అవును… సాయిరెడ్డిని సజ్జల కొట్టారు: కోటంరెడ్డి

ఒకప్పుడు వైసీపీలో చక్రం తిప్పిన విజయ సాయిరెడ్డి ప్రస్తుతం ఆ పార్టీపై తిరుగబాటు బావుటా ఎగురవేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ఆ పార్టీలో కీలక వ్యక్తిగా కొనసాగుతున్న సజ్జలే వైసీపీలో నంబర్ వన్ అని, జగన్ నంబర్ 2 అని సాయిరెడ్డి చేసిన వ్యాఖ్యలు సంచలనం రేపాయి. ఇక, గతంలో జగన్ సమక్షంలో తనపై సజ్జల చేయి చేసుకున్నారని, అయినా జగన్ స్పందించలేదని షాకింగ్ కామెంట్స్ చేశారు. ఈ క్రమంలోనే సాయిరెడ్డి వ్యాఖ్యలపై ఒకప్పటి వైసీపీ ఎమ్మెల్యే, ప్రస్తుత టీడీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి స్పందించారు.

గతంలో మంగళగిరిలో వైసీపీ ప్లీనరీ సందర్భంగా విజయసాయిరెడ్డిని సజ్జల రామకృష్ణారెడ్డి కొట్టడం నిజమేనని కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి నిర్ధారించారు. అంతేకాదు, అసలు ఆ దాడికి గల కారణాలను కూడా ఆయన వెల్లడించారు. ప్లీనరీ వేదికపై ఎవరితో మాట్లాడించాలనే విషయంపై ఇద్దరి మధ్య వివాదం ఏర్పడిందని కోటం రెడ్డి చెప్పారు. ఆ క్రమంలోనే ఇరువురి మధ్య మాటా మాటా పెరిగి చివరకు సాయిరెడ్డిపై సజ్జల చేయి చేసుకున్నారని చెప్పారు.

తనకు 74 అవమానాలు జరిగాయని విజయసాయిరెడ్డి చెప్పారని, కానీ తనకు తెలిసి మరో అవమానం కూడా ఆయనకు జరిగిందని గుర్తు చేసుకున్నారు. ఎన్నికల ప్రచారం సందర్భంగా సొంతూరు తాళ్లపూడి వచ్చినప్పుడు కాకుపల్లి సెంటర్ లో 100 వాహనాలతో స్వాగతం పలికిన కారణంతో సాయిరెడ్డిని సజ్జల బండ బూతులు తిట్టారని గుర్తు చేసుకున్నారు.

ఇక, ఏపీలో కులాలు, మతాల మధ్య చిచ్చు పెడుతున్న వైసీపీ వికృత రాజకీయాలకు తెర తీసిందని విమర్శించారు. ప్రాజెక్టులన్నీ కట్టింది జగన్ అని, దేశానికి స్వాతంత్రం తెచ్చింది కూడా ఆయనే అన్న రీతిలో వైసీపీ క్రెడిట్ చోరీకి పాల్పడుతోందని ఎద్దేవా చేశారు. మరి, కోటంరెడ్డి కామెంట్లపై సజ్జల రియాక్షన్ ఏమిటి అన్నది ఆసక్తికరంగా మారింది.