ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌కు హైదరాబాద్ శివార్లలో ఉన్న ఫామ్ హౌస్ గురించి ఈ మధ్య ఒక వివాదం చెలరేగిన సంగతి తెలిసిందే. పవన్ కోడి చెరువును కబ్జా చేసి ఫామ్ హౌస్ కట్టుకున్నాడని, అయినా అధికారులు పట్టించుకోవడం లేదని కొందరు సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్లు, జర్నలిస్టులు వీడియోలు పోస్ట్ చేయడం.. సామాజిక మాధ్యమాల్లో ఈ అంశం చర్చనీయాంశం కావడం తెలిసిందే.
ఐతే దీనిపై డిప్యూటీ సీఎం ప్రభుత్వానికి సవాలు విసిరారు. కబ్జా జరిగిందంటూ రుజువు చేస్తే మొత్తం ప్రభుత్వానికి ఇచ్చేస్తానని చెప్పారు. ఆయన మద్దతుదారులు మాత్రం ఇది కబ్జా ఎంతమాత్రం కాదంటూ రుజువులు పెట్టారు. అయినా కూడా ఒక వర్గం పవన్ మీద దాడిని కొనసాగించింది. తెలంగాణ రక్షణ సేన పేరుతో కొత్త పార్టీ పెట్టిన కల్వకుంట్ల కవిత సైతం పవన్ మీద ఆరోపణలు గుప్పించారు. ఐతే ఇప్పుడు హైడ్రా కమిషనర్ రంగనాథ్ స్వయంగా పవన్ ఫామ్ హౌస్ విషయమై క్లారిటీ ఇచ్చారు.
పవన్ కళ్యాణ్ 2014లో దాదాపు పది ఎకరాల భూమి కొని రిజిస్ట్రేషన్ చేయించుకున్నట్లు ఆయన వెల్లడించారు. ఐతే 2016-17 సమయంలో ఈ భూమిలో ఆరేడు ఎకరాలు చెరువుకు సంబంధించి ఎఫ్‌టీఎల్ పరిధిలోకి వచ్చేలా రీమార్కింగ్ జరిగినట్లు ఆయన తెలిపారు. మూడు ఎకరాలు బయట ఉన్నాయన్నారు.
ఐతే ఇలా చెరువు పరిధిలో భూములకు పట్టాలు ఉండడం సహజమే అని.. చాలా చోట్ల ఇలాంటి భూములున్నాయని ఆయన తెలిపారు. ఐతే ఇలా చెరువు పరిధిలో పట్టా భూములు ఇవ్వడం సహజమే అని.. అక్కడ కట్టడాలు లేకుండా చెరువును దెబ్బ తీయకుండా వ్యవసాయం చేసుకోవచ్చని ఆయనన్నారు.
కళ్యాణ్ భూమిలో వాళ్లు నీటి ప్రవాహాన్ని ఆపడం కానీ.. చెరువును దెబ్బ తీయడం కానీ ఏమీ చేయలేదని రంగనాథ్ స్పష్టం చేశారు. కంచె వేయడం ఒక్కటే తప్పని అన్నారు. పక్కనున్న వేరే రైతులు మట్టి తోలి, నిర్మాణాలు చేసి నిబంధనలను అతిక్రమించారని, కానీ కళ్యాణ్ భూమిలో మాత్రం అలాంటిదేమీ జరగలేదని ఆయన తెలిపారు. సోషల్ మీడియాలో కొందరు అజెండా ప్రకారం పని చేసేవాళ్లు దుష్ప్రచారం చేస్తుంటారని.. పవన్ భూమి విషయంలోనూ అదే జరిగిందని.. ఆయన చెరువును ఆక్రమించారు అనడం తప్పని ఆయన తేల్చిచెప్పారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates