డీఎస్సీపై వైసీపీది అక్క‌సే… క‌దిలిన టీచ‌ర్లు!

కూట‌మి ప్ర‌భుత్వం ఎన్నిక‌ల‌కు ముందు ఇచ్చిన హామీ మేర‌కు గ‌త ఏడాది మెగా డీఎస్సీ-2025ను నిర్వ హించి 16 వేల పోస్టుల‌ను భ‌ర్తీ చేసింది. మ‌రోసారి కూడా డీఎస్సీ నిర్వ‌హించేందుకు రెడీ అయింది. వ‌చ్చే నెల‌లో దీనికి సంబంధించిన నోటిఫికేష‌న్ రానుంది. అయితే.. కూట‌మి స‌ర్కారును బ‌ద్నాం చేస్తూ.. వైసీపీ నాయ‌కులు డీఎస్సీ-2025కు వ్య‌తిరేకంగా ప్ర‌చారం చేస్తున్నార‌ని టీడీపీ నాయ‌కులు విమ‌ర్శిస్తున్నారు. ఈ క్ర‌మంలో వారు కూడా రోడ్డెక్కారు. వైసీపీ నిర‌స‌న‌ల‌కు కౌంట‌ర్ ఎటాక్ చేస్తున్నారు.

ఇక‌, ఇప్పుడు తాజాగా డీఎస్సీ-2025లో ఉద్యోగాలు సంపాయించుకున్న టీచ‌ర్లు కూడా రోడ్డెక్కారు. డీఎస్సీ పై వైసీపీ అక్క‌సేన‌ని పేర్కొంటూ.. శ‌నివారం రాష్ట్రంలోని విజ‌య‌వాడ‌, క‌ర్నూలు, తిరుప‌తి, తూర్పుగోదావరి జిల్లా రాజ‌మండ్రి, విశాఖ‌లో నిర‌స‌న‌ల‌కు పిలుపునిచ్చారు. ముఖ్యంగా క‌ర్నూలు జిల్లాలోని కొండారెడ్డి బురుజు వ‌ద్ద వంద‌ల మంది ఉపాధ్యాయులు నిర‌స‌న చేయ‌డం గ‌మ‌నార్హం. `ఆత్మ గౌరవ ర్యాలీ` పేరుతో చారిత్రక కొండారెడ్డి బురుజు ఎక్కి తమ నియామకాలపై చేస్తున్న దుష్ప్రప్రచారాన్ని ఖండించారు.

వాస్తవాలు వివరించినా పదేపదే వైసీపీ తప్పుడు ఆరోపణలు చేస్తుండటంపై ఉపాధ్యాయ కుటుంబాల ఆవేదన వ్య‌క్తం చేశారు. కడప, కర్నూలు, అనంతపురం జిల్లాల నుంచి పెద్ద ఎత్తున ఆత్మగౌరవ ర్యాలీలో పాల్గొన్న టీచర్లు.. వైసీపీకి వ్య‌తిరేకంగా నినాదాలు చేయ‌డం గ‌మ‌నార్హం. ఉపాధ్యాయ నియామకాలపై కుట్రలు చేయొద్దని ప్లకార్డులు పట్టుకుని నిన‌దించారు. రాజకీయాల్లో పావుగా టీచర్లను చేయొద్దంటూ వైసీపీకి హితవు పలికారు.

మెగా డీఎస్సీ-2025 నియామకాలపై  కుట్రలు చేసిన వారికి తగిన గుణపాఠం చెబుతామని ప‌లువురు ఉపాధ్యాయులు స్ప‌ష్టం చేశారు. టీచర్లుగా పాఠాలు చెబుతామని.. కుట్రలు చేస్తే గుణపాఠం కూడా చెబుతామని వ్యాఖ్యానించారు. కొండారెడ్డి బురుజు నుంచి కర్నూలు జిల్లా పరిషత్ కార్యాలయం వరకూ  మెగా డీఎస్సీ ఉపాధ్యాయుల ర్యాలీ నిర్వ‌హించారు. విజ‌య‌వాడ‌, రాజ‌మండ్రిలో క‌లెక్ట‌ర్ల‌కు విన‌తి ప‌త్రాలు అందించారు. వైసీపీ చేస్తున్న త‌ప్పుడు ప్ర‌చారం ఖండించాల‌ని విజ్ఞుల‌ను కోరారు.