మార్పు మంచిదే. కానీ, ఆ మార్పు దిశగా అడుగులు వేయడం కీలకం. ముఖ్యంగా రాష్ట్ర జనాభాలో 50.2 శాతం మేరకు బీసీలు ఉన్నట్టు స్పష్టమైంది. రాష్ట్ర ప్రభుత్వం గత ఏడాది నియమించిన రాజీవ్ రంజన్ డెడికేటెడ్ కమిటీ.. రాష్ట్రంలో ఎంత మంది బీసీలు ఉన్నారన్నది లెక్క తేల్చింది. మొత్తం 50.2 శాతానికి పైగానే బీసీలు ఉన్నారని.. వారికి అవకాశాలు కల్పించాల్సిన అవసరం ఉందని కూడా కమిటీ పేర్కొంది. ఇది ప్రభుత్వ పరంగా తీసుకునే నిర్ణయం. ఇక, దీనికి సంబంధించి 34 శాతం రిజర్వేషన్ కల్పిస్తూ.. కూటమి సర్కారు నిర్ణయించింది.
ఇది వ్యక్తిగతంగా బీసీలకు మేలు చేసే ప్రక్రియ. అయితే.. రాజకీయంగా చూసుకుంటే.. బీసీలకు ఎవరు ఏం చేశారన్నది కూడా చర్చనీయాంశం. ఈ క్రమంలో టీడీపీ కొన్ని అంశాలను ఏకరువు పెట్టింది. పదవుల నుంచి ప్రాధాన్యం వరకు బీసీలకు చేసిన మేళ్లను సీఎం చంద్రబాబు అసెంబ్లీ వేదికగా కొన్నాళ్ల కిందట వివరించారు. ఇక, దీనికి కౌంటర్‌గా వైసీపీ అధినేత జగన్.. ఆయన కాదు.. అసలు బీసీలకు మేలు చేసిన పార్టీ ఏదైనా ఉందంటే అది తమదేనని ఆయన లెక్కలు చెప్పారు.
ఇలా.. ఇరు వర్గాల మధ్య లెక్కలు ఆశ్చర్యానికి, చర్చకు కూడా దారితీశాయి. ఇక, పార్టీ పరంగా అధినాయకులు ఇస్తున్న ప్రాధాన్యం చూస్తే.. చంద్రబాబు చుట్టూ.. బీసీ నాయకులు కనిపిస్తారు. రాష్ట్ర టీడీపీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు బీసీ నేత. ఇక, పార్టీ పరంగా కీలక పదవుల్లో ఉన్న ప్రధాన కార్యదర్శుల్లోనూ బీసీలకు ప్రాధాన్యం ఇచ్చారు. చంద్రబాబుకు సూచనలు, సలహాలు ఇచ్చేవారిలోనూ బీసీలు ఉన్నారు. అంటే అటు ప్రభుత్వం పరంగా ప్రాధాన్యంతోపాటు.. ఇటు పార్టీ పరంగా కూడా బీసీలకు టీడీపీ ప్రాధాన్యం ఇస్తోంది.
మరి వైసీపీ పరిస్థితి ఏంటి? అనేది ఆసక్తికరం. తాను బీసీలకు ప్రాధాన్యం ఇస్తున్నానని చెప్పే.. జగన్ చుట్టూ.. ఉన్న పరివారాన్ని పరిశీలిస్తే.. ఒకప్పుడు విజయసాయిరెడ్డి, వైవీ సుబ్బారెడ్డి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వంటి వారు కనిపిం చేవారు. గత ఎన్నికల్లోఓటమి తర్వాత.. సమూల మార్పులు చేశామని చెప్పినా.. అదేమీ మారలేదు. ప్రస్తుతం నాయకుల పేర్లు మారాయే కానీ.. సామాజిక వర్గం మాత్రం మారలేదు.
ప్రస్తుతం సజ్జల రామకృష్ణారెడ్డి, లేళ్ల అప్పిరెడ్డి.. వంటి రెడ్డి నాయకులే జగన్ చుట్టూ ఉన్నారు. ఇక, పార్టీ పరంగా కూడా.. రెడ్డి నాయకులకు దక్కుతున్న ప్రాధాన్యం బీసీలకు లేదన్నది సొంత నేతల్లోనే వినిపిస్తున్న మాట. ఉత్తరాంధ్రకు చెందిన బొత్స సత్యనారాయణకు మాత్రమే మండలిలో ప్రాధాన్యం ఇచ్చారు. మరి ఈ లెక్కన ఎవరు బీసీలకు ప్రాధాన్యం ఇస్తున్నారో లెక్కలు చెప్పేస్తున్నాయని అంటున్నారు పరిశీలకులు.
Gulte Telugu Telugu Political and Movie News Updates
