టీడీపీ, జనసేనల మైత్రి క్షేత్రస్థాయిలో ఎలా ఉంది…?

ఏపీలో కూటమి పాలనకు అప్పుడే రెండేళ్లు పూర్తి అయిపోయింది. ఇంకో మూడేళ్లు ఉంటే మరో ఎన్నికలకు కూటమి పార్టీలు సన్నద్ధం కావాల్సిన పరిస్థితి. అంతకంటే ముందు రాష్ట్రంలో త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి పార్టీల మద్య మైత్రి ఎలాంటి ఫలితాలను ఇవ్వనుంది. అందులోనూ ప్రత్యేకించి టీడీపీ, జనసేనల మద్య పొత్తు ఈ ఎన్నికల్లో ఎలాంటి ఫలితాలను ఇవ్వనుందా అన్న దానిపై ఇప్పుడు ఆసక్తికర చర్చ జరుగుతోంది. ఇలాంటి కీలక తరుణంలో మా ప్రతినిధికి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో టీడీపీ సీనియర్ నేత, దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ ఈ విషయంపై కీలక వ్యాఖ్యలు చేశారు. కూటమి పార్టీల మధ్య పొత్తుకు వచ్చిన ఇబ్బందేమీ లేదని కూడా ఆయన ఫుల్ క్లారిటీ ఇచ్చారు. 

ఈ ఇంటర్వ్యూలో రాష్ట్ర రాజకీయాలు, ఆయా జిల్లాలు, నియోజకవర్గాల్లో కూటమి పార్టీల మద్య ఏ తరహా బంధం కొనసాగుతోందన్న దానిపై చింతమనేని పూర్తి స్థాయిలో వివరణ ఇచ్చారు. కూటమిలోని మూడు పార్టీల మధ్య ప్రస్తుతానికి ఎలాంటి ఇబ్బంది లేదని ఆయన తెలిపారు. భవిష్యత్తులోనూ తమ పార్టీల మద్య పొరపొచ్చాలు వచ్చే అవకాశమే లేదని కూడా ఆయన పేర్కొన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి పార్టీల మధ్య పొత్తు వల్ల కలిగే లాభాలను ప్రత్యక్షంగా చూడబోతున్నామని ఆయన అన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి పార్టీలు కాకుండా మరే ఇతర పార్టీ ప్రభావం చూపే అవకాశమే లేదని ఆయన తేల్చి పారేశారు.

కూటమిలోని టీడీపీ, జనసేనల మధ్య ఎక్కడికక్కడ విభేదాలు పొడచూపుతున్నాయన్న అంశాలపై చింతమనేని ఆసక్తికరంగా స్పందించారు. ఇద్దరు అన్నాదమ్ముల మధ్యే విభేదాలు పొడచూపుతున్న పరిస్థితులు రాజ్యమేలుతున్న ప్రస్తుత తరుణంలో రెండు రాజకీయ పార్టీల మధ్య విభేదాలు సర్వసాధారణమేనని ఆయన అన్నారు. అయితే ఈ విభేదాలను చర్చించుకుని, సావదానంగా చర్చలు జరుపుకుని వాటిని అధిగమించే దిశగా సాగుతున్నామని ఆయన అన్నారు. 

ఇక టీడీపీ, జనసేనల మధ్య విభేదాలు సమసిపోకుంటే కూడా పరిస్థితి ఎలా ఉండబోతోందన్న విషయాన్నీ చింతమనేని ప్రస్తావించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమిలోని అన్ని పార్టీలు కలిసి కూచ్చుని చర్చించుకుని సీట్లను పంచుకుంటామని ఆయన పేర్కొన్నారు. అలా కాని పరిస్థితులే ఉంటే… ఆయా స్థానాల్లో కూటమి పార్టీలే స్నేహపూర్వకంగా పోటీ చేస్తాయని ఆయన చెప్పారు. అంటే… స్థానిక సంస్థల ఎన్నికల్లో దాదాపుగా అన్ని సీట్లు కూటమి పార్టీల కాతాల్లోనే పడిపోవడం తప్పించి.. ఇంకో పార్టీకి అవకాశం దక్కకుండా నడచుకుంటామని చింతమనేని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.