కీలకమైన రెండు సాగు, తాగునీటి ప్రాజెక్టులకు సీఎం చంద్రబాబు శ్రీకారం చుట్టారు. నిజానికి ఇవి ఏళ్ల తరబడి సాగుతున్న ప్రాజెక్టులనే చెప్పాలి. అయితే.. ఈ ప్రాజెక్టుల తొలిదశను పూర్తి చేయడంతోపాటు.. ఈ ఏడాది ఒక ప్రాజెక్టును.. వచ్చే ఏడాది మరోప్రాజెక్టును ప్రారంభించేందుకు చంద్రబాబు పూర్తి స్థాయిలో రెడీ అయ్యారు. ఇది ఆ పార్టీకి ఎంతో మేలు చేస్తుందన్న అంచనాలు వేస్తున్నారు. 1) వెలిగొండ తొలిదశ. 2) పోలవరం తొలిదశ. ఈ రెండు కూడా కీలకమైన నాలుగు జిల్లాలపైనా.. 40 అసెంబ్లీ నియోజకవర్గాలపైనా ప్రభావం చూపనున్నాయని అంటున్నారు.
వెలిగొండ: ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని కీలకమైన వెలిగొండ ప్రాజెక్టు.. ఏకంగా 17 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో ప్రభావం చూపనుంది. ప్రత్యక్షంగానే కాకుండా.. వెలిగొండ ప్రాజెక్టు కారణంగా పరోక్షంగా కూడా టీడీపీ కూటమి ప్రభుత్వానికి మేలు చేయనుంది. ఈ ప్రాజెక్టు తొలి దశను ఈ నెల 31న చంద్రబాబు ప్రారంభించనున్నారు. తద్వారా మార్కాపురం జిల్లా వ్యాప్తంగా ఓటు బ్యాంకు టీడీపీ ఖాతాలోకి చేరనుందని అంటున్నారు. ఇక, ఈ ప్రాజెక్టుపై ఆధారపడిన ఉమ్మడి ప్రకాశం.. నెల్లూరు జిల్లాలలోని నియోజకవర్గాలు కూడా ప్రభావితం కానున్నాయి.
పోలవరం: ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలోని పోలవరం ప్రాజెక్టుకు కొన్ని దశాబ్దాల చరిత్ర ఉంది. అనేక ఇబ్బందులు సవాళ్లు ఎదుర్కొని వచ్చే ఏడాది జూలై నాటికి ఈ ప్రాజెక్టును పూర్తి చేయాలని నిర్ణయించారు. వచ్చే ఏడాది గోదావరి పుష్కరాల సమయానికి పోలవరంతొలి దశను పూర్తి చేయనున్నారు. దీనిని ప్రధాని మోడీతోనే ప్రారంభించాలన్న ప్లాన్ కూడా చేశారు. ఇక, ఈ ప్రాజెక్టుతో ఉమ్మడి పశ్చిమ నుంచి శ్రీకాకుళం వరకు.. ఇటు కృష్ణా జిల్లా వరకు కూడా ఓటు బ్యాంకు తీవ్రంగా ప్రభావితం కానుంది. సో.. ఈ రెండు ప్రాజెక్టులు కూడా ప్రజలకు సాగు, తాగు నీరు అందిస్తే.. టీడీపీ కూటమికి ఓటు బ్యాంకు అందించడం ఖాయమని అంటున్నారు.
ఇక.. ఇతర ప్రాజెక్టుల విషయానికి వస్తే.. అమరావతి రాజధాని టీడీపీకి పెద్ద ఎస్సెర్ట్‌గా మారనుందన్నది ఖాయంగా కనిపిస్తోంది. అలానే.. విశాఖలో డేటా కేంద్రం, ఆర్సెలార్ మిట్టల్ కంపెనీలు.. కూడా కూటమి సర్కారుకు దన్నుగా మారనున్నాయి. సీమలో ఉద్యాన విశ్వవిద్యాలయం, ఉద్యాన పంటల ప్రోత్సాహం.. పెట్టుబడులు.. సౌర విద్యుత్ రంగం డెవలప్ మెంట్ వంటి ప్రాజెక్టులు కూడా కూటమి సర్కారు పెద్ద ఎత్తున ఓట్లను దూసి పెడతాయని అంచనా వేస్తున్నారు. ఇదే జరిగితే.. కూటమి రెండో సారి అప్రతిహత విజయాన్ని నమోదు చేయడం ఖాయమని విశ్లేషకులు చెబుతున్నారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates