రాహుల్ గాంధీతో ఫోటో కావాలా… ఇదిగో రేవంత్ ఆఫర్!

పార్టీలో కార్య‌క‌ర్త‌ల స్థాయిలో ఉన్న‌వారు.. పార్టీ పెద్ద‌ల‌తో ఫొటోలు అంటే.. ఎంత‌గా ఎగ‌బ‌డ‌తారో అంద‌రికీ తెలిసిందే. మ‌రీ ముఖ్యంగా జాతీయ పార్టీల్లో అయితే.. ఈ ప్ర‌భావం ఎక్కువ‌గా ఉంటుంది. పైగా `కాబోయే ప్ర‌ధాని` అంటూ ప్ర‌చారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ అగ్ర‌నేత రాహుల్ గాంధీతో ఫొటో అంటే.. మ‌రింత‌గా కార్య‌క‌ర్త‌లు క్యూక‌డ‌తారు. వీరి ఆకాంక్ష‌ల‌ను గ‌మ‌నించిన సీఎం రేవంత్ రెడ్డి.. తాజాగా బిగ్ అనౌన్స్‌మెంటు చేశారు. పార్టీలో ఉన్న కార్య‌క‌ర్త‌ల‌ను నేరుగా ఢిల్లీకి తీసుకువెళ్లి రాహుల్ గాంధీతో ఫొటో దిగే అవకాశం క‌ల్పిస్తాన‌ని.. ఆయ‌న‌కు ప‌రిచ‌యం కూడా చేస్తాన‌ని ఆఫ‌ర్ ఇచ్చారు.

రీజ‌నేంటంటే!..

ప్ర‌స్తుతం తెలంగాణ‌ రాష్ట్రంలో స‌మ‌గ్ర ఓట‌రు జాబితా ప్ర‌క్షాళ‌న‌.. `స‌ర్‌` ప్ర‌క్రియ సాగుతోంది. అయితే.. కాంగ్రెస్ పార్టీ త‌ర‌ఫున పెద్దగా దూకుడు ప్ర‌ద‌ర్శించ‌లేక పోతున్నార‌న్న‌ది సీఎం రేవంత్ రెడ్డికి అందిన స‌మాచారం. కీల‌క నాయ‌కులు అంద‌రూ హైద‌రాబాద్ లోనే మ‌కాం వేయ‌డం.. స‌ర్ ప్రక్రియ‌ను లైట్ తీసుకోవ‌డం.. వంటివి ఆయ‌న‌కు ఆగ్ర‌హం తెప్పించాయి. దీంతో నేరుగా ఆయ‌నే రంగంలోకి దిగి నాయ‌కుల‌కు క్లాస్ పీకారు. వ‌చ్చే నెల 10వ తేదీ వ‌ర‌కు గాంధీ భ‌వ‌న్‌కు కానీ, హైద‌రాబాద్‌కు కానీ రావొద్ద‌ని.. క్షేత్ర‌స్థాయిలో స‌ర్ ప్ర‌క్రియ‌లో పాల్గొనాల‌ని పిలుపునిచ్చారు. లేక‌పోతే క‌ఠిన‌చ‌ర్య‌లు తీసుకుంటామ‌న్నారు.

ఈ నేప‌థ్యంలోనే ప్ర‌స్తుతం స‌ర్ ప్ర‌క్రియ‌లో యాక్టివ్‌గా ఉన్న బూత్ లెవిల్ ఏజెంట్స్‌(బీఎల్ ఏ)కు రేవంత్ రెడ్డి కీల‌క ఆఫ‌ర్ చేశారు. వీరంతా కాంగ్రెస్‌పార్టీ కార్య‌క‌ర్త‌లే కావ‌డం గ‌మ‌నార్హం. స‌ర్ ప్ర‌క్రియ‌లో వీరు గ‌త‌నెల రోజులుగా కీ రోల్ పోషిస్తున్నారు. ఈ నేప‌థ్యంలో వారు మరింత అంకిత భావంతో క్షేత్ర‌స్థాయిలో ప‌నిచేయాల‌ని.. కాంగ్రెస్ ఓటు బ్యాంకును ఓట‌ర్ల‌ను కాపాడాల‌ని పిలుపునిచ్చారు. పార్టీ విష‌యంలో అంకిత భావం ప్ర‌ద‌ర్శించే బీఎల్ ఏల‌ను ఎంపిక చేసి.. 100 మందిని స్వ‌యంగా ఢిల్లీకి తీసుకువెళ్తాన‌ని ఆయ‌న చెప్పారు. వీరంద‌రినీ పార్టీ ముఖ్య‌నేత రాహుల్‌గాంధీకి ప‌రిచ‌యం చేయ‌డంతోపాటు ఆయ‌న‌తో ఫొటో దిగే అవ‌కాశం క‌ల్పిస్తామ‌న్నారు.

ప్ర‌స్తుతం ఎలా ఉంది?

ప్ర‌స్తుతం స‌ర్ ప్ర‌క్రియ‌లో ప్ర‌ధాన ప్రతిప‌క్షం బీఆర్ఎస్ దూకుడుగా ఉంద‌ని ప్ర‌భుత్వానికి నివేదిక‌లు అందుతున్నాయి. ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్ పార్టీ త‌ర‌ఫున ఎంపీల నుంచి ఎమ్మెల్యేల వ‌ర‌కు అంద‌రూ క్షేత్ర‌స్థాయిలో ఉండాల‌ని సీఎం రేవంత్ రెడ్డి సూచించారు. మ‌రో 15 రోజుల పాటు స‌ర్ ప్ర‌క్రియ కొన‌సాగుతుంద‌ని అప్ప‌టి వ‌ర‌కు ఎవ‌రూ హైద‌రాబాద్‌కు రావొద్ద‌ని ఆయ‌న హెచ్చరించారు. ప్ర‌తి ఒక్క‌రూ స‌ర్‌పైనే దృష్టిపెట్టాల‌న్నారు. ఇదేస‌మ‌యంలో బీఎల్ ఏ(బూత్ లెవిల్ ఏజెంట్స్‌) ఇచ్చిన జాబితాల‌నే ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకోవాల‌ని కూడా రేవంత్ రెడ్డి సూచించారు. ఏ చిన్న‌తేడా వ‌చ్చినా.. క‌ఠిన చ‌ర్య‌లు త‌ప్ప‌వ‌ని ఎంపీలు, ఎమ్మెల్యేల‌ను ఆయ‌న హెచ్చ‌రించ‌డం గ‌మ‌నార్హం.