కీలక విషయాలను చంద్రబాబు దగ్గర ఎందుకు దాస్తున్నారు?

ఏపీ రాజ‌ధాని అమ‌రావ‌తి నిర్మాణాన్ని సీఎం చంద్ర‌బాబు ప్ర‌తిష్టాత్మ‌కంగా భావిస్తున్న విష‌యం తెలిసిందే. ఇక్క‌డి నిర్మాణాల తొలిద‌శ‌ను 2028నాటికి పూర్తి చేసి.. 2029లో ఎన్నిక‌ల‌కు వెళ్లాల‌ని ఆయ‌న నిర్ణ‌యిం చుకున్నారు. ఈ నేప‌థ్యంలో నిరంత‌రం ఇక్క‌డి కార్య‌క్ర‌మాల‌ను ప‌ర్య‌వేక్షిస్తున్నారు. మంత్రులు, ఎమ్మెల్యేలు కూడా సంద‌ర్శించి.. ప‌నులు త్వ‌ర‌గా జ‌రిగేలా చూడాల‌ని కూడా ఆదేశిస్తున్నారు. ఇక‌, అమ‌రావతిలో మౌలిక స‌దుపాయాల నిర్మాణానికి ప్ర‌పంచ బ్యాంకు నుంచి రుణాలు తీసుకుంటున్నారు.

ప్ర‌పంచ బ్యాంకు ప్ర‌తినిధులు త‌ర‌చుగా అమ‌రావ‌తిని సంద‌ర్శించి.. ప‌నుల‌ను ప‌రిశీలిస్తున్నారు. ఈ నేప‌థ్యంలో తాజాగా కీల‌క విష‌యం వెలుగు చూసింది. అది ప్ర‌పంచ బ్యాంకు ప్ర‌తినిధుల వ‌ర‌కు చేరింది. అయితే.. నిరంత‌రం ప‌ర్య‌వేక్షిస్తున్న చంద్ర‌బాబుకు ఈ విష‌యం తెలియ‌కుండా అధికారులు దాచార‌న్న అనుమానాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. అదే.. అమ‌రావ‌తి ప‌నుల్లో ఉన్న ఓ కార్మికుడు మృతి చెంద‌డం. ఈ విష‌యం పెద్ద సంచ‌ల‌నంగా మారింది.

ఎక్క‌డి నుంచో వ‌చ్చిన ప్ర‌పంచ బ్యాంకు ప్ర‌తినిధుల‌కు ఈ విష‌యం తెలియ‌డంతో వారు సీరియ‌స్ అయ్యారు. కార్మికుల ర‌క్ష‌ణ కోసం ఎలాంటి జాగ్ర‌త్త‌లు తీసుకున్నార‌న్న విష‌యంపై నివేదిక కోరారు. అయితే.. పెద్ద పెద్ద నిర్మాణాలు జ‌రిగేప్పుడు.. ఇలాంటి ఘ‌ట‌న‌లు జ‌ర‌గ‌డం సాధార‌ణ‌మేన‌ని అధికారులు చెబుతున్నారు. కార‌ణాలు ఏవైనా అమ‌రావ‌తిలోని దొండ‌పాడు గ్రామంలో ఇటీవ‌ల ఓ కార్మికుడు మృతి చెందాడు. ఈ విష‌యాన్ని అధికారులు గోప్యంగా ఉంచారు.

లేఅవుట్ పనుల్లో మట్టి పెళ్లలు విరిగిపడి యువ కార్మికుడు మృతి చెందిన వ్య‌వ‌హారంపై ఆరా తీసిన ప్ర‌పంచ బ్యాంకు ప్ర‌తినిధులు.. స్వతంత్ర దర్యాప్తు సంస్థ ద్వారా విచార‌ణ చేయించాల‌న్నారు. ఇక‌, దీనికి ప్ర‌పంచ బ్యాంకుకు సంబంధం ఏంట‌న్న చ‌ర్చ కూడా ఉంది.

వాస్త‌వానికి ప్ర‌పంచ బ్యాంకు.. రుణాలు ఇచ్చేప్పుడే.. కార్మికుల భ‌ద్ర‌త‌, వారికి అందించే తాగునీరు, ఆహారం, వ‌స‌తి వంటి విష‌యాల‌ను ప‌క్కాగా తెలుసుకుని, వాటిని కూడా ఒప్పందంలో చేర్చుతుంది. ఇక్క‌డ కూడా అదే జ‌రిగింది. దీంతో రాబోయే కాలంలో రుణాల‌పై ఈ ఘ‌ట‌న ప్ర‌భావం చూప‌నుంది. ఈ వ్య‌వ‌హారంపై సీఎం చంద్ర‌బాబు తాజాగా సీరియ‌స్ అయ్యారు. వాస్త‌వాల‌ను ఎందుకు దాస్తున్నార‌ని ఆయన అధికారుల‌పై ఆగ్ర‌హం వ్య‌క్తం చేసిన‌ట్టు స‌మాచారం.