500, 1000 రూపాయల నోట్ల రద్దు తర్వాత భారత దేశంలో యూపీఐ వాడకం విపరీతంగా పెరిగిపోయింది. ఇప్పుడు వీధిలో కూరగాయల వ్యాపారి దగ్గరి నుంచి ఫైవ్ స్టార్ హోటళ్ల వరకు అందరూ యూపీఐ స్కానర్లు వాడుతున్నారు. ఈ క్రమంలోనే ఫోన్ పే, గూగుల్ పే వంటి యూపీఐ ప్లాట్ ఫార్మ్ లు తమ యూజర్లకు ఆల్రెడీ సర్వీస్ ఛార్జీల రూపంలో బాదుడు మొదలుబెట్టాయి.
అయితే, తాజాగా యూపీఐ లావాదేవీలపై బ్యాంకుల ఛార్జీలకు సంబంధించిన పేమెంట్ అండ్ సెటిల్ మెంట్ సిస్టమ్స్ యాక్ట్ – 2007 బిల్లును లోక్ సభ ఆమోదించిన నేపథ్యంలో వినియోగదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. యూజర్ల నుంచి మరిన్ని సర్వీస్ ఛార్జీలను ఫోన్ పే, గూగుల్ పే వంటి ప్లాట్ ఫామ్ లు వసూలు చేసే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది.
ఈ క్రమంలోనే ఆ ప్రచారంపై కేంద్ర ప్రభుత్వంతోపాటు ఫోన్ పే సంస్థ స్పందించింది. భారతీయ వినియోగదారులపై ఎటువంటి భారం మోపబోమని, ఎటువంటి రుసుము వసూలు చేయబోవడం లేదని ఫోన్ పే సీఈవో సమీర్ నిగ్ ప్రకటించారు. ఫోన్ పే యూపీఐ సేవలు భారతీయ వినియోగదారులకు గతంలో మాదిరిగానే ఉచితంగా అందిస్తామని వెల్లడించారు. పర్సన్ టు పర్సన్ (పీ టు పీ) పద్ధతిలో వ్యక్తిగత లావాదేవీలకు ఛార్జీలు వర్తించవని స్పష్టం చేశారు.
ఇక, ఈ విషయంపై తాజాగా కేంద్ర ప్రభుత్వం కూడా కీలక ప్రకటన విడుదల చేసింది. వ్యక్తుల మధ్య జరిగే లావాదేవీలు యథావిధిగా, ఉచితంగా కొనసాగుతాయని స్పష్టం చేసింది. వ్యాపారులకు సంబంధించి అత్యధిక ట్రాన్సాక్షన్లు ఉచితంగానే జరుగుతాయని, మర్చంట్ లావాదేవీలపై నామమాత్రంపు ఎండీఆర్ ఉంటుందని తెలిపింది. కోటిన్నర రూపాయలకు పైగా వార్షిక టర్నోవర్ కలిగి ఉన్న షాపింగ్ మాల్స్, లగ్జరీ హోటల్స్ లో రెండు వేల రూపాయలకంటే ఎక్కువ విలువైన చెల్లింపులపైనే ఎండీఆర్ ఛార్జీలు విధించే అవకాశముందని పేర్కొంది.
Gulte Telugu Telugu Political and Movie News Updates