కేంద్రం అమల్లోకి తెచ్చిన మూడు వ్యవసాయ చట్టాల వివాదానికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) మాజీ గవర్నర్ సీ. రంగరాజన్ చక్కటి పరిష్కారాన్ని చూపారు. కేంద్రం మూడు నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతుసంఘాలు ఉద్యమాలు చేస్తున్న విషయం అందరికీ తెలిసిందే. వ్యవసాయ చట్టాలను రద్దు చేయాల్సిందే అని రైతుసంఘాలు పట్టుబడుతుండగా, రద్దు సమస్య లేదని కావాలంటే సవరణలు తీసుకొస్తామని కేంద్రం చెబుతోంది.
ఈ ఒక్క పాయింట్ దగ్గరే సమస్య ఎంతకీ తెగక ఢిల్లీ-హర్యానా సరిహద్దుల్లోని సింఘూ వద్ద గడచిన 50 రోజులుగా పెద్దఎత్తున ఉద్యమం జరుగుతోంది. ఇదే విషయమై ఆర్బీఐ మాజీ గవర్నర్ సీ. రంగరాజన్ మాట్లాడుతూ వ్యవసాయ చట్టాల అమలు విషయాన్ని కేంద్రం రాష్ట్రాలకు వదిలేయాలని స్పష్టంచేశారు. నిజానికి ఇపుడు వ్యవసాయచట్టాలు చేయటం, వాటిని అమలు చేయటం, చట్టాల నియంత్రణ లాంటివన్నీ ఇపుడు కేంద్రం చేతిలో ఉన్నాయి.
అయితే చట్టాలు చేయటం, అమలు చేయటం తప్ప ఇతరత్రా విషయాలేవీ కేంద్రం చేతిలో లేవన్న విషయం తెలిసిందే. జరుగుతున్న వ్యవసాయం మొత్తం రాష్ట్రాల పరిధుల్లోనే ఉన్నాయి. మళ్ళీ ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రం ప్రత్యేకంగా వ్యవసాయరంగానికి తమ బడ్జెట్లో కేటాయింపులు కూడా చేసుకుంటున్నాయి. చట్టాలు చేయటం మినహా ఇతరత్రా ఏ విధంగాను పాత్రలేని కేంద్రానికి వ్యవసాయచట్టాలు చేయాల్సిన అవసరం ఏమిటని రంగరాజన్ ప్రశ్న.
రంగరాజన్ ప్రశ్న చాలా అర్ధవంతంగానే ఉంది. ఇప్పటి వివాదాస్పద వ్యవసాయ చట్టాల అమలును కేంద్రం రాష్ట్రాల మీద రుద్దకూడదన్నారు. వ్యవసాయ చట్టాలను అమలు అవకాశాలను కేంద్రం రాష్ట్రాలకు ఇచ్చేస్తే సమస్య పరిష్కారమవుతుందన్నారు. కేంద్ర చట్టాలను అమలు చేయాలని అనుకుంటున్న రాష్ట్రప్రభుత్వాలు అందుకు చొరవ తీసుకుంటాయని లేకపోతే పాత చట్టాలను అదీకాకపోతే తమకు అనువుగా ఉండే చట్టాలను రాష్ట్రాలే తీసుకుంటాయని మాజీ గవర్నర్ చేసిన సూచన బాగానే ఉంది.