ఒకే కారులో బీజేపీ ఎంపీ, బీఆర్ఎస్ ఎమ్మెల్యే!

తమ తమ నియోజకవర్గాల్లో ఏవైనా అభివృద్ధి కార్యక్రమాల సందర్భంగా వేర్వేరు పార్టీలకు చెందిన ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు హాజరు కావడం సర్వ సాధారణం. ఆయా నేతలు ఒకే వేదికను పంచుకున్న సందర్భాలు కూడా అనేకం ఉన్నాయి. అయితే, వేర్వేరు పార్టీలకు చెందిన నేతలు ఒకే కారులో ప్రయాణించిన ఘటనలు మాత్రం చాలా అరుదు. తాజాగా తెలంగాణలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే కొత్తా ప్రభాకర్ రెడ్డి, బీజేపీ ఎంపీ రఘునందన్ రావు ఒకే కారులో ప్రయాణించిన ఘటన ఇప్పుడు చర్చనీయాంశమైంది.

సిద్ధిపేట జిల్లా అక్బర్ పేట భూంపల్లిలో అభివృద్ధి పనులను ప్రారంభించే కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి హాజరయ్యేందుకు రఘునందన్ రావు, కొత్తా ప్రభాకర్ రెడ్డి, ఎస్సీ ఎస్టీ కమిషనర్ కలిసి ఒకే కారులో ప్రయాణించిన వైనం చర్చనీయాంశమైంది. వారిద్దరూ కలిసి ఓ భవనాన్ని రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. మరో భవన నిర్మాణ శంకు స్థాపన శిలా ఫలకాన్ని ఆవిష్కరించారు.

అయితే, ఉప్పు, నిప్పు మాదిరి ఉన్న ఈ ఇరు పార్టీలకు చెందిన నేతలు ఒకే కారులో ప్రయాణించిన వైనం హాట్ టాపిక్ గా మారింది. ఒకవేళ ప్రభాకర్ రెడ్డి ఏమైనా పార్టీ మారబోతున్నారా అంటూ సోషల్ మీడియాలో నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.