కాంగ్రెస్ ముఖ్యనేత, లోక్‌సభలో విపక్ష నాయకుడు రాహుల్ గాంధీకి ప్రధాన మంత్రినరేంద్ర మోడీ చురకలు అంటించారు. పార్లమెంటు వర్షాకాల సమావేశాలు ప్రారంభానికి ముందు సోమవారం ఆయన పార్లమెంటు వద్ద మీడియాతో మాట్లాడారు. “దేశంలో యువశక్తి పుంజుకుంటోంది. అయితే.. నేను 56 ఏళ్ల యువకుడి(రాహుల్) గురించి మాట్లాడడం లేదు“ అని ప్రధాని చమత్కరించారు. అనేక సంస్కరణలకు దేశం ఇప్పుడు వేదికగా మారిందని తెలిపారు.
కేవలం ఒక్క నెలలోనే దేశం అనేక మైలురాళ్లను అధిగమించిందని ప్రధాన మంత్రి తెలిపారు. పౌరులందరిలోనూ గర్వభావం నింపే విజయాలను సాధించామన్నారు. జాతీయ స్థాయి కావచ్చు, అంతర్జాతీయ వేదిక కావచ్చు లేదా అంతరిక్ష రంగం కావచ్చు… ఇవన్నీ భారతదేశానికి నిజంగా గర్వకారణమైన క్షణాలని పేర్కొన్నారు. గత ఏడాది పార్లమెంటు వర్షాకాల సమావేశాలకు కొద్ది రోజుల ముందు.. ఒకరు అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి చేరుకున్న విషయాన్ని ఆయన ప్రస్తావించారు.
రెండు రోజుల కిందట ఒక భారతీయ స్టార్టప్ స్కైరూట్ అద్భుతమైన ఘనతను సాధించిందని ప్రధాని మోడీ తెలిపారు. ప్రపంచంలో చాలా తక్కువ దేశాలు మాత్రమే అంతరిక్ష ప్రైవేట్ రంగంలో అద్భుతాలు సాధించాయన్నారు. తాజాగా భారతీయ యువత అంతరిక్షంలో ఒక కొత్త ప్రయాణాన్ని ప్రారంభించారని తెలిపారు. ‘స్కైరూట్’ స్టార్టప్‌లో పనిచేస్తున్న మొత్తం బృందం సగటు వయస్సు కేవలం 28 ఏళ్లు మాత్రమేనని ఇలాంటి యువతే అద్భుతాలు సాధించగలరని పేర్కొన్నారు.
పార్లమెంటు వర్షాకాల సమావేశాల గురించి మాట్లాడుతూ..ఈ సమావేశాలకు నైరుతి రుతుపవనాలకు మధ్య అవినాభావ సంబంధం ఉందని పేర్కొన్నారు. నైరుతి రుతుపవనాలు అయినా పార్లమెంటు వర్షాకాల సమావేశాలు అయినా… రెండూ చురుకుగా ముందుకు కదిలితేనే.. ఫలితం ఫలప్రదంగా ఉంటుందని పేర్కొన్నారు. అవి రెండూ ఫలప్రదంగా ఉన్నప్పుడే.. అది దేశ శ్రేయస్సుకు.. సమస్త జీవరాశి క్షేమానికి దారితీస్తుందని మోదీ ఉద్ఘాటించారు. అందుకే, రుతుపవనాలు చురుకుగాను, ఫలప్రదంగానూ ఉండాలని, అలాగే పార్లమెంటు వర్షాకాల సమావేశాలు కూడా ఫలప్రదంగా సాగాలని తాము ఆకాంక్షిస్తున్నామన్నారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates