రేవంత్ రెడ్డి అమెరికా పర్యటన రద్దు… లండన్ నుంచే ఇండియాకు..

విదేశాంగ శాఖ అనుమతి నిరాకరించడంతో తెలంగాణా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అమెరికా పర్యటన రద్దయ్యింది. ముందుగా నిర్ణయించుకున్న షెడ్యూల్ ప్రకారం ఆయన ఈ నెల 23 న అమెరికా పర్యటనకు వెళ్లాల్సి వుంది. రెండు రోజుల క్రితం ఈ నెల 20 వ తేదీన లండన్ పర్యటనకు బయలుదేరి వెళ్లారు. లండన్ నుంచి అమెరికా వెళ్లకుండానే నేరుగా హైదరాబాద్ చేరుకుంటారు.

తెలంగాణాను గ్లోబల్ హబ్ గా మార్చడం, అంతర్జాతీయ భాగస్వామ్యాలను నెలకొల్పాలన్న లక్ష్యంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి లండన్లో పర్యటిస్తున్నారు. అందులో భాగంగా నేడు ప్రసిద్ధ ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలోని బ్లావట్నీక్ స్కూల్ ఆఫ్ గవర్నెన్స్ ను సందర్శించనున్నారు. 22వ తేదీన క్రెంబ్రిడ్జి యూనివర్సిటీ బృందంతో భేటీ అవుతారు. లండన్ బిజినెస్ స్కూల్, యూనివర్సిటీ ఆఫ్ లండన్ క్యాంపస్ లను సందర్శిస్తారు. ఉన్నత విద్య, నైపుణ్యాభివృద్ధి రంగాల్లో పరస్పర సహకారంపై చర్చిస్తారు. 23 న విదేశీ పర్యటన ముగించుకొని హైదరాబాద్ చేరుకుంటారు.

రేవంత్ రెడ్డి అమెరికా పర్యటన వాయిదా పడినప్పటికి అధికారుల పర్యటన కొనసాగుతుంది. ఈ మేరకు అధికారుల బృందానికి ముఖ్యమంత్రి ఆదేశించారు. అమెరికాలోని హార్వర్డ్ యూనివర్సిటీ, ఎంఐటీ, నార్త్ ఈస్టర్న్ యూనివర్సిటీ, వర్జీనియా టెక్ వంటి టాప్ గ్లోబల్ కంపెనీలతో ఎంఓయూలు కుదుర్చుకోనున్నారు. అనుకున్న షెడ్యూల్ ప్రకారం రేవంత్ రెడ్డి అమెరికా పర్యటనకు వెళ్లి వుంటే బాగుండేదని అధికారులు భావిస్తున్నారు.

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అమెరికా పర్యటనకు అనుమతి నిరాకరించిన కేంద్ర ప్రభుత్వం నిర్ణయం మీద విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రేవంత్ రెడ్డి పర్యటన వలన తెలంగాణాకు ప్రయోజనం చేకూరే అవకాశం వుందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. విద్యారంగం అభివృద్ధి, నిరుద్యోగులకు నైపుణ్య శిక్షణకు ఉపయోగం కలుగుతుందన్న అభిప్రాయాలూ వ్యక్తం అవుతున్నాయి. ప్రపంచ ప్రసిద్ధి చెందిన సంస్థలు తెలంగాణాకు వస్తే హైదరాబాద్ బ్రాండ్ ఇమేజీకి ప్లస్ పాయింట్ అవుతుందని చెబుతున్నారు.

రాజకీయ ప్రయోజనాల కోసమే తన అమెరికా పర్యటనను కేంద్రం అడ్డుకుందని సీఎం రేవంత్ రెడ్డి ఆరోపించారు. తెలంగాణా అభివృద్ధి పట్ల బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వానికి ఆసక్తి లేదని కామెంట్ చేశారు. కేంద్ర నూతన విద్యా విధానాన్ని అమలు చేయడంలో భాగంగానే విదేశీ పర్యటన చేస్తున్నట్లు తెలిపారు. రేవంత్ అమెరికా పర్యటనకు అనుమతి నిరాకరించడం పట్ల తెలంగాణా కాంగ్రెస్ నాయకులు మండి పడుతున్నారు. బీజేపీ అసలు స్వరూపం బయట పడిందని విమర్శలు గుప్పిస్తున్నారు.