తెలంగాణ ముఖ్యమంత్రి, టీఆర్ఎస్ పార్టీ అధినేత కే చంద్రశేఖర్‌రావు మరో సంచలన నిర్ణయం తీసుకోబోతున్నారని తెలుస్తోంది. అధికారిక సమాచారం వెలువడాల్సి ఉన్నప్పటికీ…లాక్ డౌన్ కొనసాగింపు విషయంలో ఆయనో క్లారిటీకి వచ్చారని అంటున్నారు.
రాష్ట్రంలో కరోనా వైరస్ పరిస్థితి, లాక్‌డౌన్ అమలు, ఆర్థికపరంగా తీసుకోవాల్సిన చర్యలు తదితర అంశాలపై చర్చించి భవిష్యత్ కార్యాచరణ రూపొందించడానికి రాష్ట్ర మంత్రివర్గం సమావేశం అయింది. అయితే, ఇప్పటికే తెలంగాణ సీఎం ఓ నిర్ణయానికి వచ్చారట. ఈనెల 28వ వరకూ లాక్ డౌణ్ కొనసాగించాలనేది తెలంగాణ ముఖ్యమంత్రి నిర్ణయం సారాంశం.
కేంద్రం మూడు దఫాలుగా విధించిన లాక్‌డౌన్‌ను చివరిసారిగా ఈ నెల 17వరకు పొడిగిస్తూ కొన్ని సడలింపులను ప్రకటించింది. కరోనా కేసులు లేని ప్రాంతాలలో మద్యం అమ్మకాలకు అనుమతి ఇవవ్వడంతోపాటు, పలు ఇతర రంగాలలో యథావిధిగా పూర్తిస్థాయి కార్యకలాపాలు నిర్వహించుకొనేందుకు అనుమతిస్తూ కొన్ని మార్గదర్శకాలను జారీచేసింది.
తెలంగాణ రాష్ట్రంలో నెలన్నర రోజులకుపైగా లాక్‌డౌన్ కొనసాగుతున్నప్పటికీ కరోనా విస్తరణకు కళ్లెం పడకపోగా ఆర్థిక పరిస్థితి రోజురోజుకూ దిగజారుతున్నది. రాష్ట్ర ప్రభుత్వం ఓ వైపు కరోనా రోగులకు పూర్తిస్థాయి చికిత్స అందిస్తూనే మరోవైపు వైరస్ విస్తరణను అరికట్టేందుకు కఠిన చర్యలు అమలు చేస్తోంది. ఈ నేపథ్యంలో కేంద్రం జారీచేసిన మార్గదర్శకాలపై చర్చించి లాక్‌డౌన్ కొనసాగింపుపై నిర్ణయించేందుకు తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు అధ్యక్షతన ప్రగతిభవన్‌లో మధ్యాహ్నం 2 గంటలకు సమావేశం ప్రారంభం అయింది.
తెలంగాణ రాష్ట్రంలో కరోనా కేసులు ఒకరోజు తగ్గడం, మరొకరోజు పెరుగుతున్న నేపథ్యంలో లాక్‌డౌన్ పొడిగించడమే మంచిదని ఆరోగ్యశాఖ అభిప్రాయపడుతున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో లాక్‌డౌన్ మరికొన్ని రోజులు కొనసాగటం అనివార్యంగా కనిపిస్తోందని తెలంగాణ సీఎం భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ ప్రకారం ఈనెల 28 వరకూ లాక్ డౌన్ కొనసాగించనున్నట్లు తెలుస్తోంది.