇలా స్వాగతం పలకటం గడిచిన 60 ఏళ్లలో అత్యంత అరుదైన అంశంగా చెబుతున్నారు.

1962లో అప్పటి అమెరికా అధ్యక్షుడు జాన్ ఎఫ్ కెన్నెడీ బ్రిటన్ ప్రధాని హెరాల్డ్ మాక్ మిలన్ కు రన్ వే మీద స్వాగతం పలికారు. ఆ తర్వాత మళ్లీ ఇప్పుడు చైనా అధ్యక్షుడి కోసం అమెరికా అధ్యక్షుడు ఎయిర్ పోర్టు రన్ వే వరకు వెళ్లారు. ఇక్కడే కొందరు మరో అంశాన్ని ప్రస్తావించే వీలుంది. అదేమంటే..ఇటీవల అంటే 2025 ఆగస్టులో రష్యా అధ్యక్షుడు వ్లాదిమర్ పుతిన్ కు అలస్కాలోని యాంకరేజ్ రన్ వే మీద ట్రంప్ స్వాగతం పలికారు కదా? అని ప్రశ్నించొచ్చు.

అయితే.. ఇక్కడో చిన్న వ్యత్యాసం ఉంది.
అదేమంటే.. నాటి పుతిన్ ట్రిప్ ఆయన అమెరికా పర్యటన కాదు. ఉక్రెయిన్ యుద్ధంపై చర్చల కోసం అలస్కాలో ఏర్పాటు చేసిన ప్రత్యేక సమ్మిట్ కు హాజరయ్యారు. కాబట్టి.. చైనా అధ్యక్షుడికి తాజాగా రన్ వే మీద స్వాగతం పలకటం రోటీన్ ప్రోటోకాల్ ను బ్రేక్ చేసినట్లుగా చెప్పొచ్చు. సాధారణంగా అగ్రదేశాలకు చెందిన అధినేతలు అమెరికాను పర్యటించే సందర్భాల్లో మీడియా హడావుడి ఒక రేంజ్ లో ఉంటుంది.

అయితే.. తాజా పర్యటన కవరేజ్ మొత్తం సైలెంట్ గా సాగింది. దీనికి కారణం వైట్ హౌస్ ప్రధాన టీవీ నెట్ వర్క్ లపై ట్రంప్ నిషేధం విధించిన సంగతి తెలిసిందే. ప్రధాన మీడియాపై ట్రంప్ సర్కారు విధించిన బ్యాన్ కు మద్దతుగా మిగిలిన మీడియా సంస్థలు కవరేజ్ ను బహిష్కరించటంతో ఒకలాంటి సైలెంట్ వాతావరణంలో చైనా అధినేత అమెరికా పర్యటన మొదలైందని చెప్పాలి. ఇదో అసాధారణమైన పరిణామంగా చెప్పొచ్చు.

సాధారణంగా చైనా అధ్యక్షుడు తాను జరిపే విదేశీ పర్యటనలకు తనతో పాటు పెద్ద ఎత్తున చైనా వ్యాపారవేత్తల టీంను వెంట పెట్టుకొని వస్తుంటారు. అయితే.. అమెరికా భద్రతా ఆంక్షలు.. ఇతర కారణాలతో ఈసారి చైనా అధినేత బిజినెస్ డెలిగేషన్ లేకుండా వచ్చారు. చైనా అధినేతకు వైట్ హౌస్ సౌత్ లాన్ మీద కొత్తగా నిర్మించిన స్టోన్ హెలిప్యాడ్ ను జిన్ పింగ్ కు చూపించారు. దీనికో ఆసక్తికర నేపథ్యం ఉంది. అదేమంటే.. గతంలో ట్రంప్ చైనా పర్యటనకు వెళ్లినప్పుడు అక్కడ ఉన్న భారీ నిర్మాణాలు.. భారీ భవనాలు చూసి ఇంప్రెస్ అయినట్లు చెబుతారు.

అదే విధంగా బీజింగ్ లోని గ్రేట్ హాల్ ఆఫ్ ది పీపుల్ భవనాన్ని చూసిన నేపథ్యంలో.. అమెరికా కూడా అలాంటి వాటిల్లో తక్కువేం కాదన్న విషయాన్ని చెప్పేందుకు వీలుగా తాము నిర్మిస్తున్న కొత్త హెలిప్యాడ్.. వైట్ హౌస్ బల్రూమ్ నిర్మాణాల్ని చూపించినట్లుగా చెబుతున్నారు.
వైట్ హౌస్ లో కొత్తగా నిర్మించిన స్టోన్ హెలిప్యాడ్ ను చైనా అధ్యక్షుడికి చూపిన అంశాన్ని మీడియాతో చెబుతూ.. తనకు మాదిరే జిన్ పింగ్ కు గ్రానెట్ రాళ్ల మీద మంచి అవగాహన ఉందన్న విషయాన్ని చెప్పారు.

అయితే.. ఇక్కడ ట్రంప్ తెలివి ఉందని చెప్పాలి. కీలక విషయాల గురించి మాట్లాడకుండా తప్పించుకోవటానికి.. ఆ విషయాన్ని కవర్ చేసేందుకు సంబంధం లేని అంశాల ప్రస్తావన తీసుకురావటం చేస్తుంటారు. తాజా చైనా అధ్యక్షుడి పర్యటన సందర్భంగా ఇలాంటి ట్రిక్ నే ట్రంప్ ప్రదర్శించారు. వైట్ హౌస్ నుంచి ఇద్దరు అధినేతలు బయటకు వచ్చినప్పుడు అక్కడ ఉన్న మీడియా ప్రతినిధులు గట్టిగా తైవాన్ అంశాన్ని.. ఏఐ రిస్కుల గురించి ప్రశ్నలు వేయటం మొదలు పెట్టారు. అలాంటి ప్రశ్నలకు సమాధానం చెప్పటం ఇష్టం లేని ట్రంప్.. తమ మీటింగ్ బాగా జరిగిందని.. షీ జిన్ పింగ్ కు గ్రానెట్ మీద మచి అవగాహన ఉందని.. చాలా విషయాలతో పాటు.. రాళ్ల మీద చాలా విషయాలు తెలుసని వ్యాఖ్యానించారు.

రాజకీయాల్లోకి రాకముందు ట్రంప్ రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయటం.. గ్రానెట్ మీద ఆయనకు బోలెడంత పట్టు ఉందని చెబుతారు. ఆ విషయాన్ని తనదైనశైలిలో ట్రంప్ ప్రస్తావించారు.