ఏపీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు కస్టోడియల్ టార్చర్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఐపీఎస్ అధికారి సునీల్ కుమార్.. మంగళవారం(జూన్ 30) రిటైర్మెంట్ కానున్నారు. గతంలో ఆయన సీఐడీ చీఫ్‌గా పనిచేశారు. ఆ సమయంలో రఘు రామను లక్ష్యంగా చేసుకున్నారన్న వాదన ఉంది. వైసీపీ నేతలకు సహకరించి ఆయనను వేధించారని కేసు కూడా నమోదైంది. ఇదిలావుంటే, కూటమి సర్కారు వచ్చిన త ర్వాత.. ఆయనను సస్పెండ్ చేశారు. గతంలో అగ్నిమాపక శాఖ డీజీగా ఉన్న సమయంలో ఉన్నతాధికారులకు చెప్పకుండానే విదేశాలకు వెళ్లారన్నది ఆయనపై ఉన్న మరో ఆరోపణ.
ప్రస్తుతం ఈ విషయంపైనే ప్రభుత్వం విచారణ చేస్తోంది. కోర్టులో ఈ కేసు పెండింగులో ఉంది. ఇంతలోనే సునీల్ కుమార్ రిటైరయ్యారు. అయితే.. ఆయనకు ఎలాంటి రిటైర్మెంట్ బెనిఫిట్స్ నిలుపుదల చేయరాదని, రిటైర్మెంట్ విషయంలో కేసులను చూపించి ఇబ్బందులు కలిగించరాదని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు ఉత్తర్వులు కూడా జారీ చేసింది. అయితే.. అసలు సమస్య ఐపీఎస్ సునీల్ కుమార్ సతీమణి నుంచే ఎదురైంది. రిటైర్మెంట్ బెనిఫిట్స్ కింద దక్కే సుమారు కోటి రూపాయలకు పైగా సొమ్మును నిలుపుదల చేయాలంటూ ఆమె ప్రభుత్వానికి విన్నించారు.
ఈ మేరకు సునీల్ సతీమణి అరుణ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి లేఖ రాశారు. తన భర్తతో తనకు కుటుంబ పరమైన వివాదాలు ఉన్నాయని.. 2017లోనే తాను కోర్టును ఆశ్రయించి గృహ హింస చట్టం కింద కేసు పెట్టానని పేర్కొన్నారు. ఈ కేసులో పెండింగులో ఉన్న నేపథ్యంలో బెనిఫిట్స్‌ను నిలుపుదల చేయాలని కోరారు. ఒకవేళ ఇప్పుడే ఆ సొమ్మును ఆయనకు ఇచ్చేస్తే భవిష్యత్తులో తనకు ఇబ్బంది ఏర్పడుతుందని.. ఆ సొమ్మును ఇతరుల ఖాతాలకు మళ్లించే ప్రమాదం ఉందని అరుణ పేర్కొన్నారు. తన జీవించే హక్కును దృష్టిలో పెట్టుకొని.. సునీల్‌కుమార్ రిటైర్మెంటు బెనిఫిట్స్‌ను నిలుపుదల చేయాలని ఆమె కోరారు.
ఈ లేఖను పరిగణనలోకి తీసుకున్న ప్రభుత్వం బెనిఫిట్స్‌ను నిలుపుదల చేస్తూ.. సోమవారం మరో ఉత్తర్వు జారీ చేసింది. దీంతో సునీల్‌కు సొమ్ము విడుదల వ్యవహారం సంకటంగా మారింది. అయితే.. ఇలాంటి సందర్భాల్లో ప్రభుత్వాలు జోక్యం చేసుకునే అవకాశాలు చాలా తక్కువ. గతంలో సుప్రీంకోర్టు కూడా ఉద్యోగి జీత భత్యాలు సహా.. రిటైర్మెంట్ బెనిఫిట్స్‌పై ఆ ఉద్యోగికి మాత్రమే హక్కు ఉంటుందని.. స్పష్టం చేసింది. ఈ నిధులను ఆపేందుకు లేదా వేరే వారికి బదిలీ చేసేందుకు సంపూర్ణ హక్కు ఉద్యోగికి మాత్రమే ఉంటుందని స్పష్టం చేసింది. దరిమిలా.. ఇప్పుడు సర్కారు ఏం చేస్తుందన్నది చూడాలి.
Gulte Telugu Telugu Political and Movie News Updates