రాజకీయాల్లో ఇక అంతా అయిపోయింది.. అనుకున్న పరిస్థితి నుంచి ఉత్తుంగతరంగంగా పైకెగసిన నాయకుడు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. రాజకీయాల్లోకి రావడమే గొప్ప అనుకునే రోజుల్లో పొలిటికల్ బాట పట్టిన ఆయన.. ఇండిపెండెంటుగానే తన ప్రయాణాన్ని కొనసాగించారు. అలా అలా అంచెలంచెలుగా ఎదిగి.. నేడు జాతీయ కాంగ్రెస్ పార్టీలో కీలక రోల్ పోషించడమే కాదు.. ఎందరో కురువృద్ధులు ఆశించిన ముఖ్యమంత్రి పీఠాన్ని దక్కించుకున్నారు. కాగా.. రేవంత్ రెడ్డి రాజకీయ అడుగులు పరుగుల వరదగా మారి నేటి 20 ఏళ్లు పూర్తయ్యాయి.
అనేక సమస్యలు..
రాజకీయాల్లో రావడం సరే.. నిలదొక్కుకోవడం.. తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకోవడం వంటివి నాయకులకు అంత ఈజీకాదు. ఈ విషయంలో రేవంత్ రెడ్డి కూడా మినహాయింపు కాదు. నిజానికి ఆయన రాజకీయ ప్రస్థానం కొడంగల్ నియోజకవర్గంలోని మిడ్జిల్ జిల్లా పరిషత్ సభ్యుడిగా ప్రారంభమైంది. 2006లో స్వతంత్ర అభ్యర్థిగా అరంగేట్రం చేసి.. విజయం దక్కించుకున్నారు. తనదైన వాక్చాతుర్యం.. సమస్యల పట్ల అవగాహన, ఎంతటి వారితోనైనా కలుపుగోలుగా వ్యవహరించే తీరు వంటివి రేవంత్‌ను రాజకీయాల్లో ఎదిగేలా చేశాయి.
తర్వాత.. ఎమ్మెల్సీగా పోటీ చేసి విజయం దక్కించుకున్నారు. ఇక, ఆ తర్వాత.. ఎమ్మెల్యేగా ఎదిగారు. ఈ క్రమంలోనే తన రాజకీయ ప్రస్థానాన్ని తెలుగు దేశం పార్టీతో ప్రారంభించారు. ముఖ్యంగా చంద్రబాబుకు అత్యంత సన్నిహిత నేతగా మారడం వెనుక, నిబద్ధత, నిజాయితీలే ఎక్కువగా పనిచేశాయి. అదే సమయంలో షార్ప్ షూటర్‌గా పార్టీలో తనదైన గుర్తింపు తెచ్చుకున్నారు. ఫలితంగా అనతికాలంలోనే టీడీపీలో ఐకాన్ యువ నాయకుడిగా రేవంత్ గుర్తింపు సాధించారు. ఇక, 2014లో రాష్ట్ర విభజన ఉద్యమం జరిగినప్పుడు కూడా.. ఆయన టీడీపీలోనే ఉండడం గమనార్హం.
మలుపు తిప్పిన కేసు..
2015-16 మధ్య వెలుగు చూసిన ఓటుకు నోటు చేసుకు రేవంత్ రాజకీయ ముఖ చిత్రాన్ని సమూలంగా మలుపు తిప్పింది. అప్పటి వరకు ఉన్న రేవంత్ వేరు.. తర్వాత వేరు అన్నట్టుగా ఆయన ప్రస్తానం సాగింది. ముఖ్యంగా అప్పటి పాలక పక్షం బీఆర్ ఎస్‌తో అమీతుమీ అన్నట్టుగా పోరాటం చేశారు. ఈ కేసులోనే జైలుకు కూడా వెళ్లాల్సి వచ్చింది. ఆ తర్వాత.. 2018 ఎన్నికల సమయంలో తన ఇంట్లో జరిగిన సోదాలు.. కూడా రేవంత్‌ను మరింత రాటుదేలేలా చేశాయి.
ఇక, అదే సంవత్సరం రేవంత్ రెడ్డి.. టీడీపీ నుంచి అత్యంత గౌరవ ప్రదంగా బయటకు వచ్చి కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. ఈ క్రమంలోనే పార్టీ రాష్ట్ర అధ్యక్షుడయ్యారు. ఎంతో మంచి సీనియర్లు, కురువృద్ధులు ఉన్నప్పటికీ.. రేవంత్ రెడ్డి రాజకీయ పటిమ, వాగ్ధాటి, దేనినైనా సవాల్‌గా తీసుకునే లక్షణాలను మెచ్చుకున్న కాంగ్రెస్ అధిష్టానం 2023లో ఆయన సెంట్రిక్‌గానే ఎన్నికలకు వెళ్లింది. విజయదుందుభి మొగించి.. రాష్ట్రం ఏర్పడి సుమారు 10 సంవత్సరాల తర్వాత.. అధికారం చేపట్టింది.
Gulte Telugu Telugu Political and Movie News Updates
