రేవంత్ కోరి ఖర్చులు పెంచుకుంటున్నారా?

ఒక‌వైపు రాష్ట్రంలో సొమ్ములు లేవ‌ని.. ఎవ‌రూ డ‌బ్బులు డిమాండ్ చేయ‌ద్ద‌ని సాక్ష‌త్తూ సీఎం రేవంత్ రెడ్డి చెబుతున్నారు. అంతేకాదు.. బీఆర్ ఎస్ హ‌యాంలో చేసిన 8.5 ల‌క్ష‌ల కోట్ల రూపాయ‌ల అప్పుతో రాష్ట్రం ఆ సొమ్ముల‌కు వ‌డ్డీలు క‌ట్టేందుకే ఇబ్బంది ప‌డుతోంద‌ని కూడా అంటున్నారు. ఇక‌, ఫీజు రీయింబ‌ర్స్‌మెంటు బ‌కాయిల‌పై హైకోర్టు ఇటీవ‌ల ఆగ్ర‌హం వ్య‌క్తం చేసింది. అలానే ఇందిర‌మ్మ ఇళ్ల నిర్మాణానికి కూడా ప్ర‌భుత్వం అప్పులు చేస్తున్న ప‌రిస్థితి ఉంది.

ఇవ‌న్నీ ఒక ఎత్త‌యితే.. ప్ర‌త్యేకంగా ఉన్న‌తాధికారుల‌తో భేటీ అయిన సీఎం రేవంత్ రెడ్డి ప్ర‌భుత్వ ఆదాయాన్ని పెంచాల‌ని గంట‌సేపు చ‌ర్చించారు. ఏయే విష‌యాల్లో ఆదాయం పెంచాలో కూడా స‌మ‌గ్రంగా వారికి వివ‌రించారు. అంతేకాదు.. ఒక్క‌రూపాయి కూడా వ‌ద‌ల‌వ‌ద్ద‌ని సూచించారు. మ‌రోవైపు.. కేంద్ర ప్ర‌భుత్వం నుంచి కూడా పెద్ద‌గా ఆశించిన మేర‌కు స‌హ‌కారం లేద‌ని కూడా ఆయ‌నే చెబుతున్నారు. అందుకే.. ఇబ్బందులు వ‌స్తున్నాయ‌ని అంటున్నారు.

ఇలా.. ఒక‌వైపు ఆదాయం త‌గ్గి.. అప్పులు పెరుగుతున్న క్ర‌మంలో రాష్ట్ర ప్ర‌భుత్వం జాగ్ర‌త్త‌గా అడుగులు వేయాల్సిన అవ‌స‌రం ఉంది. కానీ, తాజాగా తీసుకున్న నిర్ణ‌యంతో రాష్ట్ర స‌ర్కారుపై నెల‌కు 10 కోట్ల రూపా యల‌కు పైగానే అద‌న‌పు ఖ‌ర్చు ప‌డ‌నుంద‌ని అధికారులు చెబుతున్నారు. ఈ నిర్ణ‌యం కూడా ఇప్ప‌టి వ‌ర‌కు దేశంలో ఏ రాష్ట్ర ప్ర‌భుత్వ‌మూ అమలు చేయ‌లేద‌ని.. ఇది అన‌వ‌స‌ర‌పు భార‌మ‌నే అభిప్రాయం కూడా వ్య‌క్తం చేస్తున్నారు.

ఏంటా నిర్ణ‌యం..

రాష్ట్ర వ్యాప్తంగా ప్ర‌భుత్వ స్కూళ్లు, కాలేజీల్లో విద్యార్థుల‌కు మ‌ధ్యాహ్న‌భోజ‌న ప‌థ‌కాన్ని అమ‌లు చేస్తున్నారు. దీనిలో కేంద్రం నుంచి 60 శాతం వ‌ర‌కు నిధులు వ‌స్తాయి. గ‌తంలో 90 శాతం నిధులు వ‌చ్చేవి అయితే.. మోడీ స‌ర్కారు వ‌చ్చాక‌.. దీనిలో 30 శాతం నిధుల‌కు కోత‌పెట్టింది. దీంతో ప్ర‌భుత్వాల‌పై భారం పెరిగింది. అయినా.. ప్ర‌జా కోణంలో ఆలోచించి ఖ‌ర్చు చేస్తున్నారు. ఇక‌, తాజాగా జ‌రిగిన మంత్రి వ‌ర్గ స‌మావేశంలో టీచ‌ర్లు, లెక్చ‌రర్ల‌కు కూడా ఉద‌యం టిఫిను, మ‌ధ్యాహ్న భోజ‌నం ఆయా స్కూళ్లు, కాలేజీల్లోనే అందించాల‌ని సీఎం నిర్ణ‌యించారు. దీనికి మంత్రులు ఓకే చెప్పారు.

ఫ‌లితంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 3.5 ల‌క్ష‌ల మంది టీచ‌ర్ల‌కు, 2.2 ల‌క్ష‌ల మందికి పైగా ఉన్న ప్ర‌భుత్వ లెక్చ‌ర్ల‌కు ప్ర‌భుత్వ‌మే ఉద‌యం టిఫిన్‌(ఇది పూర్తిగా రాష్ట్ర‌ ప్ర‌భుత్వ సొమ్ముతో నిర్వ‌హిస్తున్నారు), మ‌ధ్యాహ్న భోజ‌నం అందించాల‌ని నిర్ణ‌యించారు. దీనికి కేంద్రం నుంచి నిధులు రావు. పిల్ల‌ల‌కు మాత్ర‌మే కేంద్రం 60 శాతం నిధులు ఇస్తుంది. అంటే.. ఇక‌పై టీచ‌ర్లు, లెక్చ‌ర‌ర్ల‌కు అయ్యే ఖ‌ర్చును రాష్ట్ర స‌ర్కారే భ‌రించాల్సి ఉంటుంది. ఇది నెల‌కు రూ.10 కోట్లుగా ఉంటుంద‌ని అంచ‌నా వేస్తున్నారు. ఇలా.. కోరి ఖ‌ర్చును తెచ్చుకోవ‌డం ఎందుకు? అనేదే ఇప్పుడు చ‌ర్చ‌కు దారితీసిన అంశం.