పశ్చిమగోదావరి జిల్లాలో అత్యంత కీలకమైన నియోజకవర్గం నరసాపురం పార్లమెంటు. ఇటు అసెంబ్లీ, అటు పార్లమెంటుకు కూడా నరసాపురం నియోజకవర్గంగా ఉంది. గత ఎన్నికల్లో వైసీపీ ఇక్కడ విజయం సాధించింది. నరసాపురం పార్లమెంటు స్థానం నుంచి రఘురామకృష్ణంరాజు, అసెంబ్లీ స్థానం నుంచి ముదునూరు ప్రసాదరాజు విజయం సాధించారు. అయితే, వీరిద్దరిలో ఎంపీ.. అసమ్మతి బావుటా ఎగుర వేసిన విషయం తెలిసిందే. దీంతో పార్లమెంటు నియోజకవర్గానికి ఇంచార్జ్ విషయంలో జగన్ హుటాహుటిన నిర్ణయం తీసుకుని.. రఘుకు చెక్ పెట్టేలా.. మాజీ ఎంపీ, బీజేపీ నాయకుడు గోకరాజు గంగరాజు కుమారుడు.. రంగరాజుకు పగ్గాలు అప్పగించారు.
స్థానిక రాజకీయాలను పరిగణనలోకి తీసుకుంటే.. సామాజికవర్గం పరంగా బలమైన కుటుంబం కావడం, ఆర్థికంగానూ బలంగా ఉండడంతో రఘుకు సరైన మొగుడు అవుతారని, ఆయనకు దీటుగా రాజకీయాలు చేస్తారని .. వైసీపీ సీనియర్లు గోకరాజు రంగరాజుపై ఆశలు పెట్టుకున్నారు. అయితే.. అనూహ్యంగా రంగరాజు పుంజుకోలేక పోయారు.
రాజకీయాలకు కొత్త కావడం కావొచ్చు.. లేదా స్వభావ సిద్ధంగా రంగరాజు నిదానస్తుడు కావడం కావొచ్చు.. మొత్తంగా పార్టీ అధిష్టానం పెట్టుకున్న లక్ష్యం మాత్రం నెరవేరలేదు. పోనీ.. సిట్టింగ్ ఎంపీ రఘుకు కౌంటర్లు ఇవ్వలేక పోయినా.. నియోజకవర్గంలో పార్టీ నేతలను, ఓటర్లను తన వైపు తిప్పుకోవడంలో కూడా రంగరాజు సక్సెస్ కాలేక పోతున్నారు.
మరోవైపు.. నరసాపురం లోక్‌సభ పరిధిలోని అసెంబ్లీ నియోజకవర్గాల ఎమ్మెల్యేలతోనూ గోకరాజు వారసుడు టచ్‌లో ఉండడం లేదని.. తెలుస్తోంది. పార్టీ కార్యక్రమాలను సమన్వయం చేయడానికి చొరవ తీసుకోవడం లేదని స్థానిక కేడర్ బాహాటంగానే చెబుతోంది. ఈ నేపథ్యంలో నరసాపురం పార్లమెంటు నియోజకవర్గంలో వైసీపీని నాయకత్వ కొరత వెంటాడుతుండడం గమనార్హం.
వాస్తవానికి గోకరాజు కుటుంబానికి నరసాపురం కొత్తకాదు. గత 2014 ఎన్నికల్లో గంగరాజు ఇక్కడ నుంచి బీజేపీ టికెట్‌పై విజయం సాధించారు. సో.. ఇక్కడ పరిచయాలు, గుర్తింపు ఉన్న కుటుంబమే అయినా.. రంగరాజు మాత్రం పుంజుకోలేక పోతున్నారనే వాదన బలపడుతోంది.
ఒకవేళ వైసీపీలో అంతర్గత విభేదాలు ఉంటే.. ఎమ్మెల్యేలకు, తనకు మధ్య గ్యాప్ పెరిగితే.. పరిష్కరించు కుని ముందుకు సాగేందుకు అనేక మార్గాలు ఉన్నాయి. కానీ, రంగరాజు సీనియర్లకు కూడా దూరంగా ఉం టున్నారని తెలుస్తోంది. దీంతో నరసాపురం లోక్‌సభ పరిధిలో వైసీపీ ఇంఛార్జ్ గా ఫైర్ బ్రాండ్‌కు అవకాశం ఇవ్వాలని..పార్టీ అధిష్టానం భావిస్తున్నట్టు తెలుస్తోంది. ఇక్కడ బలమైన టీడీపీ, జనసేన నేతలను ఢీకొడుతూ.. క్షత్రియ సామాజిక వర్గాన్ని తమవైపు తిప్పుకొంటూ.. పార్టీని బలోపేతం చేసే వ్యూహంతో ముందుకు సాగే నాయకుడి కోసం పార్టీ అన్వేషిస్తున్నట్టు సీనియర్ల మధ్య చర్చ సాగుతోంది. మరి అవకాశం ఎవరికి దక్కుతుందో చూడాలి.