త్వరలో జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికలను ఉద్దేశించి టీడీపీ అధినేత, సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేష్‌లు సీరియస్‌గా ఉన్న విషయం తెలిసిందే. పార్టీ శ్రేణులను ఎప్పటికప్పుడు ఉత్సాహ పరుస్తున్నారు. జిల్లాల్లో పర్యటించిన ప్రతిసారీ కార్యకర్తలకు పిలుపునిస్తున్నారు. వారికి దిశానిర్దేశం కూడా చేస్తున్నారు. అంతేకాదు.. “స్థానిక ఎన్నికలే కదా అని లైట్ తీసుకోవద్దు తమ్ముళ్లూ.“ అని కూడా చంద్రబాబు చెబుతున్నారు. పార్టీని ముఖ్యంగా కూటమిని మరింత బలోపేతం చేసేందుకు స్థానిక ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకోవాలని చెబుతున్నారు.
ముఖ్యంగా కూటమి హయాంలో అమలు చేస్తున్న సంక్షేమం, పథకాలు.. పెట్టుబడుల రాక, ఉద్యోగాల కల్పన, ఉపాధి కల్పన వంటి అంశాలను ప్రజలకు వివరించి.. స్థానిక ఎన్నికలను ఏకగ్రీవాలుగా చేసేందుకు కృషి చేయాలని కూడా చెబుతున్నారు. పైగా కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత జరుగుతున్న మొదటి స్థానిక ఎన్నికలు కావడంతో వీటిని ప్రతిష్టాత్మకంగా తీసుకోవాలని కూడా సూచిస్తున్నారు. అందుకే ప్రత్యర్థి పార్టీకి ఒక్క స్థానం కూడా దక్కకుండా వన్‌సైడ్‌గా గెలవాలని చంద్రబాబు గట్టిగా ఆదేశించారు.
మరీ ముఖ్యంగా నియోజకవర్గాల నేతలు, ఎమ్మెల్యేలు, ఎంపీలకు ఈ బాధ్యతలను అప్పించారు. సాధారణంగా అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచాక స్థానిక ఎన్నికలపై కొంత నిర్లక్ష్యం ఏర్పడుతుంది. అలా జరగకుండా ప్రతి ఒక్కరూ బాధ్యతగా పనిచేయాలని స్పష్టం చేశారు.
ప్రజల ఆమోదంతోనే టిక్కెట్లు: స్థానిక ప్రజల అభీష్టం మేరకే కూటమి తరపున అభ్యర్థుల ఎంపిక ఉంటుందని, గెలుపు బాధ్యత స్థానిక నేతలే తీసుకోవాలని సూచించారు. విపక్షాల వ్యూహాలపై అప్రమత్తతతో వ్యవహరించాలని కూడా పేర్కొన్నారు.
మరి ఏం జరుగుతోంది.. ?
పార్టీ అధినేత చంద్రబాబు, యువ నాయకుడు నారా లోకేష్ ఇంత చెబుతున్నా.. క్షేత్రస్థాయిలో సగానికిపైగా జిల్లాల్లో నాయకుల వ్యవహారం ఎక్కడా దూకుడు కనిపించడం లేదు. నాయకులు ఎవరికి వారుగా వ్యవహరిస్తున్నారు. ప్రస్తుతం తమ వారసులను రంగంలోకి దింపేందుకు, మేయర్ పీఠాలు దక్కించుకునేందుకు ఉన్న శ్రద్ధ క్షేత్రస్థాయిలో కేడర్‌ను నడిపించేందుకు ముందుకు రావడం లేదు. ఎన్నికలకు ఇంకా సమయం ఉందని మెజారిటీ ఎమ్మెల్యేలు బహిరంగ వ్యాఖ్యలు చేస్తున్నారు. ఈ విషయాన్ని తాజాగా మంత్రి లోకేష్ అనంతపురంలో ప్రస్తావించారు. లైట్ తీసుకోవద్దని ఆయన సూచించారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates