తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ మరోసారి అధికారంలోకి వచ్చి తీరుతుందన్నారు. అంతేకాదు, 117 సీట్లలో గెలిచి తీరుతామని ఆయన చెప్పారు. భద్రాద్రి రామయ్యపై ఆన.. వచ్చే ఎన్నికల్లో మేం 117 స్థానాల్లో గెలిచి తీరుతాం. అని వ్యాఖ్యానించారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని జగన్నాథపురంలో నిర్వహించిన కార్యక్రమంలో రైతు భరోసా చివరి విడత నిధులను ఆయన పంపిణీ చేశారు. అనంతరం సీఎం మాట్లాడుతూ.. వచ్చే ఎన్నికల్లో విజ యం తమదేనని చెప్పారు.
రాష్ట్రంలో ప్రస్తుతం 119 శాసన సభ స్థానాలు ఉన్నాయి. వచ్చే పార్లమెంటు సమావేశాల్లో అసెంబ్లీ స్థానాల పెంపు బిల్లు ఆమోదం పొందితే.. 50 శాతం మేరకు సీట్లు పెరగనున్నాయి. దీంతో ప్రస్తుతం ఉన్న 119 సీట్లు 182కి చేరనున్నాయి. ఈ లెక్కన తాము 117 స్థానాల్లో ఖచ్చితంగా విజయం దక్కించుకుంటామని రేవంత్ రెడ్డి చెప్పారు. రాష్ట్రంలో అన్ని వర్గాలకు మేలు చేస్తున్నామని .. గత పాలకులు విస్మరించిన వర్గాలను కూడా తాము అక్కున చేర్చుకుంటున్నామన్నారు. ఇప్పటి వరకు 80 వేలకుపైగా ఉద్యోగాలు ఇచ్చామని, మరిన్ని ఉద్యోగాలు కల్పించేందుకు రెడీగా ఉన్నామని చెప్పారు.
ఎన్నికలు 2029లోనే..
వచ్చే ఎన్నికలు 2029లోనే జరుగుతాయని సీఎం చెప్పారు. 2028లో జరగబోవని వెల్లడించారు. ఎవరో ఏదో ముందస్తుగా ఎన్నికలకు వెళ్లారని తాము అలా వెళ్లేది లేదని చెప్పారు. షెడ్యూల్ ప్రకారమే రాష్ట్రంలో ఎన్నికలు జరుగుతాయని వివరించారు. ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ మరోసారి విజయం దక్కించుకుంటుందన్నారు. లోక్‌సభ స్థానాలు 17 నుంచి 26కి పెరుగుతాయని తెలిపారు. వాటిలోనూ రమారమి 20 స్థానాల్లో విజయం సాధిస్తామన్నారు. ఏ పార్టీతోనూ తమకు పంచాయతీ లేదని.. ప్రజలతోనే కలిసి ఉంటామని, ప్రజలతోనే విజయం దక్కించుకుంటామని తేల్చి చెప్పారు.. గత పాలకులు రాష్ట్రాన్ని అప్పుల మయం చేశారని.. అందుకే ఖజానా ఇబ్బంది పడుతోందని వ్యాఖ్యానించారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates