ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్.. ఉరఫ్ PK .. ఈ నెల 30న జరగనున్న అసెంబ్లీ ఉప ఎన్నికలో ప్రత్యక్ష పోరుకు దిగుతున్నారు. ఈ మేరకు అధికారికంగా ఆయన ఓ ప్రకటన చేశారు. బీహార్‌కు చెందిన పీకే.. గతంలో వైసీపీ సహా ఇతర పార్టీలకు వ్యూహ కర్తగా పనిచేశారు. అనంతరం.. తన స్వరాష్ట్రం బీహార్‌లో `జన్ సురాజ్`పేరుతో పార్టీ పెట్టుకున్నారు. పాదయాత్ర చేసి ప్రజలను కలుసుకున్నారు. ఈ ఏడాది ప్రారంభంలో జరిగిన బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఒంటరిగానే బరిలోకి దిగారు. మొత్తం 243 స్థానాలు ఉన్న బీహార్ అసెంబ్లీ పోరులో జన్ సురాజ్ పార్టీ తరఫున 238 స్థానాల్లో అభ్యర్థులను నిలబెట్టారు.
ఆ ఎన్నికల్లో ప్రత్యక్ష పోటీకి పీకే దూరంగా ఉండడం, కేవలం ప్రచారానికి మాత్రమే పరిమితం కావడం గమనార్హం. అయితే… ఆయన చేసిన ప్రచారానికి, ఆయనను చూసేందుకు ప్రజలు తండోపతండాలుగా తరలివచ్చినా.. ఎన్నికల్లోకి వచ్చేసరికి మాత్రం సగానికిపైగా జన్ సురాజ్ పార్టీ తరఫున పోటీచేసిన అభ్యర్థులకు డిపాజిట్లు కూడా దక్కలేదు. ఇక, ఒక్కరైనా గెలుస్తారని అనుకున్నా..చివరి నిమిషం వరకు ఒకింత మెజారిటీతో కొనసాగిన ఇద్దరు అభ్యర్థులు కూడా చేతులు ఎత్తేశారు. దీంతో ఆ ఎన్నికల్లో ఒక్కరూ విజయం దక్కించుకోలేక పోయారు. ఫలితంగా పీకే ప్రయత్నాలు విఫలమయ్యాయి.
దీంతో జన్ సురాజ్ పార్టీ ఘోర ఓటమికి బాధ్యత వహిస్తూ.. 11 రోజులు పీకే మౌన దీక్ష చేపట్టారు. ఆ తర్వాత ఏర్పడిన బీజేపీ +జేడీయూ పార్టీల కూటమి సర్కారుపై నిశిత విమర్శలు చేసి.. ప్రజల్లో పాపులారిటీని సాధించారు. తాజాగా బీజేపీ జాతీయ అధ్యక్షుడుగా ఉన్న నితిన్ నబీన్.. అసెంబ్లీ ఎన్నికల్లో తాను గెలిచిన `బంకీపుర` నియోజకవర్గానికి రాజీనామా చేశారు. ఎందుకంటే.. ఆయన బీజేపీ జాతీయ అధ్యక్షుడు కావడంతోపాటు.. రాజ్యసభకు బీజేపీ ఆయనను ప్రమోట్ చేసింది. త్వరలోనే మంత్రి పదవి కూడా దక్కుతుందన్న ప్రచారం ఉంది. ఈ నేపథ్యంలో ఖాళీ అయిన బంకీపుర నియోజకవర్గానికి ఈ నెల 30న కేంద్ర ఎన్నికల సంఘం ఉప ఎన్నిక నిర్వహించనుంది.
ఈ నియోజకవర్గం నుంచే పీకే తన పార్టీ జనసురాజ్ తరఫున పోటీకి రెడీ అయ్యారు. ఆదివారం నిర్వహించిన పార్టీ కార్యవర్గ సమావేశంలో ఈ మేరకు పార్టీ నేతలు ఏకగ్రీవ నిర్ణయం తీసుకున్నారు. అయితే.. బంకీపుర నియోజకవర్గం నితిన్ నబీన్ సహా ఆయన కుటుంబానికి, బీజేపీకి కంచుకోటగా మారింది. వరుస విజయాలతో ఇక్కడ బీజేపీ బలమైన పార్టీగా మారింది. ఇలాంటి చోట.. పీకే ఇప్పుడు బరిలో నిలుస్తుండడం.. గమనార్హం. అయితే.. ఇతర పార్టీలను ఒప్పంచి.. తాను ప్రతిపక్ష పార్టీల తరఫున అభ్యర్థిగా నిలబడేందుకు ప్రయత్నాలు చేస్తానని పీకే చెప్పడం గమనార్హం. కానీ, ఈ ప్రతిపాదనకు కాంగ్రెస్ పార్టీ ఓకే అంటుందా? లేదా? అనేది చూడాలి.
Gulte Telugu Telugu Political and Movie News Updates