‘కూట‌మి లేకుంటే… మీ ఆస్తులు దోచేసేవారు’

రాష్ట్రంలో కూట‌మి ప్ర‌భుత్వం వ‌చ్చింది కాబ‌ట్టి మీరు ప్ర‌శాంతంగా ఉంటున్నారు. 2024లో కూడా మ‌రోసారి మీరు త‌ప్పు చేసి ఉంటే.. మీ ఆస్తులు మొత్తం ఈ పాటికి ఎప్పుడో దోచేసేవారు. అని వైసీపీపై సీఎం చంద్ర‌బాబు నిప్పులు చెరిగారు. గ‌త గొడ్డ‌లి పార్టీ హ‌యాంలో అంద‌రికీ న‌ర‌కం చూపించార‌ని.. చివ‌ర‌కు త‌న‌ను కూడా వ‌ద‌ల‌కుండా జైల్లో పెట్టి పైశాచిక ఆనందం పొందార‌ని వ్యాఖ్యానించారు. ఇలాంటి పార్టీని భూస్థాపితం చేయాల్సిన అవ‌స‌రం ప్ర‌జ‌ల‌కు ఉంద‌న్నారు.

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అని ఒక‌టి తెచ్చాడు. మీ భూముల‌పై ఆయ‌న ఫొటోలు వేసుకున్నాడు. మీ భూముల స‌రిహ‌ద్దు రాళ్ల‌పై ఆయ‌న ఫొటోలు వేసుకున్నాడు. రేపు మీ భూములు కూడా త‌న‌వేన‌ని చెప్పుకొని అమ్మేసుకున్నా.. మీకు దిక్కులేకుండా చేయాల‌ని ప‌న్నాగం ప‌న్నాడు. కూట‌మి వ‌చ్చాక‌.. భూములు ఎవ‌రివో గుర్తించాం. నిజ‌మైన ల‌బ్ధిదారుల‌కు వాటిని అందేలా చేస్తున్నాం అని చంద్ర‌బాబు తెలిపారు. అందుకే ప్ర‌తి నెలా 9వ తేదీన రైతుల‌కు ప‌ట్టాలు పంపిణీ చేసే కార్య‌క్ర‌మానికి శ్రీకారం చుట్టామ‌న్నారు.

ఉమ్మ‌డి చిత్తూరు జిల్లా మ‌ద‌న‌ప‌ల్లెలో ప‌ర్య‌టించిన చంద్ర‌బాబు మీ భూమి-మీహ‌క్కు కింద రైతుల‌కు ప‌ట్టాలు పంపిణీ చేశారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ.. 2019లో ఒక్క ఛాన్స్ అంటూ గొడ్డ‌లి పార్టీ ప్ర‌జ‌ల‌ను మోసం చేసింద‌న్నారు. ప్ర‌జ‌లు న‌మ్మి.. ఓటేస్తే.. చివ‌ర‌కు ప్ర‌జ‌ల ఆస్తులే దోచుకునేందుకు దీర్ఘ‌కాలిక ప్ర‌ణాళిక వేశార‌ని, దీనిని తాము అడ్డుకున్నామ‌ని తెలిపారు. ప్ర‌స్తుతం రైతుల‌కు ఎలాంటి ఇబ్బంది లేకుండా భూములు పంపిణీ చేస్తున్నామ‌న్నారు. వీటిని డిజిట‌లీక‌ర‌ణ కూడా చేస్తున్న‌ట్టు చెప్పారు.

తాము ఇచ్చిన మాట‌ను నిల‌బెట్టుకున్నామ‌ని చంద్ర‌బాబు తెలిపారు. అధికారంలోకి రాగానే.. ల్యాండ్‌ టైటిలింగ్‌ యాక్టును రద్దు చేసినట్టు తెలిపారు. ప్ర‌జ‌లు ఎంతో క‌ష్ట‌ప‌డి రూపాయి రూపాయి పోగేసుకుని సంపాయించుకున్న ఆస్తిపై వారికే స‌ర్వ‌హ‌క్కులూ ఉంటాయ‌ని తెలిపారు. అలాంటిది గ‌త గొడ్డ‌లి పార్టీ త‌మ హ‌క్కుగా మార్చుకునేందుకు ప్ర‌య‌త్నించింద‌న్నారు. ఇలాంటి పార్టీల‌ను రాష్ట్రం నుంచి వెళ్ల‌గొట్టాల‌ని చంద్ర‌బాబు పిలుపునిచ్చారు. ప్ర‌తి ఒక్క‌రూ గొడ్డ‌లి పార్టీకి వ్యతిరేకంగా గ‌ళం వినిపించాల‌ని సూచించారు.