ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ( SIR ) చిక్కుముడిగా మారింది. ఎస్‌ఐఆర్ ప్రక్రియ కొనసాగుతుండగా స్థానిక ఎన్నికలు నిర్వహించడం సహేతుకం కాదంటూ వైసీపీ కోర్టును ఆశ్రయించింది. ఓటమి భయంతోనే వైసీపీ కావాలనే ఎన్నికలను అడ్డుకునే ప్రయత్నం చేస్తోందని టీడీపీ ఆరోపిస్తోంది.
ఈ నేపథ్యంలో వైసీపీ ప్రధాన కార్యదర్శి లేళ్ల అప్పిరెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌పై మంగళవారం హైకోర్టులో విచారణ జరిగింది. ఎస్‌ఐఆర్ కొనసాగుతుండగా ఎన్నికలు ఎలా నిర్వహిస్తారని న్యాయస్థానం రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. సవరణలో పేర్లు తొలగింపునకు గురైనవారు అప్పీలు చేసుకుని తిరిగి ఓటు హక్కు పొందే అవకాశం ఉందని, దీంతో తుది జాబితాలో మార్పులు జరిగే అవకాశం ఉందని జస్టిస్ వి.సుజాత పేర్కొన్నారు.
వైసీపీ తరఫున సీనియర్ న్యాయవాది సుబ్రమణ్య శ్రీరాం వాదిస్తూ.. అక్టోబరు 3 నాటికి ఎస్‌ఐఆర్ పూర్తయి తుది ఓటర్ల జాబితా వెలువడుతుందని తెలిపారు. తాము ఎన్నికలను వాయిదా వేయాలని కోరడం లేదని, నామినేషన్ల చివరి తేదీ వరకు ఓటర్ల జాబితాలో జరిగే చేర్పులు, మార్పులను పరిగణనలోకి తీసుకుని ఎన్నికలు నిర్వహించాలని కోరుతున్నట్లు స్పష్టం చేశారు. అయితే రాష్ట్ర ప్రభుత్వం తరఫున అడ్వకేట్ జనరల్ దమ్మాలపాటి శ్రీనివాస్ వాదిస్తూ.. ఓటర్ల జాబితా సవరణ ఎన్నికల నిర్వహణకు అడ్డంకి కాదన్నారు. అక్టోబరు మొదటి వారంలో స్థానిక ఎన్నికల నోటిఫికేషన్ వెలువడే అవకాశం ఉందన్నారు.
ఎస్‌ఐఆర్ పూర్తయ్యే వరకు ఎన్నికలను నిలిపివేస్తే మొత్తం ప్రక్రియను మళ్లీ మొదటి నుంచి చేపట్టాల్సి వస్తుందని, ఇందుకు ఐదు నుంచి ఆరు నెలల సమయం పట్టే అవకాశం ఉందని రాష్ట్ర ఎన్నికల సంఘం తరఫున న్యాయవాది కనపర్తి అజయ్ తెలిపారు.
ఎన్నికల నిర్వహణపై ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలోని ధర్మాసనం ఇప్పటికే వ్యాజ్యాలను విచారిస్తున్నందున.. వైసీపీ దాఖలు చేసిన పిటిషన్‌ను ఆ ధర్మాసనం ముందున్న కేసులతో జత చేయాలని జస్టిస్ వి.సుజాత రిజిస్ట్రీని ఆదేశించారు. దీంతో ఎస్‌ఐఆర్ పూర్తయ్యే వరకు ఎన్నికలు నిర్వహించాలా? లేక నోటిఫికేషన్ నాటికి అందుబాటులో ఉన్న జాబితాతోనే ఎన్నికలు కొనసాగించాలా? అన్నది కీలకంగా మారింది.
Gulte Telugu Telugu Political and Movie News Updates
