టీడీపీతో పోల్చుకుంటే.. వైసీపీకి `వ‌ర్గ‌`పోరు…!

పార్టీలు బ‌లంగా ఉండాలంటే.. స‌మాజంలోని ప‌లు వ‌ర్గాల మ‌ద్ద‌తు అవ‌స‌రం. నాయ‌కులు, అధినేత‌లు ఎంత బ‌లంగా ఉన్నా.. స‌మాజంలోని వ‌ర్గాలు ఆయా పార్టీలకు మ‌ద్ద‌తుగా నిలిచిన‌ప్పుడే.. వ‌ర్క‌వుట్ అవుతుంది. ఈ విష‌యంలో వ‌ర్గాల‌వారీగా టీడీపీ అంద‌రినీ ఆక‌ట్టుకునే ప్ర‌య‌త్నం చేసింది. చేస్తోంది. కానీ, వైసీపీ ప్ర‌త్యేకంగా ఏ వ‌ర్గాన్నీ త‌నవైపు తిప్పుకోలేక పోయింది. కేవ‌లం సంక్షేమం మాత్ర‌మే త‌మ‌కు క‌లిసి వ‌స్తుంద‌ని వేసుకున్న అంచ‌నాలు త‌ల‌కిందులు అయ్యాయి.

రాష్ట్రంలో కీల‌క‌మైన నాలుగు వ‌ర్గాలు.. రాజ‌కీయంగా పార్టీల‌కు అత్యంత ప్ర‌ధానంగా మారాయి.

1) ఉద్యోగులు: వైసీపీ హ‌యాంలో మంచి చేశామ‌ని ఆ పార్టీ నాయ‌కులు చెప్పుకొన్నా.. చివ‌రి ద‌శ‌లో నెల‌కొన్న నిర్బంధం, కేసులు కార‌ణంగా వారు దూర‌మ‌య్యారు. పోనీ.. ఇప్పుడైనా వారికి చేరువ అవుతున్నారా? అంటే లేదు. ఇక‌, టీడీపీ విష‌యానికి వ‌స్తే.. కొంత‌మేర‌కు వారిని సంతృప్తి ప‌రిచే ప్ర‌య‌త్నాలు జ‌రుగుతున్నాయి. ఇదేస‌మ‌యంలో వారు త‌మ నుంచి జారిపోకుండా కూడా పార్టీ ప్ర‌య‌త్నం చేస్తోంది.

2) కార్మికులు: ఇది అత్యంత కీల‌క‌మైన వ‌ర్గం. వైసీపీ హ‌యాంలో ఇసుక సంక్షోభం ఏర్ప‌డ‌డంతో కార్మికులు ఆత్మ‌హ‌త్య‌లు చేసుకున్నారు. ఆ త‌ర్వాత‌.. వారంతా దూర‌మ‌య్యారు. ఇక‌, ఇత‌ర ప‌రిశ్ర‌మ‌ల ఏర్పాటు విష‌యంలోనూ వైసీపీ వ్య‌వ‌హ‌రించిన తీరుతో కార్మిక వ‌ర్గం గుర్రుగా మారింది. టీడీపీ ఈ విష‌యంలో కార్మికుల‌ను అక్కున చేర్చుకుంది. ప‌రిశ్ర‌మ‌లు, పెట్టుబ‌డులను పుంజుకునేలా చేయ‌డం ద్వారాకార్మిక వ‌ర్గానికి చేరువ అయింది.

3) మ‌ధ్య‌త‌ర‌గ‌తి: ఎన్నిక‌ల ఓటు బ్యాంకులో కీల‌క‌మైన మ‌ధ్య‌త‌ర‌గ‌తి వ‌ర్గానికి వైసీపీ మ‌రింత దూర‌మైంది. అభివృద్ధి, ర‌హ‌దారులు.. రాజ‌ధానిని ఆకాంక్షిస్తున్న మ‌ధ్య‌త‌ర‌గ‌తి వ‌ర్గం.. టీడీపీ వైపు మొగ్గు చూపుతోంది. వైసీపీ ఈ మూడు విష‌యాల్లోనూ వెనుక‌బ‌డింది.

4) మ‌హిళ‌లు: రాష్ట్రంలో 2 కోట్ల మందిపైచిలుకు ఓటర్లుగా ఉన్న మ‌హిళ‌లు.. 2019లో వైసీపీకి అనుకూలంగా ఉన్నారు. కానీ, ఉచిత‌బ‌స్సు, ఇంట్లో ఎంత‌మంది పిల్ల‌లు ఉంటే అంత‌మందికీ త‌ల్లికి వంద‌నం ఇస్తున్న నేప‌థ్యానికి తోడు వారికి ప్ర‌భుత్వం త‌ర‌ఫున ల‌భిస్తున్న మ‌ద్ద‌తుతో ప్ర‌స్తుతం కూట‌మి వైపు మ‌హిళ‌లు మొగ్గు చూపుతున్నారు. పూర్తిగా కాక‌పోయినా.. 65 శాతం మంది మ‌హిళ‌లు కూట‌మికి జై కొడుతుండ‌డం గ‌మ‌నార్హం.