వైసీపీ నేత, ఎమ్మెల్యే దువ్వాడ శ్రీనివాస్ అదృశ్యం వ్యవహారం రాష్ట్రంలో సంచలనంగా మారింది. మంగళవారం మధ్యాహ్నం 3 గంటల సమయంలో పోలీసు స్టేషన్‌కు వెళ్తున్నానని చెప్పిన ఆయన రాత్రి 8 గంటల వరకు ఆచూకీ లేకుండా పోవడంతో పెను దుమారంగా మారింది. దీనిపై ఆయన సన్నిహితురాలు మాధురి పోలీసులపై తీవ్ర విమర్శలు చేశారు. వారే దువ్వాడ శ్రీనును అపహరించి ఉంటారని వ్యాఖ్యానించారు. ఇదేసమయంలో దువ్వాడ మద్దతుదారులు, వైసీపీ కార్యకర్తలు ఆందోళనకు దిగారు. ఈ నేపథ్యంలో పోలీసులు మాధురుని హౌస్ అరెస్టు చేశారు. నిరసన కారులను అదుపులోకి తీసుకున్నారు.
అసలేం జరిగింది?
వైసీపీ ఎమ్మెల్సీగా ఉన్న శ్రీకాకుళం జిల్లాకు చెందిన దువ్వాడ శ్రీనివాస్.. గతంలో జనసేన అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌పై విమర్శలు గుప్పించారు. దీనిపై పోలీసులు కేసులు నమోదు చేశారు. ఇటీవల విచారణకు రావాలంటూ శ్రీనివాస్‌కు నోటీసులు ఇచ్చారు. దీంతో మంగళవారం ఆయన పోలీసుల ముందు హాజరవుతానని పేర్కొన్నారు. దీని ప్రకారం మధ్యాహ్నం సమయంలో ఇంటి నుంచి పీఏ, డ్రైవర్‌తో కారులో బయలు దేరారు. అయితే.. రెండు గంటలు గడిచిన తర్వాత కూడా.. దువ్వాడ ఆచూకీ తెలియకపోవడంతో మాధురి ఎంట్రీ ఇచ్చారు.
మీడియాను ఇంటికి పిలుచుకుని ఆమె పోలీసులపై తీవ్ర ఆరోపణలు చేశారు. దువ్వాడ శ్రీనును పోలీసులే అపహరించి ఉంటారని.. లేకపోతే రెండు గంటలు గడిచినా ఆయన ఆచూకీ ఎందుకు తెలియడం లేదని పేర్కొన్నారు. ఈ వ్యవహారం తీవ్రంగా మారు తుండడంతో దువ్వాడ పోలీసులు స్పందించారు. తమకు శ్రీనుకు సంబంధం లేదని, ఆయన విచారణకు ఎప్పుడు వస్తారా? అని తాము ఎదురు చూస్తున్నామని.. కానీ, స్టేషన్‌కు రాలేదని పేర్కొన్నారు. మరోవైపు మాధురి బహిరంగ ఆందోళనకు రెడీ అవుతుండడంతో హుటాహుటిన ఆమె నివాసానికి చేరుకుని హౌస్ అరెస్టు చేశారు.
వాస్తవం ఏంటి?
వాస్తవానికి దువ్వాడ శ్రీను ఇంటి నుంచి బయటకు వచ్చారు. మార్గమధ్యంలో ఆయన అదృశ్యమయ్యారని అంటున్నారు. ఈ క్రమంలో తన ఫోన్ నుంచి ఆయన సెల్ఫీ వీడియో విడుదల చేశారు. తన పీఏ, డ్రైవర్‌తో కలిసి ఆయన కనిపించకుండా పోయారు. కొందరు అనుచరులు.. ఆయన విజయనగరం వెళ్లారని చెబుతుండగా.. మరికొందరు విజయవాడకు వెళ్లి ఉంటారని అంటున్నారు. ప్రస్తుతం ఈ వ్యవహారం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారింది. దువ్వాడ మాధురి హౌస్ అరెస్టు, శ్రీను అదృశ్యం ఘటనలపై ప్రభుత్వం కూడా స్పందించింది. దీనిపై ఎస్పీ జోక్యం చేసుకోవాలని ఆదేశించింది.
Gulte Telugu Telugu Political and Movie News Updates