నాయకుడిపై కేసరి బరువు

రేపు జన నాయకుడు విడుదలవుతోంది. ఇది కాదు అసలు విశేషం. ఏపీ తెలంగాణ కొన్ని జిల్లా కేంద్రాల్లో ఉదయం 7 గంటల నుంచే ప్రీమియర్ షోలు పడుతున్నాయి. అయితే భగవంత్ కేసరి రీమేకని జనాలకు ముందే క్లారిటీ ఉండటంతో దీన్ని ఎగబడి చూసేందుకు ఎక్కువ శాతం ఆడియన్స్ సిద్ధంగా లేరనేది వాస్తవం. కేవలం యాభై శాతం మాత్రమే దగ్గరగా ఉంటుందని మిగిలినదంతా కొత్తగా మార్చామని దర్శకుడు హెచ్ వినోత్ పదే పదే చెబుతున్న సంగతి తెలిసిందే.

విచిత్రంగా విజయ్ స్వంత రాష్ట్రం తమిళనాడు కన్నా ముందు కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ లో షోలు పడుతుండటం అసలు ట్విస్టు. నిజంగా అంత క్రేజ్ ఉందా అంటే ఠక్కున ఔనని చెప్పలేం కానీ మొదటి ఆట అయ్యాక జనాల రియాక్షన్లు ఎలా ఉంటాయనే దాని గురించి మూవీ లవర్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే భగవంత్ కేసరి పోలికలను తప్పించుకోవడం అసాధ్యం. ఏ మాత్రం అటు ఇటు అయినా ఏకంగా ట్రోలింగ్ కి దారి తీస్తుందని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.

అయితే మేకర్స్ ఆ విషయంలో ఆందోళన పడటం లేదు. ఎందుకంటే వాళ్ళ ప్రధాన మార్కెట్ తమిళనాడు, ఓవర్సీస్. ఒకవేళ తెలుగులో పెద్దగా వర్కౌట్ కాకాపోయినా టెన్షన్ లేదు. ఒకవేళ హిట్ అయితే బోనస్ అనుకుంటారు అంతే. ఎలాగూ ఎల్లుండి చెన్నై లవ్ స్టోరీ తప్ప వేరే కాంపిటీషన్ లేదు. జన నాయకుడు ఒకసారి చూడొచ్చనే టాక్ తెచ్చుకుంటే ఆటోమేటిక్ గా వసూళ్లు పెరుగుతాయి. కానీ అది జరిగేంత హైప్ దీనికి లేదన్నది ఒప్పుకోవాల్సిన వాస్తవం.

ఒకటి రెండు మినహాయించి తుపాకీ నుంచి గోట్ వరకు విజయ్ సినిమాలు మన దగ్గర బాగా పెర్ఫార్మ్ చేశాయి. టీవీ సీరియల్ అనిపించుకున్న వారసుడు కూడా అంతో ఇంతో డబ్బులు తెచ్చింది. అవన్నీ స్ట్రెయిట్ కథలు కాబట్టి మనోళ్లు ఆదరించారు. కానీ జన నాయకుడు అలా కాదు. ఎన్ని మార్పులు చేసినా ఒరిజినల్ స్టోరీ ఆల్రెడీ చూసిందే కాబట్టి అంత ఎగ్జైట్ మెంట్ టాలీవుడ్ జనాల్లో కనిపించదు. అయినా సరే ఈ బలహీనతకు దాటుకుని జన నాయకుడు హిట్టు కొడితే మాత్రం కొత్త రికార్డే అని చెప్పాలి.