క్లారిటీ ఇవ్వాలంటోన్న సేన‌.. వెయిట్ అంటోన్న సేనాని..!

ఏపీలో స్థానిక సంస్థ‌ల‌కు ఎన్నిక‌లు నిర్వ‌హించేందుకు ప్ర‌భుత్వం రెడీ అయింది. దీనికి సంబంధించిన ఓట‌ర్ల జాబితా, పోలింగ్ కేంద్రాల ఏర్పాటు.. అధికారుల నియామ‌కంపై రాష్ట్ర ఎన్నిక‌ల సంఘం పూర్తిస్థాయిలో దృష్టి పెట్టింది. ఇప్ప‌టికే రాష్ట్ర వ్యాప్తంగా ఓట‌ర్ల గుర్తింపు జాబితాను సిద్ధం చేసే ప‌ని యుద్ధ‌ప్రాతిప‌దిక‌న సాగుతోంది. రాజ‌కీయ ప‌క్షాలు కూడా సిద్ధ‌మ‌వుతున్నాయి. ఈ నేప‌థ్యంలో త‌మ సంగ‌తేంట‌న్న‌ది జ‌న‌సేన పార్టీ నుంచి పెద్ద ఎత్తున ప్ర‌య‌త్నాలు సాగుతున్నాయి.

నిజానికి ఈ ఎన్నిక‌లు ఇప్పట్లో జ‌రుగుతాయా? లేదా? అనే సందేహం ఉన్నా.. ఎప్పుడు ఎన్నిక‌లు జ‌రిగినా త‌మకు గౌర‌వ స్థాయిలో సీట్లు ఇవ్వాల‌న్న డిమాండ్ జ‌న‌సేన‌లోనే ఎక్కువ‌గా ఉంది. అయితే.. ఈ విషయంపై పార్టీ అధినేత, డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ల్యాణ్ నిర్ణ‌యం తీసుకోలేదు. క్షేత్ర‌స్థాయిలో ఉన్న బ‌లాబ‌లాల‌ను ఆయ‌న అంచ‌నా వేసుకుని ముందుకు సాగుతామ‌ని చెబుతున్నారు. దీంతో పార్టీలో నెల‌కొన్న ప‌రిస్థితిని చ‌క్క‌దిద్దేందుకు క‌మిటీల‌ను ఏర్పాటు చేశారు. క్షేత్ర‌స్థాయిలో ఆయా క‌మిటీ స‌భ్యులు ప‌ర్య‌టించారు.

ఈ ప్ర‌క్రియ కూడా పూర్త‌యింది. ఎమ్మెల్యే మండ‌లి బుద్ధ‌ప్ర‌సాద్ నేతృత్వంలోని క‌మిటీ సుమారు 2వేల పేజీల‌తో కూడిన నివేదిక‌ను కూడా రెడీ చేసింద‌ని మంత్రి నాదెండ్ల మ‌నోహ‌ర్ చూచాయ‌గా చెప్పుకొచ్చారు. ఈ జాబితాలో క్షేత్ర‌స్థాయిలో ఉన్న ప‌రిస్థితిని వివ‌రించ‌డంతోపాటు.. నాయ‌కుల పేర్లు కూడా పేర్కొన్నారు. అంతేకాదు.. మండ‌లి ఇటీవ‌ల ఓ కార్య‌క్ర‌మంలో మాట్లాడుతూ.. ఆత్మ‌గౌర‌వం నిలబెట్టేలా తాము ప‌నిచేస్తున్నామ‌ని.. కార్య‌క‌ర్త‌ల‌కు అన్యాయం జ‌ర‌గ‌ద‌ని తేల్చి చెప్పారు.

కానీ.. క్షేత్ర‌స్థాయి నాయ‌కులు మాత్రం ప‌ర్సంటేజీ కోసం పాకులాడుతున్నారు. క‌నీసం జ‌న‌సేన కు 40 శాతం సీట్లు ఇవ్వాల‌ని ఓ వ‌ర్గం నాయ‌కులు డిమాండ్ చేస్తుండ‌గా.. కొంద‌రు ఎమ్మెల్యే లు 25-35 శాతం స్థానాల్లో పోటీ చేయాల ని.. ఎక్క‌డ పోటీ చేసినా గెలుపు గుర్రం ఎక్క‌డం ఖాయ‌మ‌ని అంటున్నారు. ఈ విష‌యంపై పెద్ద ఎత్తున చ‌ర్చ జ‌రుగుతున్న నేప‌థ్యంలో పార్టీ నుంచి కీల‌క ప్ర‌క‌ట‌న వెలువ‌డించింది. ఎవ‌రూ బ‌హిరంగ వ్యాఖ్య‌లు చేయొద్ద‌ని.. అంతా అధినేత చూసుకుంటార‌ని చెప్పారు. సోమ‌వారం నుంచి రెండు మూడు రోజుల్లోనే ఈ విషయంపై పెద్ద ఎత్తున చ‌ర్చ‌లు జ‌రిగే అవ‌కాశం ఉంద‌ని పార్టీ వ‌ర్గాలు చెబుతున్నాయి.