తన తండ్రి వైఎస్ వివేకానందరెడ్డిని దారుణంగా చంపేసిన వాళ్లు ఫస్ట్ ఫస్ట్ ఆ విషయాన్ని జగన్‌కే చెప్పారని అందుకే జగన్‌పై తనకు అనుమానం ఉందని వివేకా కుమార్తె డాక్టర్ వైఎస్ సునీత వ్యాఖ్యానించారు. ఇప్పటి వరకు జరిగిన విచారణ సరిగా జరగలేదన్నారు. దీని వెనుక అజ్ఞాత వ్యక్తి ఎవరో చక్రం తిప్పుతున్నారని విచారణను ప్రభావితం చేస్తున్నారని సందేహం వ్యక్తం చేశారు. అందుకే పదే పదే కోర్టును ఆశ్రయించాల్సి వస్తోందని తెలిపారు.
అయినప్పటికీ కోర్టుల్లోనూ తనకు న్యాయం జరగడం లేదని సునీత తెలిపారు. అయినా తనకు న్యాయ వ్యవస్థపై నమ్మకం ఉందని తన తండ్రిని చంపిన అసలు దోషులపై కేసులు పెట్టేవరకు వారిని జైలుకు పంపేవరకు విశ్రమించేది లేదన్నారు.
కాగా శనివారం వివేకానందరెడ్డి 75వ జయంతిని పురస్కరించుకుని ఆమె కడప జిల్లా పులివెందులకు వచ్చారు. ఇక్కడి వివేకా సమాధి వద్ద నివాళులర్పించారు. అనంతరం ప్రార్థనల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా సునీత సంచలన వ్యాఖ్యలు చేశారు.
“మా నాన్న కేసు విచారణ సరిగా జరగలేదు. ఈ విషయం ఇప్పుడుకాదు గతంలోనూ చెప్పాను. కోర్టుకు కూడా విన్నవించాను. అయినా సరిగా విచారణ చేయడం లేదు. దీనివెనుక ఎవరో ఉన్నారు. ఆ ఎవరనేది అందరికీ తెలిసిందే. ఆ విషయాన్ని సీబీఐ అధికారులు చెప్పాలి. వారిపై కేసులు నమోదు చేయాలి. వారిని విచారించాలి. అప్పటి వరకు విశ్రమించను. ఈ కేసు విచారణ తుది చార్జిషీట్‌ను కోర్టులో దాఖలు చేశామని సీబీఐ చెబుతోంది. కానీ ఇక్కడితో అయిపోలేదు” అని సునీత వ్యాఖ్యానించారు.
2019 మార్చిలో వివేకానందరెడ్డిని పులివెందులలోని ఆయన నివాసంలోనే దారుణంగా హతమార్చారు. అప్పటి నుంచి ఈ కేసు విచారణ జరుగుతూనే ఉంది. అయితే వైసీపీ హయాంలో సాక్షులను బెదిరించారని ఆరోపణలు వచ్చాయి. అదేవిధంగా సీబీఐ అప్పటి డీఎస్పీ రాంసింగ్‌పైనే వైసీపీ నాయకులు కేసులు పెట్టారు.
ఇలా అనేక మలుపులు తిరిగిన ఈ కేసులో సీబీఐ విచారణ పూర్తయిందని పదే పదే చెబుతోంది. అయితే “అసలు నిందితులను” వదిలేశారన్నది సునీత ఆవేదన.
Gulte Telugu Telugu Political and Movie News Updates