కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్ జ్ఞానేష్ కుమార్‌ను అభిశంసించాలన్న డిమాండ్ పెరుగుతోంది. ఆ పదవికి ఆయన అనర్హుడని.. పేర్కొంటూ.. కాక్రోచ్ జనతా పార్టీ 2.0 ఉద్యమానికి రెడీ అవుతోంది. ఇప్పటికే దీనికి సంబంధించిన ప్రకటన కూడా ఇచ్చారు. 48 గంటల్లో జ్ఞానేష్ కుమార్ తన పదవిని వదులుకోకపోతే.. జంతర్ మంతర్ వద్దే తమ నిరసన ఉంటుందని కూడా స్పష్టం చేశారు. మరోవైపు కాంగ్రెస్ పార్టీ కూడా.. జ్ఞానేష్ కుమార్‌పై నిప్పులు చెరుగుతోంది. ఈ నేపథ్యంలో జ్ఞానేష్ కుమార్ కేంద్రంగా ఉద్యమాలు, నిరసనలు పెరగనున్నాయి.
తాజాగా .. శుక్రవారం కాంగ్రెస్ పార్టీ దేశవ్యాప్తంగా నిరసనలకు పిలుపునిచ్చింది. జ్ఞానేష్ రాజీనామా డిమాండ్‌తో దేశవ్యాప్తంగా నిరసనలు, ర్యాలీలు చేపట్టాలని, అన్నిక లెక్టర్ కార్యాలయాల వద్ద మోహరించి.. ఆందోళన చేయాలని రాహుల్ గాంధీనే పిలుపునిచ్చారు. దీంతో శ్రేణులు దేశవ్యాప్తంగా ఉద్యమించేందుకు రెడీ అయ్యాయి. మరోవైపు.. పార్లమెంటు వేదికగా కూడా జ్ఞానేష్ రాజీనామా కోరుతూ.. వినతులు ఇచ్చే ప్రక్రియకు శ్రీకారం చుట్టారు. అదేవిధంగా అభిశంసన తీర్మానం కూడా ప్రవేశ పెట్టనున్నారు.
ప్రస్తుతం పార్లమెంటు వర్షాకాల సమావేశాలను వాయిదా మాత్రమే వేశారు. పూర్తిగా ప్రోరోగ్(తదుపరిసమావేశాల వరకు వాయిదా) చేయలేదు. దీంతో ఎప్పుడు పార్లమెంటు ప్రారంభమైనా.. ఈ సమస్యను ఉభయ సభల్లో చర్చించాలని నిర్ణయించారు. మొత్తంగా జ్ఞానేష్ కుమార్ చుట్టూ వివాదాలు ముసురుకున్నాయి. సుప్రీంకోర్టు న్యాయమూర్తికి ఉండే అధికారాలు, ప్రొటోకాల్‌కు సమానమైన.. కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్‌పై గతంలోనూ వివాదాలు, విమర్శలు వచ్చినా.. ఇప్పుడు వచ్చినంతగా ఎప్పుడూ లేకపోవడం గమనార్హం.
పార్టీల సమస్యేనా?
జ్ఞానేష్‌ను ఆ పదవి నుంచి తప్పించాలన్న డిమాండ్.. ఒక్క రాజకీయ పార్టీలదేనా? లేక.. ప్రజల సమస్యా? అంటే.. దీనిపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. తమ ఓటు హక్కు పోయిందని అనేక రాష్ట్రాల్లో ఓటర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నా.. జ్ఞానేష్‌ను లక్ష్యంగా చేసుకోలేదు. కేవలం సర్ ప్రక్రియను అది కూడా.. 2002లో ఉన్న జాబితాలో పేర్ల వ్యవహారంపై మాత్రమే విమర్శలు గుప్పించారు. కానీ, రాజకీయ పార్టీలు మాత్రం జ్ఞానేష్‌ను లక్ష్యంగా చేసుకున్నాయన్న వాదన వినిపిస్తోంది. కేంద్రంతో మిలాఖత్ అయి.. తమ ఓటుబ్యాంకుకు గండికొడుతున్నారన్న వాదనను కాంగ్రెస్ పార్టీ సహా ఇతర పక్షాలు చెబుతున్నాయి. దీంతో ప్రజల కంటే కూడాపార్టీలకు జ్ఞానేష్ సెంట్రిక్‌గా మారారనడంలో సందేహం లేదు.
Gulte Telugu Telugu Political and Movie News Updates