ఏపీలో ప్రతిపక్షంగా ఉన్న వైసీపీలో చీలిక రానుందా? ఆ పార్టీ నాయకులు చీలిపోవడమో.. లేక కూటమిలోని ఓ పార్టీలో చేరిపోవడమో ఖాయంగా కనిపిస్తోందా? అంటే.. ఔననే సమాధానమే వినిపిస్తోంది. నాయకుల మాటకు విలువ లేకపోవడం.. వారు చెప్పింది ఆలకించే స్థాయిలో జగన్ ఇంకా కనిపించక పోవడం.. వంటివి పెద్ద ఎత్తున చర్చకు వస్తున్నాయి. దీంతో ఇప్పుడు సీనియర్ల నుంచి జూనియర్ల వరకు తమకు అనుకూలంగా ఉన్న పార్టీలవైపు దృష్టి పెడుతున్నట్టు తెలుస్తోంది. ఇదే జరిగితే.. వైసీపీ చీలిక దిశగా అడుగులు వేయడం ఖాయమని అంటున్నారు.
వాస్తవానికి పార్టీల్లో భిన్నాభిప్రాయాలు ఉండడం సహజమే. కానీ, కీలకమైన ప్రజల కోణంలో చూసినప్పుడు.. నాయకుల వాదనను కూడా పార్టీలు పట్టించుకోవాలి. ఉదాహరణకు.. పశ్చిమ బెంగాల్ మాజీ సీఎం మమతా బెనర్జీ తన మేనల్లుడు అభిషేక్ బెనర్జీని వెనుకేసుకు వచ్చారు. ఇలా వద్దని పార్టీ నాయకులు కోరారు. ఆమె వినిపించుకోలేదు. ఫలితంగా పార్టీ ఓడిపోవడమే కాదు.. ఇప్పుడు పార్టీ నేతలు కూడా.. ఆమెను వదిలేసి వెళ్లిపోతున్నారు. ఇక, పార్టీనే మూసేయాల్సిన పరిస్థితి ఏర్పడింది.
అదేవిధంగా తమిళనాడులో అన్నాడీఎంకే.. బీజేపీతో పొత్తు పెట్టుకోవడాన్ని ఆ పార్టీ నాయకులు సహించలేదు. కానీ, నాయకుల మాటను పళని స్వామి వినిపించుకోలేదు. ఫలితంగా గెలిచే పార్టీ కనీసం ప్రతిపక్ష హోదా కూడా దక్కించుకోలేక పోయింది. ఇలా.. నాయకుల మాట వినిపించుకోని పార్టీలు దేశంలో చీలిపోతున్నాయి. చిందరవందరగా కూడా మారుతున్నాయి. ఈ నేపథ్యంలోనే వైసీపీలోనూ చీలిక దిశగా అడుగులు పడుతున్నాయన్న చర్చ జరుగుతోంది.
గతంలో మూడు రాజధానులు సహా.. ప్రస్తుత మావిగన్ ప్రతిపాదన వంటివి వైసీపీ నాయకులు జీర్ణించుకో లేకపోతున్నారు. ఎన్నికల సమయంలో ఎవరికి టికెట్ ఇస్తారో.. ఎవరిని మారుస్తారో తెలియని పరిస్థితి నెలకొంది. అలానే.. తమకు ఏమాత్రం వాల్యూ లేకుండా చేస్తున్నారని సీనియర్లు వాపోతున్నారు. ఈ పరిణామాల క్రమంలోనే నాయకులు పక్క చూపులు చూస్తున్నారు.
ఇక, కూటమి పార్టీల్లో బలోతపేతం కావాలని భావిస్తున్న.. బీజేపీ వీరిని చేర్చుకునేందుకు రెడీగా ఉన్నట్టు రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తోంది. ఇలాంటి సమయం కోసం.. బీజేపీ ఎదురు చూస్తున్న పరిస్థితి దేశవ్యాప్తంగా కూడా కనిపిస్తోంది. ఈ క్రమంలో వైసీపీ నుంచి వచ్చేవారికి బీజేపీ ఎర్రతివాచీ పరిచినా ఆశ్చర్యం లేదని అంటున్నారు. ఇక, వ్యక్తిగతంగా నాయకులకు ఎలానూ బలం ఉంటుంది. సో.. అలాంటి వారు ఇక, జగన్‌పై తిరుగుబాటు చేయడం ఖాయమన్న సంకేతాలు వస్తున్నాయి. వచ్చే వారం పదిరోజుల్లో ఏదైనా జరగొచ్చని.. వైసీపీకి చెందిన నాయకుడు ఒకరు నర్మగర్భ వ్యాఖ్యలు చేయడం గమనార్హం.
Gulte Telugu Telugu Political and Movie News Updates