ఇంకెంతమంది భారతీయులు బలి కావాలి?

పశ్చిమాసియాలో నెలకొన్న శాంతియుత పరిస్థితులు మళ్లీ ఉద్రిక్తంగా మారిపోయాయి. ఇరాన్ ను లక్ష్యంగా చేసుకుని అమెరికా భీకర దాడులకు దిగింది. ప్రతిగా ఇరాన్ కూడా ఎదురు దాడులకు దిగింది. పరస్పర దాడుల్లో ఆ రెండు దేశాలకు ఏ మేర నష్టం వాటిల్లిందన్న విషయాన్ని పక్కనపెడితే…ఇరాన్ దాడుల్లో భారత్ కు చెందిన ఓ వాణిజ్య నౌక ధ్వంసం కాగా… అందులోని ఓ భారతీయుడు గల్లంతయ్యాడు. ఈ ఘటన హర్మూజ్ జలసంధికి సమీపంలో ఆదివారం చోటుచేసుకుంది.

రెండు దేశాల మధ్య యుద్థం కారణంగా ఆ దేశాలకు చెందిన ఆస్తి, ప్రాణ నష్టాలు సర్వసాధారణమే అయినప్పటికీ… ఆ యుద్ధం కారణంగా ఇతర దేశాలకు.. అది కూడా అలీన ఉద్యమంతో ప్రపంచ శాంతికి బాటలు వేస్తున్న భారత్ లాంటి దేశాలకు నష్టం వాటిల్లుతుండటం గమనార్హం. అమెరికా, ఇరాన్ యుద్ధంలో భారత్ ఏ ఒక్క దేశానికి మద్దతు పలకని సంగతి తెలిసిందే. అదే సమయంలో ఇరు దేశాలు చర్చించుకుని ప్రపంచ శాంతికి పాలుపడాలని భారత్ ఆకాంక్షిస్తున్న సంగతీ తెలిసిందే. ఇలాంటి నేపథ్యంలో ఇరాన్ దాడిలో భారత నౌక ధ్వంసం కావడం, అందులోని ఓ భారతీయుడు గల్లంతు కావడం గమనార్హం.

ఇక ఈ దాడికి సంబంధించిన వివరాల్లోకి వెళితే… సైప్రస్ జెండాతో భారత్ బయలుదేరిన జీఎఫ్ఎన్ గెలాక్సీ నౌకపై ఓమన్ తీరం సమీపంలో హర్మూజ్ జల సంధికి చేరుకున్న సమయంలో ఇరాన్ నుంచి దూసుకువచ్చిన బాంబు పడింది. దీంతో గెలాక్సీ నౌకలో పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. నౌకలో మంటలు చెలరేగిన సమయంలో అందులో ఉన్న 11 మంది భారతీయులు దానిని వదిలేసి చిన్నపాటి లైఫ్ బోటులో ప్రాణాలు కాపాడుకునే యత్నం చేశారు. ఈ క్మంలో 10 మంది భారతీయులు చిన్నబోటులో సురక్షిత ప్రాంతానికి చేరుకోగా… మరో వ్యక్తి మాత్రం గల్లంతయ్యారు. గల్లంతైన వ్యక్తి కోసం సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. 

ఈ ఘటనపై భారత విదేశాంగ శాఖ తీవ్రంగా స్పందించింది. ఇరాన్ దాడికి ఖండిస్తూ ఆ శాఖ ఓ ప్రకటనను విడుదల చేసింది. దాడి జరిగిన సమయంలో ఓమన్ ప్రభుత్వం వేగంగా స్పందించి… ప్రమాదంలో పడిన భారతీయులను కాపాడిందని ఆ శాఖ తెలిపింది. భారతీయులను కాపాడిన ఓమన్ ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపింది. గల్లంతైన వ్యక్తి కోసం ఓమన్ దేశ సహాయక సిబ్బందితో కలిసి గాలింపు చేపట్టినట్లు తెలిపింది.