రాజకీయ నేతలు…ప్రత్యేకించి జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, ఇతరత్రా ప్రముఖులపై తనదైన శైలి దూషణ భాషతో పేట్రేగిపోయిన జోసెఫ్ రావణ్ అలియాస్ ప్రశ్న రావణ్ కటకటాల్లోకి వెళ్లిపోయారు. ఏదో చిన్నపాటి సెక్షన్ల ఆధారంగా నమోదు అయిన కేసుల్లో రావణ్ కు బెయిల్ దొరికినా… హిందూ మతంపై ఆయన చేసిన ఆరోపణలతో ఏకంగా ఉపా చట్టం కింద కేసులు నమోదు కావడంతో రావణ్ పరిస్థితి ప్రమాదంలో పడిపోయింది. మొన్నటిదాకా రావణ్ ను పెద్దగా పట్టించుకోని విపక్ష వైసీపీ… ఇప్పుడు నేరుగానే రంగంలోకి దిగిపోయింది. వైసీపీ న్యాయ విభాగం కీలక నేత, ప్రముఖ న్యాయవాది పొన్నవోలు సుధాకర్ రెడ్డిని వైసీపీ అదిష్ఠానం ఇప్పుడు రంగంలోకి దింపుతోంది. వెరసి రావణ్ బూతుల పర్వం వెనుక తానే ఉన్నానని వైసీపీ ఒప్పుకున్నట్టు అయ్యిందన్న వాదనలు వినిపిస్తున్నాయి. అదే సమయంలో పొన్నవోలు ఎంట్రీతో రావణ్ కు ఊరట దక్కడం కలేనన్న వాదనలూ ఆసక్తి రేకెత్తిస్తున్నాయి.
ఏపీలో అధికార కూటమిలోని కీలక బాగస్వామి జనసేన పార్టీని టార్గెట్ చేస్తూ ఎంట్రీ ఇచ్చిన రావణ్ అనతికాలంలోనే ఫేమస్ అయిపోయారు. నిత్యం జనసేనను, పార్టీకి చెందిన కీలక నేతలను టార్గెట్ చేస్తూ సంచలన వ్యాఖ్యలు గుప్పించిన రావణ్ పీకల్లోతు కష్టాల్లో పడిపోవడం ఖాయమన్న వాదన అయితే ఆదిలోనే వినిపించింది. అదే సమయంలో రావణ్ ను తాను వెనకుండి అతడిని ముందుకు నడిపేందుకు పక్కా వ్యూహం రచించిన వైసీపీ… తన పేరు మాత్రం బయటకు రాకుండా చూసుకుంది. అయితే ఆ తర్వాత వెంటవెంటనే జరిగిన పరిణామాలతో రావణ్ డేంజర్ లో పడిపోవడం, ఆయన కోసం పొన్నవోలును రంగంలోకి దించుతూ వైసీపీ తన ప్రత్యక్ష పాత్రను చాటుకున్న పరిణామాలు వేగంగా జరిగిపోయాయి.
సరే… ఇదంతా గేమ్ ప్లాన్ ప్రకామే జరిగిందని అనుకున్నా… ఇప్పుడు పొన్నవోలు వాదనలతో రావణ్ కు మేలు జరుగుతుందా? అంటే అనుమానమేనన్న వాదనలు వినిపిస్తున్నాయి. ఎందుకంటే గతంలో నమోదు అయిన పలు కేసుల్లో పొన్నవోలు వాదనలు కోర్టుల్లో అడ్డంగా చతికిలబడిపోయిన వైనం తెలిసిందే. ప్రముఖ సినీ నటుడు పోసాని కృష్ణ మురళి వ్యవహారంలో పొన్నవోలు వాదనలు ఆయనను రక్షించలేకపోయాయి. రోజుల తరబడి పలు స్టేషన్ల చుట్టూ తిరిగిన పోసాని.. చివరాఖరుకు బెయిల్ దక్కించుకున్నా… పొన్నవోలు కారణంగానే తాను రోజుల తరబడి జైలు జీవితం గడపాల్సి వచ్చిందని బాధపడ్డ సంగతి తెలిసిందే.
ఇక టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు అరెస్టు వ్యవహారంలో నాడు వైసీపీ ప్రభుత్వం తరఫున వాదనలు వినిపించిన పొన్నవోలు ఏమాత్రం ప్రభావం చూపలేకపోయారు. ఇక తానేదో ఏపీ కోర్టుల్లో విజయవంతమైన న్యాయవాదిగా గుర్తింపు సాధించానంటూ ఢిల్లీ వెళ్లి మరీ మీడియా సమావేశం పెట్టిన పొన్నవోలు…జాతీయ మీడియా ముందు అభాసుపాలైన విషయం తెలుగు ప్రజలు ఇంకా మరిచిపోనే లేదనే చెప్పాలి.
ఏ కోవన చూసినా… పొన్నవోలు వాదనలు ఏనాడూ కోర్టుల్లో పెద్దగా ఫలితం సాదించలేదనే మాట అయితే గట్టిగానే వినిపిస్తోంది. ఈ నేపథ్యంలో పొన్నవోలు వాదనలతో ఇప్పుడు రావణ్ కు కూడా ఫెద్దగా ఫలితం ఉండదన్న విశ్లేషణలు సాగుతున్నాయి. అంతేకాకుండా పొన్నవోలు వాదనలతో రావణ్ మరింతగా ఇబ్బందులకు గురయ్యే ప్రమాదం లేకపోలేదన్న వాదనలూ ఆసక్తి రేకెత్తిస్తున్నాయి.
Gulte Telugu Telugu Political and Movie News Updates