కళాకారుడి చెమటకు దక్కిన గౌరవం

చేతి కళను మాత్రమే కాదు… ఆ చేతుల వెనుక ఉన్న జీవితాలను కూడా స్పృశించిన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. గంటల తరబడి కళాకారుల మధ్య గడుపుతూ, వారి బాధలు ఆలకిస్తూ, వేలాది హస్తకళాకారుల హృదయాల్లో కొత్త భరోసా నింపారు. మన సంస్కృతిని తరతరాలకు మోస్తున్న ఆ సజీవ శిల్పులకు ప్రభుత్వం తమ వెంటే ఉందనే విశ్వాసాన్ని కల్పించారు.

కళ అనేది కేవలం వస్తువులను సృష్టించడం కాదు… తరాల సంప్రదాయాన్ని చేతుల్లో మోసే జీవనయానం. ఆ చేతుల్లో పగుళ్లు ఉంటాయి… కళల్లో ఎన్నో కళలు ఉంటాయి… గుండెల్లో చెప్పలేని కష్టాలు దాగి ఉంటాయి. అలాంటి కళాకారుల మధ్యకు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ వెళ్లినప్పుడు అది ఒక ప్రభుత్వ కార్యక్రమంగా మాత్రమే మిగలలేదు. కళను సృష్టించే చేతులను, ఆ చేతుల వెనుక ఉన్న జీవితాలను హత్తుకున్న ఆత్మీయ అనుభూతిగా నిలిచిపోయింది.

విజయవాడ అంబేద్కర్ కళావేదికలో మంగళవారం నిర్వహించిన ఆంధ్రప్రదేశ్ హస్తకళా మహోత్సవం–2026లో అడుగుపెట్టిన తొలి క్షణం నుంచి చివరి వరకు ప్రతి అడుగులోనూ ఆయన కళాకారులతో మమేకమయ్యారు. ప్రతి స్టాల్‌ను సందర్శించారు. కళాఖండాలను చూసి ముందుకు సాగిపోలేదు. వాటిని మలిచిన చేతులను పలకరించారు. వారి జీవన ప్రయాణాన్ని తెలుసుకునే ప్రయత్నం చేశారు. ఒక్కో కళాఖండం వెనుక ఎంత శ్రమ ఉందో… ఎంత సమయం వెచ్చిస్తారో… ఎంత ఆదాయం వస్తుందో ఎంతో ఆసక్తిగా అడిగి తెలుసుకున్నారు.

“మీ పిల్లలు ఏమి చదువుతున్నారు…?”, “వారికి చదువులో ఎలాంటి ఇబ్బందులు ఉన్నాయి…?”, “ఇంట్లో పెద్దల ఆరోగ్యం ఎలా ఉంది…?”, “ప్రభుత్వం మీ కోసం ఇంకా ఏమి చేయాలి…?” అంటూ ఆయన అడిగిన ప్రతి ప్రశ్నలో ఒక ప్రజాప్రతినిధి కంటే కుటుంబ పెద్ద ఆప్యాయత కనిపించింది. కళాకారులు చెప్పిన ప్రతి మాటను ఓపికగా విన్నారు. సమస్యలను నమోదు చేయించారు. వెంటనే అధికారులను పిలిపించి పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. సంక్షేమం అంటే కేవలం ఆర్థిక సాయం కాదని… కళాకారుడి కుటుంబం గౌరవంగా జీవించే పరిస్థితులు కల్పించడమే నిజమైన సంక్షేమమని స్పష్టం చేశారు.