2024 ఎన్నికలకు ముందు టీడీపీ, జనసేన, బీజేపీలు కూటమిగా ఏర్పడి అఖండ విజయం సాధించిన సంగతి తెలిసిందే. మూడు పార్టీల మధ్య సమన్వయం ఉన్నప్పటికీ అక్కడక్కడ, అప్పుడప్పుడు చిన్న చిన్ని ఇష్యూలు జరుగుతున్నాయి. ముఖ్యంగా టీడీపీ, జనసేనకు చెందిన కొందరు నేతల మధ్య చిన్న చిన్న మనస్పర్థలు వచ్చినప్పటికీ టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ వాటిని వెంటనే పరిష్కరించి గ్యాప్ రాకుండా చేస్తున్నారు. చిన్నచిన్న ఇబ్బందులుంటే సర్దుకుపోవాలని వారికి హితవు పలుకుతున్నారు. అయినా సరే అటువంటి ఘటనలు మాత్రం ఆగడం లేదు.
తాజాగా జనసేన కార్యకర్తలను టీడీపీ ఎమ్మెల్యే, ఏపీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు గన్ మెన్ తోసి వేశారని ఆరోపణలు రావడం చర్చనీయాంశమైంది. ఆ క్రమంలోనే ఆ గన్ మెన్ పై దాడికి జనసేన నేతలు యత్నించడం హాట్ టాపిక్ గా మారింది. గుంటూరులో అమరావతి చిత్రకళ పేరిట ఏర్పాటు చేసిన కార్యక్రమంలో స్టాల్స్ ను తిలకించేందుకు రఘురామతోపాటు జనసేన నేత బోనబోయిన శ్రీనివాస్ కూడా వచ్చారు. ఈ క్రమంలోనే శ్రీనివాస్ ను, జనసేన కార్యకర్తలను రఘురామ గన్ మెన్ అడ్డుకోవడంతో గొడవ మొదలైంది.
ఆ గన్ మెన్ తో జనసేన కార్యకర్తలు వాగ్వాదానికి దిగారు. అయితే, అక్కడే ఉన్న టీడీపీ ఎంపీ, కేంద్ర మంత్రి పెమ్మసాని వారించడంతో జనసేన కార్యకర్తలు వెనక్కి తగ్గారు. కానీ, ఆయన అక్కడి నుంచి వెళ్లిన వెంటనే ఆ గన్ మెన్ పై జనసేన కార్యకర్తలు దాడికి యత్నించారు. సదరు గన్ మెన్ ను జనసేన కార్యకర్తలు దూషిస్తూ పక్కకు నెట్టేశారు. దీంతో, అక్కడ ఘర్షణ వాతావరణం ఏర్పడింది. ఆ తర్వాత జనసేన కార్యకర్తలకు పెమ్మసాని నచ్చజెప్పి అక్కడి నుంచి పంపించేశారు. ఈ ఘటనపై పవన్ కల్యాణ్ స్పందన ఏ విధంగా ఉండబోతోంది అన్నది ఆసక్తికరంగా మారింది.
Gulte Telugu Telugu Political and Movie News Updates