కర్నూలు జిల్లా కౌతాళం మండలం వల్లూరు ఎంపీపీఎస్ (న్యూ) పాఠశాలలో క్రీడా కోటా కింద ఈడిగ ప్రభాకర్ ఎస్‌జీటీ (తెలుగు)గా ఎంపిక, పోస్టింగ్ ప్రక్రియలో అక్రమాలు జరిగాయంటూ వస్తున్న మీడియా కథనాలపై పాఠశాల విద్యాశాఖ స్పందించింది. ఈ వ్యవహారంపై శాఖాపరమైన దర్యాప్తు ప్రారంభించినట్లు పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ తెలిపారు.
ఘటన గురించి తెలిసిన వెంటనే శాఖాపరమైన విచారణ చేపట్టామని పేర్కొన్నారు. ఉన్నతాధికారులు విచారణ ప్రక్రియను పర్యవేక్షిస్తున్నట్లు తెలిపారు. కర్నూలు డీఈఓ ఇప్పటికే విచారణ ప్రారంభించి, సమగ్ర పరిశీలన కోసం సంబంధిత రికార్డులు, ధ్రువీకరణ (వెరిఫికేషన్) ఫైళ్లను తెప్పించినట్లు వెల్లడించారు.
విచారణ పూర్తయి నివేదిక అందిన అనంతరం నియామక, సర్వీసు నిబంధనలకు అనుగుణంగా తగిన చర్యలు తీసుకుంటామని పాఠశాల విద్యాశాఖ స్పష్టం చేసింది. ఆరోపణలపై వాస్తవాలను పూర్తిస్థాయిలో పరిశీలించిన తర్వాతే తదుపరి నిర్ణయం తీసుకుంటామని పేర్కొంది.
మెగా డీఎస్సీ–2025 నియామక ప్రక్రియలో సంపూర్ణ పారదర్శకత, ప్రతిభ ఆధారిత ఎంపిక విధానాన్ని అవలంబించినట్లు పాఠశాల విద్యాశాఖ పునరుద్ఘాటించింది. నియామక ప్రక్రియలో నిబంధనలను పాటించామని స్పష్టం చేసింది. ఈ మేరకు పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ ప్రకటన విడుదల చేశారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates