తెలంగాణ బీజేపీపై హై కమాండ్ సీరియస్

తెలంగాణ బీజేపీని బ‌లోపేతం చేయ‌డ‌మే ల‌క్ష్యంగా అడుగులు వేస్తున్న బీజేపీ.. వ‌చ్చే ఎన్నిక‌ల్లో అధికారం ద‌క్కించుకోవాల‌ని భావిస్తోంది. అయితే.. పైకి అలా అనుకున్నా.. క్షేత్ర‌స్థాయిలో కీల‌క నాయ‌కుల మ‌ధ్య మాత్రం అంత‌ర్గ‌త విభేదాలు కొన‌సాగుతూనే ఉన్నాయి. సాక్షాత్తూ పార్టీ జాతీయ అధ్య‌క్షుడు నితిన్ న‌బీన్ పాల్గొన్న వ‌రంగ‌ల్ స‌భ‌లోనే విభేదాలు బ‌య‌ట ప‌డ్డాయి. వేదిక‌పైనే ఉన్న‌ప్ప‌టికీ.. కేంద్ర‌మంత్రులు, బీజేపీ అగ్ర‌నేత‌లుగా భావిస్తున్న బండి సంజ‌య్‌, కిష‌న్ రెడ్డిలు ప‌న్నెత్తు ప‌ల‌క‌రింపు లేకుండానే స‌భ ముగిసింది.

ఇక‌, బీజేపీ ఐక్య‌త‌ను చాటి చెప్పాల‌ని అనుకుని.. ఒక‌రినొక‌రు చేతులు పైకెత్తిన‌ప్పుడు కూడా ప‌క్క ప‌క్క‌నే ఉన్న బండి సంజ‌య్‌, కిష‌న్‌రెడ్డిలు వేర్వేరుగా ఉండిపోయారు. ఇక‌, మ‌రో కీల‌క నాయ‌కుడు.. ఎంపీ ఈట‌ల రాజేంద‌ర్ కూడా దూరంగానే ఉన్నారు. ఈ ప‌రిణామాలు.. స‌హ‌జంగానే బీజేపీలో అనైక్య‌త‌ను చాటి చెబుతున్నాయి. ఇవి మ‌రింత‌గా పెరిగిపోయే ప్ర‌మాదం ఉంద‌ని కూడా అంచ‌నాలు వ‌స్తున్నాయి. ఈ నేప‌థ్యంలో నితిన్ న‌బీన్‌.. వీరితో ప్ర‌త్యేకంగా మాట్లాడార‌ని పార్టీ వ‌ర్గాలు చెబుతున్నాయి. క‌లివిడి, క‌లిసి ఉంటే ప్ర‌యోజ‌నాలను ఆయ‌న వివ‌రించిన‌ట్టు స‌మాచారం.

పార్టీలో గ‌త కొన్నాళ్లుగా ఈట‌ల రాజేంద‌ర్‌, బండి సంజ‌య్‌ల మ‌ధ్య ఆధిప‌త్య ధోర‌ణితో కూడిన రాజ‌కీయాలు సాగుతున్నాయి. ఇక‌, కిష‌న్ రెడ్డి ఢిల్లీలో చ‌క్రం తిప్పి.. త‌న‌కు ప‌ద‌వులు రాకుండా చేస్తున్నార‌న్న వాద‌న‌లో కొంద‌రు నాయ‌కులు ఉన్నారు. ఈ ప‌రిణామాల‌తోనే పార్టీలో అగ్రనేత‌లు ఉన్న‌ప్ప‌టికీ.. వారి మ‌ధ్య స‌ఖ్య‌త లేకుండా పోయింద‌నే చ‌ర్చ ఉంది. దీనిపై గ‌ట్టిగానే స్పందించిన నితిన్ న‌బీన్‌.. ఇక‌పై ఇలా ఉండొద్ద‌ని.. క‌లిసి ప‌నిచేయాల‌ని ఆయన సూచించిన‌ట్టు తెలిసింది. అంద‌రూ క‌లిసి ముందుకు వెళ్లాల‌ని పార్టీ త‌ర‌ఫున ప్ర‌జ‌ల‌ను క‌ల‌వాల‌ని కూడా చెప్పిన‌ట్టు స‌మాచారం.

భారీ ప్ర‌ణాళిక‌!

రాబోయే రోజుల్లో తెలంగాణలో బీజేపీ విస్త‌రించేందుకు భారీ ప్ర‌ణాళిక‌లు ర‌చించిన నితిన్ న‌బీన్‌.. కాంగ్రెస్ పార్టీ ప్ర‌భుత్వ వైఫ‌ల్యాల‌ను ప్ర‌జ‌ల మ‌ధ్య‌కు తీసుకువెళ్లాల‌ని సూచించారు. అయితే.. నాయ‌కుల మ‌ధ్య ముఖ్యంగా అగ్ర‌నేత‌ల మ‌ధ్యే వివాదాలు కొన‌సాగ‌డం,ఒక‌రినొక‌రు ప‌ల‌కరింపులు కూడా లేక‌పోవ‌డం వంటివి ఆయ‌న‌కు ఆవేద‌న క‌లిగించిన‌ట్టు తెలిసింది. ఈ క్ర‌మంలోనే క‌లివిడిగా ఉండాల్సిందేన‌ని.. పార్టీ చెప్పిన‌ట్టు వినాల్సిందేన‌ని తేల్చి చెప్పార‌ని సీనియ‌ర్ నాయ‌కుడు ఒక‌రు మీడియాకు చూచాయ‌గా చెప్పుకొచ్చారు. మ‌రి నితిన్ సూచ‌న‌లు ఏమేర‌కు ఫ‌లిస్తాయో చూడాలి.