ఆ మంత్రికి సెగ‌: మితిమీరిన.. దూకుడే రీజ‌నా?

రాజ‌కీయాల్లో దూకుడు ఉండొచ్చు.. ఉండాలి కూడా! దీనిని ఎవ‌రూ కాద‌న‌రు. అయితే.. దీనికి కూడా ఒక హ‌ద్దు.. అదుపు అనేది చాలా కీల‌కం. మితిమీరిన దూకుడు.. ఎక్క‌డా వ‌ర్క‌వుట్ కాదు. వైసీపీలో కీల‌క క‌మ్మ నాయ‌కుడిగా ఎదిగే అవ‌కాశం ఉండి కూడా.. కేవ‌లం త‌న నోటి దూకుడు కార‌ణంగా.. అంద‌రికీ చేరువ కాలేక‌పోతున్నార‌నే అభిప్రాయం.. మంత్రి కొడాలి నాని విష‌యంలో వినిపిస్తోంది. తాను రాజ‌కీయ అక్ష‌రాభాస్యం చేసిన టీడీపీని, త‌న‌కు అవ‌కాశం ఇచ్చిన చంద్ర‌బాబును(అవ‌కాశం ఇవ్వ‌లేదని కొడాలి వాదిస్తారనుకోండి) తూల‌నాడ‌డం ద్వారా.. నాని సాధించింది.. పైపై మెరుగులే త‌ప్ప‌..ఓ ప‌రిణితి చెందిన రాజ‌కీయ నేత‌గా మార్కులు కాద‌నేది విశ్లేష‌కుల భావ‌న‌.

గుడివాడ నియోజ‌క‌వ‌ర్గం నుంచి అనేక మంది నాయ‌కులు విజ‌యం సాధించారు. వేముల కూర్మ‌య్య‌(గొప్ప రాజ‌నీతిజ్ఞుడిగా పేరు తెచ్చుకున్నారు), రావి శోభ‌నాద్రి చౌద‌రి, క‌టారి స‌త్య‌నారాయ‌ణ‌రావు, నంద‌మూరి తార‌క‌రామారావు.. ఈ నియోజ‌క‌వ‌ర్గం నుంచి గెలిచి.. రాష్ట్ర రాజ‌కీయాల్లో త‌మ‌దైన ముద్ర వేశారు. పేద‌ల పాలిట పెన్నిధులుగా నిలిచారు. ఇప్ప‌టికీ వీరు పేర్లు ఈ నియోజ‌క‌వర్గంలో వినిపిస్తూనే ఉంటుంది. అలాంటి నియోజ‌క‌వ‌ర్గం నుంచి వ‌రుస‌గా నాలుగు సార్లు గెలుపు గుర్రం ఎక్కి రికార్డు సృష్టించిన కొడాలి నాని.. ఈ మేధావులు వ‌ర‌సులో కానీ.. వారి ప‌క్క‌న కానీ.. చోటు ద‌క్కించుకోలేక పోతున్నార‌నే విమ‌ర్శ‌లు వినిపిస్తున్నా యి. క‌డివెడు ఖ‌రము పాలు..అన్న సామెత‌ను నాని వ్య‌వ‌హార శైలి నిరూపిస్తోంద‌ని మేధావులు వాపోతున్నారు.

నోటికి ఎంత మాట ప‌డితే.. అంతమాట‌. రాజ‌కీయ రేటింగ్ కోసం పాకులాట‌.. బూతులు తిట్ట‌డ‌మే ప‌ర‌మావ‌ధిగా వ్యాఖ్య‌లు.. వంటివి నానికి అప్ప‌టి వ‌ర‌కు ఆనందాన్ని ఇచ్చి ఉండొచ్చ‌ని.. లేదా త‌న వ‌ర్గం చంక‌లు గుద్దుకునేందుకు ప‌నిచేస్తుంద‌ని.. కానీ.. కొన్ని త‌రాల పాటు నిలిచిపోయే రాజ‌కీయ నీతిజ్ఞ‌త‌ను, ప‌టిష్ట‌మైన నాయ‌కుడిని మాత్రం త‌యారు చేయ‌లేద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. ప్ర‌తిప‌క్ష నేత‌లు చేసే విమ‌ర్శ‌లకు స‌మాధానం ఇవ్వాల్సిందే. అయితే.. ఓ పారామీట‌ర్, నిబద్ధ‌త‌, ప‌ది మందీ హ‌ర్షించే ప‌రిస్థితి ఉండాలి క‌దా? అనేది మేధావుల మాట‌.

పోనీ.. సొంత పార్టీలో అయినా.. మంచి మార్కులు వేయించుకుంటున్నారా? అంటే.. ప్ర‌స్తుతానికి(ప్ర‌జా బ‌లం ఉందిక‌నుక‌) ఆహా .. ఓహో.. అంటున్నారు. అదే ఒక్క‌సారి క‌నుక ఎదురు దెబ్బ త‌గిలితే.. అప్పుడు తెలుస్తుంద‌ని అంటున్నారు మేధావులు. రాజ‌కీయాలు చేయ‌డం కాదు.. ఒక రాజ‌నీత‌జ్ఞ‌త‌తో త‌ర‌త‌రాలు నిలిచిపోయే నాయ‌కుడిగా నిలిచిపోవ‌డం వేర‌ని అంటున్నారు. మ‌రి కొడాలి నాని.. కాకి రాజ‌కీయాలు చేస్తారా? కోకిల‌గా ఇప్ప‌టికైనా మార్పు చెందుతారా? అనేది చూడాలి… అంటున్నారు రాజ‌కీయ పండితులు.