కలుపుకొని పోకపోతే కష్టం జగన్

ఊరంతా ఒక‌దారి ఉలిపిక‌ట్టెదు మ‌రోదారి అన్న‌ట్టుగా వైసీపీ అధినేత జ‌గ‌న్ చేసిన మావిగ‌న్ ప్ర‌క‌ట‌న అనంత‌రం.. వైసీపీలో అసంతృప్తి జ్వాల‌లు రాజుకుంటున్నాయి. స‌మయం కాని స‌మ‌యంలో జ‌గ‌న్ ఈ ప్ర‌క‌ట‌న చేశార‌ని .. మెజారిటీ నాయ‌కులు అభిప్రాయ‌ప‌డుతున్నారు. ప్ర‌స్తుతం రాష్ట్రంలో పార్టీని బ‌లోపేతం చేయాల్సిన అవ‌స‌రం ఉంద‌ని సీనియ‌ర్లు చెబుతున్నారు. ఈ క్ర‌మంలో దానికి సంబంధించిన అంశాలు.. కూట‌మి స‌ర్కారు లోటుపాట్ల‌ను గ‌మ‌నించి.. వాటిని త‌మ‌కు అనుకూలంగా మార్చే అంశాల‌పై దృష్టి పెట్టుకుండా ఈయాగీ ఎందుక‌న్న‌ది సీనియ‌ర్ల ప్ర‌శ్న‌.

అంతేకాదు.. రాష్ట్రంలో బీజేపీ-టీడీపీ-జ‌న‌సేన‌లు కూట‌మిగా ఉన్నాయి. వ‌చ్చే ఎన్నిక‌ల్లోనూ విజ‌యం ద‌క్కించుకునేందుకు ప్ర‌య‌త్నిస్తున్నాయి. ఈ క్ర‌మంలో ఇత‌ర ప‌క్షాలైన క‌మ్యూనిస్టులు, చిన్నాచిత‌కా పార్టీలు ఐక్యత కోసం ప్ర‌య‌త్నాలు చేస్తున్నాయి. ఇటీవ‌ల సీపీఐ సీనియ‌ర్ నేత నారాయ‌ణ కూడా.. జ‌గ‌న్ మంచోడే కానీ.. విధానాలే మార్చుకోవాలి. అని వ్యాఖ్యానించ‌డం వెనుక‌.. మిత్ర‌త్వం కోసం చేతులు చాపుతున్న ప‌రిస్థితి క‌నిపిస్తోంది. ఇక‌, లేస్తే.. నా అంత చెడ్డోడు లేడ‌నే.. సీపీఐ సీనియ‌ర్ నేత ఒక‌రు కూడా వైసీపీతో జ‌ట్టుకు రెడీ అంటూ.. సంకేతాలు ఇచ్చారు.

మ‌రోవైపు.. సీపీఎం కూడా ఇదే బాట‌లో ఉంద‌న్న అభిప్రాయాన్ని వ్య‌క్తం చేస్తున్నారు. ఇక‌, చిన్నాచిత‌కాపార్టీలు లెక్కుకు మిక్కిలిగా జ‌గ‌న్‌ను క‌లుపుకొని పోయేందుకురెడీ అవుతున్నాయి. కానీ, ఈ పార్టీలు ఎక్క‌డా అమ‌రావ‌తిని వ్య‌తిరేకించ‌డం లేదు. అమ‌రావ‌తిలో ఏదో జ‌రుగుతోంద‌ని.. అది మాత్ర‌మే తప్పు అంటున్నారు. కానీ.. జ‌గ‌న్ పూర్తిగా అమ‌రావ‌తిని ప‌క్క‌న పెట్టేయ‌డం, మావిగ‌న్‌ను భుజాన త‌గిలించుకోవ‌డంతో ఈ పార్టీలు ఇప్పుడు జ‌గ‌న్‌ను ప‌క్క‌న పెట్టేయాల‌ని నిర్ణ‌యించుకున్నాయి. ఈ ప‌రిణామ‌మే వైసీపీని ఇర‌కాటంలోకి నెట్టేసింది.

“మేం బ‌ల‌మైన కూట‌మితో యుద్ధం చేయాల‌ని అనుకున్నాం. అప్పుడు మేం కూడా బ‌లంగానే ఉండాలి. కానీ, మేం బ‌ల‌హీన ప‌డుతున్నామ‌న్న సంకేతాలు వ‌స్తున్నాయి. ఇది స‌రికాదు“ అని ఉత్త‌రాంధ్ర‌కు చెందిన మాజీ మంత్రి ఒక‌రు వ్యాఖ్యానించారు. ఇది ఆయ‌న ఒక్క‌మాట మాత్ర‌మేకాదు.. సీమ‌లోనూ రెడ్డి నాయ‌కులు జ‌గ‌న్‌ను స‌మ‌ర్థించ‌క పోవ‌డం గ‌మ‌నార్హం. ఇక‌, మావిగ‌న్ ప్ర‌క‌ట‌న త‌ర్వాత‌.. క‌మ్యూనిస్టులు జ‌గ‌న్‌కు బుర్ర‌లేద‌ని వ్యాఖ్యానించ‌డం గ‌మ‌నార్హం. ఇలా.. ప‌రిణామాలు మ‌రింత ప‌దును తేలుతున్న నేప‌థ్యంలో క‌లివిడి లేక‌పోతే.. క‌ష్ట‌మ‌నే అభిప్రాయం వైసీపీ నాయ‌కుల్లో జోరుగా వినిపిస్తోంది.